మితిమీరిన అతివేగమే నిషిత్ ప్రాణాలు తీసింది
చిన్ని నిర్లక్ష్యమే నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా చేస్తున్నాయి. కారులో ప్రయాణిస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకునే విషయంలో చూపుతున్న అశ్రద్ధ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ విషయంలోనూ అదే జరిగింది. కారులో ప్రయాణిస్తున్నప్పుడు అతడు సీట్ బెల్ట్ ధరించలేదని తెలుస్తోంది.
కేవలం కిలోమీటర్ దూరంలో ఉన్న ఇంటికి చేరుకునే లోపే మృత్యువు కబళించింది. ఖరీదైన కారులో అత్యంత ఉత్తమమైన భద్రతా ప్రామాణికాలు. ప్రమాద సమయంలో ట్రాఫిక్ కూడా లేదు, ఎంతోకాలంగా కారు నడిపిన అనుభవంతో పాటు పక్కన మిత్రుడు... ఎన్ని ఉన్నా లాభం లేకపోయింది. ప్రాణాన్ని కాపాడలేనంత వేగం, సీట్ బెల్టు పెట్టుకోలేని కారణంగా నిషిత్ కూడా సెలబ్రిటీ దుర్మరణాల జాబితాలో చేరిపోయాడు.
పోస్ట్‌మార్టం నివేదికలో కూడా అదే వెల్లడి అయింది. బుధవారం తెల్లవారుజాము రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నిషిత్, రవివర్మ మృతదేహాలకు పోస్ట్‌మార్టం అనంతరం... మితిమీరిన అతివేగం వల్లే మృతి చెందినట్లు ఫోరెన్సిక్ వైద్యులు వెల్లడించారు. అయితే వారు మద్యం తాగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని వైద్యులు తెలిపారు.
రవివర్మ కన్నా...నిషిత్‌కే ఎక్కువగా గాయాలు అయ్యాయని, అతడి పక్కటెముకల విరిగాయని తెలిపారు. కారు బలంగా మెట్రో పిల్లర్‌ను ఢీకొనడంతో స్టీరింగ్ నిషిత్ ఛాతి భాగంలోకి వెళ్లినట్లు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాల్లోనే వారు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా పోస్ట్‌మార్టం అనంతరం అపోలో మెడికల్ కళాశాల నుంచి నిషిత్ మృతదేహాన్ని నెల్లూరు తరలించారు.