హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లలో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు అమర్చే విధానంలో గందరగోళం నెలకొంది. ఏడాది క్రితం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అధికారులు ఎంతో ఆర్భాటం చేసి ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ విధానం పూర్తిగా విఫలం కావటంతో చేతులెత్తేశారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆ విధానాన్ని కాంట్రాక్టు సంస్థ లింక్ ఆటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ను ప్రారంభించినట్టు శనివారం పత్రికా ప్రకటనలు వెలువడ్డాయి.
అయితే రాష్ట్ర రాజధానిలోనే డబ్బులు చెల్లించిన తర్వాత సకాలంలో ప్లేట్లు అందక గందరగోళం నెలకొన్న తరుణంలో.. జిల్లాల్లో అది సరిగా అమలయ్యే అవకాశం లేదని అధికారులు పెదవి విరుస్తున్నారు. తెలంగాణ మొత్తం ఈ విధానాన్ని విస్తరిస్తే రవాణాశాఖ పక్షాన తాము పత్రికా ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుందని, ప్రైవేటు వ్యక్తులు ఇచ్చే ప్రకటనలకు తాము బాధ్యులం కాదంటూ కొట్టిపడేశారు. వెరసి కాంట్రాక్టు సంస్థకు, రవాణా శాఖకు మధ్య అసలు సమన్వయమే లేదని తేల్చేశారు.
దీంతో సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మొత్తం ఇప్పుడు గందరగోళంగా మారి, వాహనదారులు ఇబ్బందిపడాల్సి వస్తోంది. ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లో ఉంది. ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల ధర లతో పోలిస్తే మన రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. కమీషన్ల కక్కుర్తే దీనికి కారణమనే ఆరోపణ లు గుప్పుమన్నా అధికారులు మిన్నకుండిపోయారు.