'హైస్పీడ్ రైలు అధ్యయనంలో విజయవాడను చేర్చండి'
న్యూ ఢిల్లీః ప్రతిపాదిత మైసూర్-బెంగళూరు-చెన్నై రైల్వే కారిడార్ మార్గంపై అధ్యయనాన్ని ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరానికి పొడిగించాలని భారత రైల్వే మంత్రి సురేష్ ప్రభు జర్మన్ రవాణా మంత్రి అలెగ్జాండర్ డాబ్రింట్ను కోరారు. భారత రైల్వే మంత్రి అభ్యర్థన మేరకు జర్మన్ రవాణా మంత్రి మూడు రోజుల పర్యటన నిమిత్తం మన దేశానికి వచ్చారు. ఈ నేపథ్యంలో రైల్వే నెట్వర్క్ అభివృద్ధికి సంబంధించి ఇరు దేశాల మధ్య పలు కీలక చర్చలు శుక్రవారం ఇక్కడి రైల్వే భవన్లో సాగాయి. ఏప్రిల్ 2016లో సురేష్ ప్రభు జర్మనీలో పర్యటించినప్పుడు రెండు దేశాల మధ్య రైల్వే రంగంలో సహకారానికి ఒప్పందం కుదిరింది.
ఈ నేపథ్యంలో అలెగ్జాండర్ డాబ్రింట్ మన దేశానికి వచ్చారు. రైళ్ల వేగం పెంచడం, ప్రయాణికులు, వస్తువుల రవాణా లైన్ల సామర్థ్యాన్ని పెంచడం, హైస్పీడ్ రైళ్లు, స్టేషన్ల ఆధునీకరణ తదితర అంశాలపై విస్తృత చర్చలు జరిగాయి. దేశ రైల్వే మంత్రి సురేష్ప్రభు సూచనల మేరకు భారత రైల్వేలో ప్రమాద రహిత మిషన్ లక్ష్యంగా రైలు సేవల్లో భద్రత అంశంపై ఇరు దేశాల మధ్య సంయుక్త కార్యాచరణ బృందం ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అలాగే గంటకు మూడు వందల కిలోమీటర్లకు పైబడి వేగం గల హైస్పీడ్ రైల్వే కారిడార్ ఏర్పాటుపై జర్మనీ రైల్వే విభాగం అధ్యయనం చేయాలని గతంలో భారత రైల్వే శాఖ ప్రతిపాదించింది.
మైసూరు-బెంగళూరు-చెన్నై కారిడార్లో ఈ హైస్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటుకు ఈ అధ్యయనం ఉద్దేశించింది. అయితే ఈ ప్రతిపాదనలో కొత్తగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడను కూడా చేర్చాలని రైల్వే మంత్రి సురేష్ ప్రభు తాజాగా జర్మనీ మంత్రిని కోరారు. మైసూరు-బెంగళూరు, చెన్నై-విజయవాడ కారిడార్ వల్ల ప్రాంతీయ అభివృద్ధికి ఊతం లభించడమే కాకుండా దక్షిణ భారత దేశంలోని ముఖ్యమైన రాష్ట్రాలు అనుసంధానమవుతాయని సురేష్ ప్రభు అభిలషించారు. అధ్యయనంలో విజయవాడను కూడా చేర్చాలన్న తాజా ప్రతిపాదనను విన్న జర్మనీ మంత్రి సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్టు రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి. ఈ అధ్యయనం 2017 జనవరిలో ప్రారంభం కావాల్సి ఉంది. ఈ అధ్యయనానికి వ్యయాన్ని జర్మనీ ప్రభుత్వం భరిస్తుంది.