నెంబర్‌ప్లేట్ల అంబర్ ‘ఫిటింగ్’
- హైసెక్యూరిటీ ప్లేట్లపై అక్రమ వసూళ్లు
- వాహనదారులపై రూ.లక్షల్లో అదనపు భారం
- లబోదిబోమంటున్న వాహనదారులు
సాక్షి,సిటీబ్యూరో: నగరంలో రోజుకో నిబంధనతో వాహనదారులు జంకే పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో హెల్మెట్ మస్ట్..నెంబర్‌ప్లేట్లు తెల్లరంగులో ఉండాలని పలు నిబంధనలు విధించిన ప్రభుత్వం..ఇటీవల హైసెక్యూరిటీ నెంబర్‌ప్లేట్లు బిగించాలని ఆదేశించడం వాహనదారులకు శాపంగా మారింది. ఈ ప్లేట్ల పేరుతో నిర్వాహకులు నిలువునా దోచుకుంటున్నారు.
ఈ నెంబర్‌ప్లేట్లపై ఇప్పటికే అత్యధిక ఫీజులు చెల్లిస్తున్న వాహనదారులను మరింత దోపిడీకి గురిచేస్తూ నిర్వాహకులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు జోరుగా వస్తున్నాయి. ఆదినుంచి వివాదాస్పదంగా మారిన ఈ నెంబర్‌ప్లేట్ల నిర్వాహకులకు కాసులవర్షం కురిపిస్తున్నాయి. ద్విచక్రవాహనాలపై రూ.100, కార్లపై రూ.200 చొప్పున ఫిట్టింగ్‌చార్జీల రూపంలో వసూలు చేస్తున్నారు. దీంతో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా భారంగా మారింది.
జంటజిల్లాల్లో నిత్యం సుమారు 1500 కొత్త వాహనాలు ఆర్టీఏకార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ అవుతుంటాయి. వీటి రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వానికి చెల్లించే ఫీజులు, హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల కోసం లింక్ ఆటోటెక్ సంస్థకు చెల్లించే ఫీజులతోపాటు బిగింపు చార్జీల పేరుతో లింక్ ఆటోటెక్ నిర్వాహకులు వాహనదారులను అడ్డంగా దోచుకుంటున్నారు. నిబంధనల ప్రకారం వాహనదారులు చెల్లించిన ఫీజులోనే బిగింపు చార్జీలు ఉంటాయి. కానీ అదనపు చార్జీలు ఇవ్వాలంటూ వాహనదారుల నుంచి దర్జాగా వసూలు చేస్తున్నారు.
వాహనదారుడే బలి..
సాధారణంగా కొత్తకారు రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు రూ.625, ద్విచక్ర వాహనాలకు రూ.385. కానీ దళారుల ద్వారా వస్తే తప్ప పౌరసేవలు అందజేయని ఆర్టీఏ అధికారులు ద్విచక్ర వాహనాలపై మరో రూ.200, కార్లపై రూ.300 చొప్పున అక్రమంగా వసూలు చేస్తూ రెండు జేబులు నింపుకుంటన్నారు.
ఆర్టీఏలో వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని హైసెక్యూరిటీ నెంబర్‌ప్లేట్ కార్యాలయానికి వెళితే కార్లపై రూ.620, ద్విచక్రవాహనాలపై రూ.245 చొప్పున ఫీజు వసూలు చేసి ఒక తేదీని కేటాయిస్తున్నారు.
నిర్ణీత తేదీ ప్రకారం వచ్చిన వాహనదారుల నుంచి ఫిట్టింగ్ చార్జీల రూపంలో మరోసారి రూ.100 నుంచి రూ.200 అదనంగా వసూలు చేస్తున్నారు.
ఇలా నగరంలో ఒక కారు రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం విధించిన ఫీజులు (రిజిస్ట్రేషన్+నెంబర్‌ప్లేట్)కాకుండా రూ.500, ద్విచక్రవాహనాలపై రూ.300 అదననంగా చెల్లించాల్సి వస్తోంది.
ఫిర్యాదులొస్తే చర్యలు తీసుకుంటాం..
హైసెక్యూరిటీ నెంబర్‌ప్లేట్ల బిగింపు పేరిట తమ సిబ్బంది అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు వాహనదారులు ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా అక్రమంగా వసూలు చేస్తే ఖైరతాబాద్‌లోని తమ కార్యాలయంలో సంప్రదించొచ్చు.
-రామచందర్,జనరల్ మేనేజర్ లింక్ ఆటోటెక్