Highly pathogenic
-
అమెరికాలో ఎవియన్ ఫ్లూ... 5 కోట్ల కోళ్లు బలి
వాషింగ్టన్: అమెరికాలో ఎవియన్ ఫ్లూ అక్షరాలా విలయం సృష్టిస్తోంది. ఈ ఏడాది ఇప్పటిదాకా రికార్డు స్థాయిలో ఏకంగా 5 కోట్ల కోళ్లు, పక్షులను బలి తీసుకుంది! ఇది దేశ చరిత్రలోనే అత్యంత ప్రాణాంతకమైన విపత్తని వ్యవసాయ శాఖ పేర్కొంది. దీని దెబ్బకు దేశవ్యాప్తంగా గుడ్లు, కోడి మాంసం తదితరాల రేట్లు చుక్కలనంటుతున్నాయి. అసలే ద్రవ్యోల్బణంతో అల్లాడుతున్న జనం జేబుకు మరింత చిల్లి పెడుతున్నాయి. హైలీ పాథోజెనిక్ ఎవియన్ ఇన్ఫ్లుయెంజా (హెచ్పీఏఐ)గా పిలిచే ఈ ఫ్లూ అడవి బాతుల వంటి వాటి వ్యర్థాలు, ఈకల ద్వారా సోకుతుంది. ఇది అమెరికాలో ఫిబ్రవరిలో వెలుగు చూసింది. చూస్తుండగానే కార్చిచ్చులా దేశమంతటా వ్యాపించి ఏకంగా 46 రాష్ట్రాలను చుట్టేసింది. దాంతో ఫ్లూ వ్యాప్తిని అడ్డుకునేందుకు లక్షలు, కోట్ల సంఖ్యలో కోళ్లు, ఇతర పక్షులను చంపేయాల్సి వచ్చింది! 2015లోనూ యూఎస్‌లో ఇలాగే దాదాపు 5 కోట్ల పక్షులు ఫ్లూకు బలయ్యాయి. బ్రిటన్‌తో సహా పలు యూరప్ దేశాల్లో కూడా ఎవియన్ ఫ్లూ విలయం సృష్టిస్తోంది. ఎంతలా అంటే బ్రిటన్‌లో పలు సూపర్ మార్కెట్లు ఒక్కో కస్టమర్ ఇన్ని గుడ్లు మాత్రమే కొనాలంటూ రేషన్ పెడుతున్నాయి! -
ప్రాణాంతక బర్డ్ ఫ్లూ కలకలం
టోక్యో: ప్రాణాంతకమైన బర్డ్ ఫ్లూ వ్యాధి జపాన్ ను వణికిస్తోంది. అత్యంత వ్యాధికారకమైన హెచ్ 5 ఎన్6 వైరస్ పౌల్ట్రీ, ఇతర అడవి జాతి పక్షులు, జపాన్ లోని బహుళ ప్రదేశాల్లోని పౌల్ట్రీ ఫారాల్లో గుర్తించడం ఆందోళనకు దారి తీసింది. అతి ప్రమాదకరమైన హెచ్5ఎన్6 వైరస్ ను నిర్ధారించినట్టు నివేదికలు వెల్లడించాయి. దీంతో లక్షలాది కోళ్లన ఏరిపారేస్తున్నారు. మరోవైపు ఈ వైరస్ వ్యాప్తిపై జపాన్ ప్రభుత్వం స్పందించింది. తగిన చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించింది. పసిఫిక్ ఐలాండ్ లో మంగళవారం 3, 10.000 కోళ్లను నిర్మూలించినట్టు జిన్హువా న్యూస్ వెల్లడించింది. గతంలో సుమారు 40 కోళ్లు చనిపోవడంతో జరిగిన పరీక్షల్లో బర్డ్ ఫ్లూ ఉనికిని నిర్ధారించింది. అత్యధికనష్టం కలిగించే అంటురోగ కారక క్రిమిని గుర్తించినట్టు తేల్చింది. దీంతో నియోగాటా, అయోమోరి ప్రదేశాలకు సమీపంలోని 10 కి.మీ దూరంలో గుడ్లు తదితర పౌల్ట్రీ ఉత్పత్తుల రవాణాను స్థానిక ప్రభుత్వం సంస్థ నిషేధించింది. ఈ విషయంలో సంబంధిత అధికారులు సహకరించాల్సిందిగా ప్రభుత్వ, మంత్రిత్వ శాఖలు, సంస్థలకు జపాన్ ప్రధాని షింజో అబే ఆదేశాలు జారీ చేశారు. కాగా ఇటీవల బర్డ్ ఫ్లూ వ్యాప్తికి సంబంధించి గరిష్టంగా బర్ద్ ఫ్లూ వైరస్ నమునా-3 హెచ్చరికలను జారీ చేసిన సంగతితెలిసిందే.