అమెరికా టు అనకాపల్లి... మిరపకాయ
తిండి గోల
కొన్నివంటకాలను కొన్ని పదార్థాలు లేకపోయినా వండచ్చు. కానీ, కారం లేకుండా మాత్రం వండలేం. తెలుగువారి ఆహార సంస్కృతి చరిత్రను మిరపకాయల రాకకు ముందు యుగం, తరువాతి యుగం అని రెండుగా విభజించవచ్చు. విజయనగర సామ్రాజ్య కాలంలో పోర్చుగీసులు మిరపకాయల్ని భారతదేశానికి తీసుకురాగా, తెలుగువారు వాటిని అందుకొన్నారు. ఇప్పుడు ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉండే విధంగా మిరపకాయల్ని పండిస్తున్నారు భారతీయలు. మిరపకాయలు పరిచయం అయ్యేవరకు మనకు తెలిసిన కారపు ద్రవ్యాలు మిరియాలు, పిప్పళ్లు, శొంఠి, అల్లం, జీలకర్ర, వాము, దాల్చిన చెక్క.. వీటినే ఆహారంలో కారంగా వాడుకునేవారు.
మిరియాల్ని సంస్కృతభాషలో ‘మరీచి’ అంటారు. మిరియంపు కాయలు అనే మాట మిరపకాయలుగా రూపొందిందని భాషావేత్తలు చెబుతారు. అలాగే, మరీచి పదం ‘మిర్చి’గా మారి ఉండవచ్చు. ఇండియాకి దారి కనుక్కోవడానికి బయల్దేరిన కొలంబస్ పొరబాటున అమెరికా చేరినప్పుడు, మెక్సికో తీరంలో అతనికి ఈ కారపు కాయలు కన్పించాయట. అమెరికా నుంచి కొలంబస్ తెచ్చిన ఈ మిరపకాయల్ని పోర్చుగీసులు తెచ్చి భారతదేశానికి కారపు రుచిని అంటించారు.