స్టెయిన్ లెస్ స్టీల్ ఎలక్ట్రిక్ వార్మింగ్ ట్రే..
చాలామంది వేడివేడి రుచులను కోరుకుంటారు. కొన్నిసార్లు ఏదో కారణంతో ఆలస్యం అయినప్పుడు వంటకాల వేడి చల్లారిపోయి, తినాలన్న ఆసక్తి కోల్పోతారు. ఆ సమస్యను దూరం చేస్తుంది ఈ ఎలక్ట్రిక్ వార్మింగ్ ట్రే. ఇది కిచెన్ లో ఉంటే టిఫిన్, లంచ్, డిన్నర్‌తో పాటు స్నాక్స్ టైమ్‌లో కూడా వేడివేడి పదార్థాలనే అందుకోవచ్చు. అంతే కాకుండా, టీ, కాఫీ వంటి వేడి పానీయాలను ఫ్లాస్క్‌లో భద్రపరచుకోవాల్సిన పనిలేదు.
పార్టీలు, ఫంక్షన్ల సమయంలో కూడా ఈ ట్రే ఉంటే, ఆరగించే రుచులు ఎప్పటికప్పుడు వేడివేడిగా పొగలు కక్కుతూ ఉంటాయి. కేవలం కొన్ని నిమిషాల ముందు ఈ ట్రే మీద వేడి చేయాలనుకున్న వంటకాలను, కాఫీ, టీ వంటి పానీయాలను ఉంచితే సరిపోతుంది. దీనిలో 216 డిగ్రీల ఫారెన్ హీట్ నుంచి 316 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు త్రీ మోడ్స్ టెంపరేచర్ ఆప్షన్ ఉండటంతో, ఏది ఎంత వేడి కావాలో అంతే పెట్టుకునే వీలుంటుంది. దీనిపైన సిరామిక్ టేబుల్ వేర్, గ్లాస్ వేర్‌తో పాటు క్యాస్రోల్ మెటల్ కలిగిన ఏ పాత్రలోని ఆహార పదార్థాలనైనా, పానీయాలనైనా వేడి చేసుకోవచ్చు.
శాండ్‌విచ్ అండ్ మోర్..
ఈ రోజుల్లో ఇలాంటి ఒక మేకర్ ఇంట్లో ఉంటే, నచ్చిన అల్పాహారం, నచ్చిన చిరుతిళ్లను ఇట్టే సిద్ధం చేసుకోవచ్చు. మెల్ట్, టోస్ట్, ఫ్రై వంటి చాలా ఆప్షన్స్ ఇందులో ఉంటాయి. దీని మీద ఆమ్లెట్, పాన్ కేక్స్, కట్లెట్స్‌తో పాటు శాండ్విచ్, బర్గర్స్ వంటివీ రెడీ చేసుకోవచ్చు. ఇందులో మొత్తం ఏడు సెట్టింగ్స్ ఉంటాయి.
దీన్ని ఓపెన్ చేసుకుని, రెండు వైపులా అధిక మోతాదులో ఆహారాన్ని వండుకోవచ్చు. లేదంటే ఫోల్డ్ చేసుకుని, ఒకేసారి నాలుగు శాండ్‌విచ్‌లను రెడీ చేసుకోవచ్చు. దీన్ని ఫోల్డ్ చేసుకున్నాక లాక్ చేసుకునే వీలు కూడా ఉంటుంది. దాంతో ఇందులోని పదార్థాలు వేగంగా బేక్ అవుతాయి. దీనిలోని నాణ్యమైన నాన్–స్టిక్ ప్లేట్ డివైస్‌కి అటాచ్ అయ్యే ఉంటుంది. దీన్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ మేకర్‌ని ఇతర ప్రదేశాలకు సులభంగా తీసుకెళ్లొచ్చు!
టేబుల్‌టాప్ బార్బెక్యూ గ్రిల్..
కుటుంబంతో లేదా స్నేహితులతో పిక్నిక్‌లకు, క్యాంపింగ్‌లకు వెళ్లినప్పుడు.. ఇలాంటి ఓ బార్బెక్యూ గ్రిల్‌ని వెంట తీసుకుని వెళ్తే, వేళకు క్రిస్పీ రుచులను అందుకోవచ్చు. ఇది బొగ్గులతో లేదా చెక్క ముక్కలతో పని చేస్తుంది. దీని అడుగున వాటిని వేసి, నిప్పు రాజేసి పైన గ్రిల్ అమర్చుకోవాలి. వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా దీని మీద చాలా టేస్టీగా గ్రిల్ చేసుకోవచ్చు.
పైగా దీనికి అదనంగా ఒక వుడెన్ ట్రే, ఫుడ్ స్టోరేజ్ ట్రే లభిస్తాయి. వుడెన్ ట్రే మీద వంట చేసుకునే ముందు ముక్కలు కట్ చేసుకోవచ్చు. ఇక స్టోరేజ్ ట్రేను వంట పూర్తి అయిన తర్వాత సర్వ్ చేసుకోవడానికి వినియోగించుకోవచ్చు. దీనికి ముందువైపు కదలకుండా లాక్ చేసుకునే వీలుండటంతో ఈ గ్రిల్‌ని సులభంగా ఎక్కడికైనా తీసుకుని వెళ్లొచ్చు. దీనికి ఇరువైపులా హ్యాండిల్స్ ఉండటంతో వంట అవుతున్న సమయంలో కూడా ఒకచోట నుంచి మరోచోటికి సులువుగా కదల్చవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment