ఈ బండి ఎవరిదో..?
♦ నంబర్ ప్లేట్లు లేకుండానే తిరుగున్న ద్విచక్రవాహనాలు
♦ ఉమ్మడి జిల్లాలో పేరుకుపోయిన 8 వేల హై సెక్యూరిటీ ప్లేట్లు
♦ టీఆర్ నంబర్ సైతం కేటాయించని షోరూంలు
♦ ప్రమాదాల సమయంలో గుర్తించడంలో ఇబ్బందులు
♦ పట్టించుకోని పోలీస్, రవాణా శాఖాధికారులు
మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలు ద్విచక్రవాహనాలు ఎలాంటి నంబరు ప్లేటు లేకుండా రోడ్లపై రయ్.. రయ్‌మంటూ దూసుకుపోతున్నాయి. పలు బైక్ షోరూం నిర్వాహకులు సైతం వాహనాలు షోరూం నుంచి డెలివరీ చేసే సమయంలో వాహనాలకు ఇచ్చే సమయంలో తాత్కాలిక (టీఆర్) నంబర్ కేటాయించకుండా స్టిక్కర్ అతికించి చేతులు దులుపుకొంటున్నారు. నంబర్ ప్లేట్ లేకపోవడంతో ప్రమాదాల జరిగిన సమయంలో నిందితులను గుర్తించడానికి ఇబ్బందిగా మారుతోంది. దీంతో ప్రభుత్వం నంబర్ ప్లేట్లను తప్పనిసరి చేస్తూ ప్రమాదాలు జరిపిన వారు ఎక్కడున్నా తెలిసేలా ‘హై సెక్యూరిటీ’ నంబర్ పేట్లను తయారు చేయించి వాహనదారులకు అప్పగిస్తోంది.
అయితే వాహనదారులు కొత్త వాహనం కొనగానే రవాణా శాఖలో రిజిస్ట్రేషన్‌కి వచ్చినప్పుడు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్‌కు వాహనాన్ని బట్టి నిర్ణయించిన ధర చెల్లిస్తేనే వాహనం రిజిస్ట్రేషన్ అవుతుంది. నంబర్‌ను ఆ రోజు సాయంత్రమే రవాణా శాఖ కేటాయిస్తుంది. రెండు రోజుల్లో నంబర్ ప్లేట్ పూర్తయి బిగించుకోవాలని సెల్‌ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. అయితే వాహనదారులు పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఆ ప్లేట్ అన్ని బిగింపు కేంద్రంలోనే ఉండిపోతున్నాయి. పోలీసులు, రవాణా శాఖాధికారులు కూడా తనిఖీలు చేయకపోవడంతో వాహనదారులు నంబరు ప్లేట్ల బిగింపునకు ఆసక్తి చూపడంలేదు.
సాంకేతిక పరిజ్ఞానంతో..
గతంలో వాహనదారులు దొంగ నంబర్ ప్లేట్లు వాడుతుండడంతో పలు కేసుల్లో నిందితులను పట్టుకోవడం చాలా ఇబ్బందులుండేవి. ఇబ్బందులు ఉండకుండా తప్పు చేసిన వారు ఎక్కడున్నా తెలిసేలా సీసీ కెమెరాలో నమోదయ్యేలా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. వాహనదారులు ఇష్టారీతిన వాడకుండా నిబంధనల ప్రకారం తయారు చేసిన హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లను అమలు చేసింది. అయితే రెండు మూడేళ్లుగా రవాణా శాఖలో ఎనిమిది వేలకు పైగా నంబర్ ప్లేట్లు వాహనదారులకు బిగించుకోకపోవడంతో మూలనపడ్డాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలా వరకు ద్విచక్రవాహనాలకు నంబర్ ప్లేట్లు లేకుండా అధికారుల ముందు తిరిగినా చర్యలు శూన్యం. ఏవైనా ప్రమాదాలు, దోపిడీలు జరిగినప్పుడు నిందితులను ఎలా పట్టుకుంటారో అధికారులకే తెలియాలి మరి.
నెల రోజుల గడువిస్తాం..
చాలా వరకు వాహనదారులు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నెంబర్ ప్లేట్లు బిగించుకోకుండా వెళ్తున్నారు. దీని ద్వారా నెంబర్ ప్లేట్ బిగింపు సెంటర్‌లో చాలా వరకు మిగిలిపోతున్నాయి. అలాంటి వారికి ఈ నెల 15 నుంచి జూలై 15 వరకు గడువు కేటాయిస్తున్నాం. ఈ సమయంలో వచ్చిన వాహనదారులకు ఉచితంగా ప్లేట్లు బిగిస్తాం. రాకపోతే జిల్లాలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నంబర్ ప్లేట్లు లేని ప్రతి వాహనంపై కేసులు నమోదు చేసి.. సీజ్ చేస్తాం. – మమత ప్రసాద్, డీటీసీ, మహబూబ్‌నగర్