High security plates
-
ఈ బండి ఎవరిదో..?
♦ నంబర్ ప్లేట్లు లేకుండానే తిరుగున్న ద్విచక్రవాహనాలు ♦ ఉమ్మడి జిల్లాలో పేరుకుపోయిన 8 వేల హై సెక్యూరిటీ ప్లేట్లు ♦ టీఆర్ నంబర్ సైతం కేటాయించని షోరూంలు ♦ ప్రమాదాల సమయంలో గుర్తించడంలో ఇబ్బందులు ♦ పట్టించుకోని పోలీస్, రవాణా శాఖాధికారులు మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలు ద్విచక్రవాహనాలు ఎలాంటి నంబరు ప్లేటు లేకుండా రోడ్లపై రయ్.. రయ్‌మంటూ దూసుకుపోతున్నాయి. పలు బైక్ షోరూం నిర్వాహకులు సైతం వాహనాలు షోరూం నుంచి డెలివరీ చేసే సమయంలో వాహనాలకు ఇచ్చే సమయంలో తాత్కాలిక (టీఆర్) నంబర్ కేటాయించకుండా స్టిక్కర్ అతికించి చేతులు దులుపుకొంటున్నారు. నంబర్ ప్లేట్ లేకపోవడంతో ప్రమాదాల జరిగిన సమయంలో నిందితులను గుర్తించడానికి ఇబ్బందిగా మారుతోంది. దీంతో ప్రభుత్వం నంబర్ ప్లేట్లను తప్పనిసరి చేస్తూ ప్రమాదాలు జరిపిన వారు ఎక్కడున్నా తెలిసేలా ‘హై సెక్యూరిటీ’ నంబర్ పేట్లను తయారు చేయించి వాహనదారులకు అప్పగిస్తోంది. అయితే వాహనదారులు కొత్త వాహనం కొనగానే రవాణా శాఖలో రిజిస్ట్రేషన్‌కి వచ్చినప్పుడు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్‌కు వాహనాన్ని బట్టి నిర్ణయించిన ధర చెల్లిస్తేనే వాహనం రిజిస్ట్రేషన్ అవుతుంది. నంబర్‌ను ఆ రోజు సాయంత్రమే రవాణా శాఖ కేటాయిస్తుంది. రెండు రోజుల్లో నంబర్ ప్లేట్ పూర్తయి బిగించుకోవాలని సెల్‌ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. అయితే వాహనదారులు పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఆ ప్లేట్ అన్ని బిగింపు కేంద్రంలోనే ఉండిపోతున్నాయి. పోలీసులు, రవాణా శాఖాధికారులు కూడా తనిఖీలు చేయకపోవడంతో వాహనదారులు నంబరు ప్లేట్ల బిగింపునకు ఆసక్తి చూపడంలేదు. సాంకేతిక పరిజ్ఞానంతో.. గతంలో వాహనదారులు దొంగ నంబర్ ప్లేట్లు వాడుతుండడంతో పలు కేసుల్లో నిందితులను పట్టుకోవడం చాలా ఇబ్బందులుండేవి. ఇబ్బందులు ఉండకుండా తప్పు చేసిన వారు ఎక్కడున్నా తెలిసేలా సీసీ కెమెరాలో నమోదయ్యేలా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. వాహనదారులు ఇష్టారీతిన వాడకుండా నిబంధనల ప్రకారం తయారు చేసిన హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లను అమలు చేసింది. అయితే రెండు మూడేళ్లుగా రవాణా శాఖలో ఎనిమిది వేలకు పైగా నంబర్ ప్లేట్లు వాహనదారులకు బిగించుకోకపోవడంతో మూలనపడ్డాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలా వరకు ద్విచక్రవాహనాలకు నంబర్ ప్లేట్లు లేకుండా అధికారుల ముందు తిరిగినా చర్యలు శూన్యం. ఏవైనా ప్రమాదాలు, దోపిడీలు జరిగినప్పుడు నిందితులను ఎలా పట్టుకుంటారో అధికారులకే తెలియాలి మరి. నెల రోజుల గడువిస్తాం.. చాలా వరకు వాహనదారులు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నెంబర్ ప్లేట్లు బిగించుకోకుండా వెళ్తున్నారు. దీని ద్వారా నెంబర్ ప్లేట్ బిగింపు సెంటర్లో చాలా వరకు మిగిలిపోతున్నాయి. అలాంటి వారికి ఈ నెల 15 నుంచి జూలై 15 వరకు గడువు కేటాయిస్తున్నాం. ఈ సమయంలో వచ్చిన వాహనదారులకు ఉచితంగా ప్లేట్లు బిగిస్తాం. రాకపోతే జిల్లాలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నంబర్ ప్లేట్లు లేని ప్రతి వాహనంపై కేసులు నమోదు చేసి.. సీజ్ చేస్తాం. – మమత ప్రసాద్, డీటీసీ, మహబూబ్‌నగర్ -
‘హైసెక్యూరిటీ’ ప్లేట్లపై నిర్లక్ష్యమెందుకు?
- ఆర్టీసీకి ఘాటుగా లేఖ రాసిన రవాణా కమిషనర్ హైదరాబాద్: తెలంగాణలో హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల (హెచ్ఎస్ఆర్పీ) వ్యవహారం గందరగోళంగా మారింది. వాహనం రిజిస్ట్రేషన్ సమయంలోనే నంబర్ ప్లేట్ల చార్జీలు ముక్కుపిండి వసూలు చేస్తున్న కాంట్రాక్టు సంస్థ సకాలంలో వాటిని వాహనదారులకు అందించకుండా వేధిస్తోంది. కొద్దిరోజులుగా దీనిపై రవాణా శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రాజెక్టును పర్యవేక్షించాల్సిన ఆర్టీసీ మాత్రం ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీనిపై స్పందించిన రవాణాశాఖ కొత్త కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా సకాలంలో ప్లేట్లను అందించకుంటే కాంట్రాక్టు సంస్థకు పెనాల్టీ విధించే అవకాశాన్ని ఉటంకిస్తూ ఆర్టీసీకి ఘాటుగా లేఖ రాశారు. దీంతో కంగుతిన్న ఆర్టీసీ అధికారులు కాంట్రాక్టు సంస్థకు నోటీసు ఇవ్వాలని నిర్ణయించారు. -
నెంబర్‌ప్లేట్ల అంబర్ ‘ఫిటింగ్’
హైసెక్యూరిటీ ప్లేట్లపై అక్రమ వసూళ్లు వాహనదారులపై రూ.లక్షల్లో అదనపు భారం లబోదిబోమంటున్న వాహనదారులు సాక్షి,సిటీబ్యూరో: నగరంలో రోజుకో నిబంధనతో వాహనదారులు జంకే పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో హెల్మెట్ మస్ట్..నెంబర్ప్లేట్లు తెల్లరంగులో ఉండాలని పలు నిబంధనలు విధించిన ప్రభుత్వం..ఇటీవల హైసెక్యూరిటీ నెంబర్ప్లేట్లు బిగించాలని ఆదేశించడం వాహనదారులకు శాపంగా మారింది. ఈ ప్లేట్ల పేరుతో నిర్వాహకులు నిలువునా దోచుకుంటున్నారు. ఈ నెంబర్‌ప్లేట్లపై ఇప్పటికే అత్యధిక ఫీజులు చెల్లిస్తున్న వాహనదారులను మరింత దోపిడీకి గురిచేస్తూ నిర్వాహకులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు జోరుగా వస్తున్నాయి. ఆదినుంచి వివాదాస్పదంగా మారిన ఈ నెంబర్‌ప్లేట్ల నిర్వాహకులకు కాసులవర్షం కురిపిస్తున్నాయి. ద్విచక్రవాహనాలపై రూ.100, కార్లపై రూ.200 చొప్పున ఫిట్టింగ్చార్జీల రూపంలో వసూలు చేస్తున్నారు. దీంతో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా భారంగా మారింది. జంటజిల్లాల్లో నిత్యం సుమారు 1500 కొత్త వాహనాలు ఆర్టీఏకార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ అవుతుంటాయి. వీటి రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వానికి చెల్లించే ఫీజులు, హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల కోసం లింక్ ఆటోటెక్ సంస్థకు చెల్లించే ఫీజులతోపాటు బిగింపు చార్జీల పేరుతో లింక్ ఆటోటెక్ నిర్వాహకులు వాహనదారులను అడ్డంగా దోచుకుంటున్నారు. నిబంధనల ప్రకారం వాహనదారులు చెల్లించిన ఫీజులోనే బిగింపు చార్జీలు ఉంటాయి. కానీ అదనపు చార్జీలు ఇవ్వాలంటూ వాహనదారుల నుంచి దర్జాగా వసూలు చేస్తున్నారు. వాహనదారుడే బలి.. సాధారణంగా కొత్తకారు రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు రూ.625, ద్విచక్ర వాహనాలకు రూ.385. కానీ దళారుల ద్వారా వస్తే తప్ప పౌరసేవలు అందజేయని ఆర్టీఏ అధికారులు ద్విచక్ర వాహనాలపై మరో రూ.200, కార్లపై రూ.300 చొప్పున అక్రమంగా వసూలు చేస్తూ రెండు జేబులు నింపుకుంటన్నారు. ఆర్టీఏలో వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని హైసెక్యూరిటీ నెంబర్‌ప్లేట్ కార్యాలయానికి వెళితే కార్లపై రూ.620, ద్విచక్రవాహనాలపై రూ.245 చొప్పున ఫీజు వసూలు చేసి ఒక తేదీని కేటాయిస్తున్నారు. నిర్ణీత తేదీ ప్రకారం వచ్చిన వాహనదారుల నుంచి ఫిట్టింగ్ చార్జీల రూపంలో మరోసారి రూ.100 నుంచి రూ.200 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇలా నగరంలో ఒక కారు రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం విధించిన ఫీజులు (రిజిస్ట్రేషన్+నెంబర్‌ప్లేట్)కాకుండా రూ.500, ద్విచక్రవాహనాలపై రూ.300 అదననంగా చెల్లించాల్సి వస్తోంది. ఫిర్యాదులొస్తే చర్యలు తీసుకుంటాం.. హైసెక్యూరిటీ నెంబర్‌ప్లేట్ల బిగింపు పేరిట తమ సిబ్బంది అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు వాహనదారులు ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా అక్రమంగా వసూలు చేస్తే ఖైరతాబాద్‌లోని తమ కార్యాలయంలో సంప్రదించొచ్చు. -రామచందర్,జనరల్ మేనేజర్ లింక్ ఆటోటెక్