ఉన్నతాధికారి ఇంట్లో 2లక్షల ‘అశ్లీలం’సీడీలు
రూ. 60 లక్షల విలువచేసే సీడీలు స్వాధీనం
ముంబై: బృహ న్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థ జనరల్ మేనేజర్ ఓంప్రకాశ్ గుప్తా ఫ్లాట్‌లో పోలీసులు దాడులు చేశారు. ఇందులో రూ.60 లక్షలు విలువచేసే రెండు లక్షల అశ్లీల సీడీలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఫ్లాట్ గుప్తాదే అయినా అందులో ఆయన ఉండడం లేదు. గత తొమ్మిదేళ్లుగా ఈ ఫ్లాట్‌ను అద్దెకు ఇస్తున్నారు. దీంతో అశ్లీల సీడీల కేసుకు, గుప్తాకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు నిర్ధారించారు. ఈ ప్లాట్‌లో ఉంటున్న తండ్రీకొడుకులు చంద్రకాంత్ ముఖర్జీ, సామ్రాట్ ముఖర్జీలను పోలీసులు అరెస్టు చేశారు. ఓషివర ప్రాంతంలోని మీరా టవర్ సీ-వింగ్ 15వ అంతస్తులో గుప్తాకు ఉన్న సొంత ఫ్లాట్‌ను పదేళ్ల ఒప్పందంపై అద్దెకు ఇచ్చారు.
అయితే ఆ ఫ్లాట్‌లో పెద్ద ఎత్తున అశ్లీల సీడీలు నిల్వ ఉన్నట్లు పోలీసులకు సమాచారమందింది. ఈ మేరకు పోలీసులు గురువారం రాత్రి ఆకస్మాత్తుగా దాడులు చేశారు. భారీగా అశ్లీల సీడీలతోపాటు విడుదలయ్యే కొన్ని కొత్త సినిమాల పైరసీ డీవీడీలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తండ్రీకొడుకులను అరెస్టు చేశారు. అయితే ఈ ఇళ్లు అద్దెకు ఇవ్వడంవల్ల ఈ కేసుతో గుప్తాకు ఎలాంటి సంబంధం లేదని అదనపు పోలీసు కమిషనర్ (పశ్చిమ రీజియన్) విశ్వాస్ నాంగరే-పాటిల్ స్పష్టం చేశారు.
తొమ్మిది నెలల నుంచి ఉంటున్నారు: గుప్తా
ముఖర్జీ కుటుంబం తొమ్మిది నెలల నుంచి తమ ఫ్లాట్‌లో ఉంటున్నారు. ఇంతవరకు సొసైటీ యాజమాన్యం, ఇరుగుపొరుగువాళ్ల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని బెస్ట్ జనరల్ మేనేజరు గుప్తా చెప్పారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో వెంటనే ఫ్లాట్ ఖాళీ చేయిస్తామని ఆయన వెల్లడించారు.