సంప్రదాయ కళల్లో సమస్యల 'ప్రదర్శన'
నాగాలాండ్ సంప్రదాయ కళలు అక్కడి ఫిల్మ్ ఫెస్టివల్లో భాగమయ్యాయి. స్థానిక సమస్యల కథాంశాలుగా మారాయి. నాగాలాండ్ మహిళల రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా ఉండే నూలు వడకడం, నేత, నృత్యం, అల్లికలు, కాన్వాస్, పెయింటింగ్స్, ఫోక్ డ్యాన్స్ వంటి సంప్రదాయ కళలను కాన్వాస్‌లు, షాల్స్ రూపంలో రూపొందించిన ఓ కళాకారిణి ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంలో 'హీలింగ్' పేరున ప్రదర్శన ఏర్పాటుచేసింది. సమస్యలు ప్రధానాంశంగా ఏర్పాటు చేసిన ఆ ప్రదర్శన చూపరులను అమితంగా ఆకట్టుకుంటోంది.
నాగాలాండ్‌కు చెందిన విద్యావంతురాలు, కళాకారిణి ఐరిస్ ఓడ్యూ తన కళకు అక్కడి సమస్యలను జోడించింది. గృహహింస, లైంగిక వేధింపుల వంటి సమస్యల పరిష్కారంతో పాటు... వారి గౌరవానికి వన్నె తెచ్చేలా శాలువాలు, పెయింటింగ్స్ గా అనేక కళాత్మక డిజైన్లను రూపొందించి ప్రదర్శన ఏర్పాటు చేసింది. నాగాలాండ్ లోని వివిధ సామాజిక వర్గాల ద్వారా తయారైన 9 ఎక్రిలిక్ పెయింటింగ్స్, ఉలెన్ సంప్రదాయ శాలువాలను ఓడ్యూ 12వ ఆసియా ఉమెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ప్రదర్శించారు. మహిళలే కాదు.. బాధిత పురుషులు, బాలల సమస్యలను కూడ తన కళల్లో పొందుపరిచారు.
ప్రపంచయుద్ధ సమయంలో జర్మన్ సైనిక యూనిఫారాల కోసం మొదటిసారి ఫ్యాబ్రిక్స్ వాడకం మొదలు పెట్టారని, నాగాలాండ్ బర్మా సరిహద్దు ప్రాంతంలో నేటికీ అదే సంప్రదాయం కొనసాగుతోందని, అత్యధిక సమయం పట్టడంతో పాటు, కఠినంగా కూడా ఉండే నేత కళను గ్రామాల్లోని మహిళలు అందమైన శాలువాలుగా వారి కోసం నేస్తూనే ఉన్నారని ఓడ్యూ చెబుతున్నారు. తన కాన్వాస్ కోసం శాలువాలను నేసే విధానం చూస్తే అక్కడి మహిళల కష్టం ప్రత్యక్షంగా తెలిసిందంటున్నారు. ఈ ప్రదర్శనలు గ్రామీణ మహిళలకు మెరుగైన జీవితాన్ని అందించగలవని, సమస్యల పరిష్కారానికి సహకరిస్తాయని ఓడ్యూ ఆశాభావం వ్యక్తం చేశారు. అదే ఆలోచనతోనే హీలింగ్ పేరున తాను ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు ఓడ్యూ వెల్లడించారు.