విషాదయాత్ర
హైదరాబాద్/చింతపల్లి (దేవరకొండ) : ఇరుగు పొరుగు వారితో కలిసి ఓ కుటుంబం విహార యాత్రకు బయలు దేరింది. నాగార్జునసాగర్ జలాశయాన్ని సందర్శించి సంతోషంగా గడపాలనుకుంది. కానీ బయలు దేరిన రెండు గంటల్లోనే యాత్ర విషాదాంతమైంది. అతివేగం కారణంగా వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు అవతలి వైపున ఉన్న బస్ షెల్టర్ గోడను ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం నసర్లపల్లి వద్ద హైదరాబాద్–నాగార్జునసాగర్ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది.
మూడు వాహనాల్లో..: హైదరాబాద్‌లోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన మోయిన్ తన కుటుంబంతోపాటు ఇరుగు పొరుగు వారు కలసి సుమారు 30 మంది నాగార్జునసాగర్‌ను సందర్శించేందుకు మూడు కార్లలో ఆదివారం తెల్లవారుజామున బయలుదేరారు. చింతపల్లి మండలం నసర్లపల్లి ఎక్స్‌రోడ్డు వద్దకు రాగానే మోయిన్ కుటుంబం ప్రయాణిస్తున్న వాహనం మూలమలుపు వద్ద అదుపుతప్పి రోడ్డుకు అవతలి వైపున ఉన్న బస్ షెల్టర్ గోడను ఢీకొట్టింది. దీంతో మోయిన్ అలీ (40), అతడి కుమారుడు తమ్ము (5), అత్త అక్తర్ బేగం (55), చిన్నత్త ఆసిఫా బేగం (45)లతోపాటు మోయిన్ బావమరుదులు మహ్మద్ ముస్తాఫా (35), అబ్బాస్ (25) మృతి చెందారు. మోయిన్ భార్య నూరీబేగం, ఆసిఫా బేగం కుమారులు ఖాసీమ్, ముఖీమ్ గాయాలపాలయ్యారు. వెనుక వాహనంలో ఉన్న వారు క్షతగాత్రులను హుటాహుటిన హైదరాబాద్‌లోని ఒవైసీ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు చింతపల్లి ఎస్ఐ నాగభూషణ్‌రావు తెలిపారు.
అతివేగమే కారణమా..
హైదరాబాద్–నాగార్జునసాగర్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు పేర్కొంటున్నారు. నసర్లపల్లి గ్రామ సమీపంలో ప్రమాదకరమైన భారీ మూలమలుపు ఉంది. 140 కిలోమీటర్ల అతివేగంతో వస్తుండటం, మూలమలుపును డ్రైవర్ గమనించకపోవడంతో.. వాహనం అదుపుతప్పి రోడ్డుకు అవతలి వైపున ఉన్న బస్ షెల్టర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది.
ఆసిఫ్‌నగర్ జిర్రాలో విషాదఛాయలు
ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందడంతో ఆసీఫ్‌నగర్ జిర్రా ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పెద్ద ఎత్తున బంధుమిత్రులు కడసారి చూసేందుకు వచ్చారు. తెల్లవారుజామున వెళ్లిన వారు.. అంతలోనే విగతజీవులుగా ఇంటికి తిరిగి రావడాన్ని తట్టుకోలేక కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఉస్మానియా ఆస్పత్రిలో మృతదేహాలను ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ పరిశీలించారు. బంధువులను ఓదార్చారు.