highway roads
-
డేంజర్ జర్నీ..!
ప్రకాశం, కారంచేడు: గ్రామీణ ప్రాంత రహదారులను సుందరంగా తీర్చిదిద్దుతున్నామని గొప్పలు చెప్పుకొనే పాలకులు, అధికారులు క్షేత్ర స్థాయిలో మాత్రం రహదారుల అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ప్రధాన రహదారులనే పట్టించుకోని వారికి ఇక గ్రామీణ రహదారులు ఏమి కనిపిస్తాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. అడుగుకో గుంతతో ప్రజలు, ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. నిత్యం వందుల సంఖ్యలో ఆటోలు, ద్విచక్రవాహనదారులతో పాటు బస్సులు, లోడు లారీలు ఈ రహదారుల్లో ప్రయాణించే క్రమంలో అనేక ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇక రాత్రి సమయంలో గోతులతో ప్రయాణికులు నరకయాతన పడాల్సిందే. ద్విచక్రవాహనదారులతో పాటు, రైతులు చుక్కలు చూడాల్సిందే. ప్రధాన రహదారి ఇలా.. వాడరేవు–పిడుగురాళ్ల ప్రధాన రహదారి. ఈ రహదారిలో నిత్యం వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రహదారిలో కారంచేడు–చీరాల మధ్య ఉన్న 8 కిలోమీటర్లు గుంతల మయంగా మారింది. చిన్నచప్టాలు, పెదచప్టాలు, చర్చి సెంటర్, బాంబుల గోదాముల ప్రాంతాల్లో ఇక నరకం చూడాల్సిందేనని ప్రయాణికులు వాపోతున్నారు. గత మూడు సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ రహదారిలో ఇప్పటి వరకు కనీసం మరమ్మతులు కూడా చేయడం లేదని వాహనదారులు చెబుతున్నారు. గ్రామీణ రహదారులు ఇంతేనా..? మండలంలోని జరుబులవారిపాలెం–నాయుడువారిపాలెం గ్రామాల మధ్య రహదారి సుమారు 2 కిలోమీటర్లు ఉంటుంది. దీనిలో 80 శాతం వరకు రహదారి గుంతలతో నిండిపోయింది. మండల కేంద్రమైన కారంచేడుతో పాటు సమీప పట్టణమైన చీరాలకు వెళ్లాలంటే పలు గ్రామాలకు చెందిన ప్రజలు ఎక్కువగా ఈ రహదారిలోనే ప్రయాణిస్తుంటారు. దీనికి తోడు పై గ్రామాలకు చెందిన రైతులు కూడా పోలాలకు వెళ్లేందుకు ఎరువులు, విత్తనాలు తీసుకువెళ్లడానికి, తమ పొలాల్లో పండించిన పంటలను ఇళ్లకు చేరవేసుకోవడానికి ఈ రహదారిలోనే ప్రయాణిస్తుంటారు. నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా ఉండే ఈ రోడ్డులో గుంతలు ప్రయాణికులకు చెమటలు పట్టిస్తున్నాయి. ద్విచక్రవాహనదారులు పలు ప్రమాదాలకు గురవుతున్నారు. అలాగే మండలంలోని స్వర్ణ–స్వర్ణపాలెం రహదారి కూడా బద్దలై ద్విచక్రవాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. రహదారులు మధ్యకు బద్దలవడం వలన వాహనాల టైర్లు గాడుల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ రహదారికి ఇరువైపులా పంట కాలువలు ఉండటం, రోడ్డు కొత్తగా ఏర్పాటు చేయడం వలన ఇలాంటి పరిస్థితి వచ్చిందని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రమాదాలకు నిలయంగా.. ఆదిపూడి–తిమిడెదపాడు రహదారి మోకాలి లోతు గోతులతో ఇబ్బందికరంగా మారింది. ఈ రోడ్డులో నిత్యం విద్యార్థులు, ప్రయాణికులు, రైతులు ప్రయాణిస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులు గుంతలతో ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి రహదారులను మరమ్మతులు చేయించి ప్రయాణాలకు అనువుగా చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఆదిపూడి నుంచి తిమిడెదపాడు వెళ్లాలంటే వాహనదారులకు నరకం కనిపిస్తుంది. రోడ్డులో ఎక్కువ భాగం గుంతలమయంగా మారింది. దీనికి తోడు రోడ్డుకు ఇరువైపులా దట్టంగా పెరిగి ఉండే చిల్లచెట్లతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రయాణం చేయాలంటే ఇబ్బందిగా మారుతోంది.వై. సీతారామిరెడ్డి, ఆదిపూడి -
గ్రీన్ హైవే.. టెన్షన్
మోర్తాడ్(బాల్కొండ): గ్రీన్ హైవే నిర్మాణం ఏమో కానీ, రైతుల్లో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఉన్న భూములు పోతే ఇక ఏం చేసుకుని బతికేదనే ఆందోళన అన్నదాతల్లో నెలకొంది. ముప్కాల్ మండలంలోని వేంపల్లి మీదుగా వెళ్లే 44వ జాతీయ రహదారి నుంచి మంచిర్యాల వరకు గ్రీన్ హైవే నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బోధన్ నుంచి జగదల్పూర్ వరకు 63వ జాతీయ రహదారి విస్తరించి ఉంది. ఈ రోడ్డును నాలుగు లేన్ల రహదారిగా మార్చాలని కేంద్రం తొలుత యోచించింది. అయితే, పెద్ద మొత్తంలో ఇళ్లు, చెట్లు, వ్యవసాయ భూములకు నష్టం కలగనుంది. అంతేకాక మిషన్ భగీరథ పథకానికి సంబంధించిన పైప్లైన్లకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. ఈ నేపథ్యంలో అన్ని కష్ట నష్టాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. సరికొత్త రహదారికి శ్రీకారం చుట్టింది. రైతులకు తీరని నష్టం.. ప్రస్తుతం ఉన్న 63వ జాతీయ రహదారిని విస్తరించడానికి బదులు మరో మార్గంలో కొత్త హైవేను నిర్మిస్తే తక్కువ నష్టంతో సరిపెట్టవచ్చని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. దీంతో వేంపల్లి నుంచి మంచిర్యాల వరకు 125 కిలోమీటర్ల పొడవున కొత్త రహదారిని నిర్మించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ మేరకు సర్వే ప్రక్రియ పూర్తి చేశారు. అయితే, కొత్తగా నిర్మించనున్న ఈ మార్గంలో చేసిన సర్వే ప్రకారం.. మన జిల్లాకు సంబంధించి వందలాది ఎకరాల భూముల్లోంచి ఈ కొత్త రోడ్డు నిర్మించనున్నారు. వేంపల్లి, రెంజర్ల, శెట్పల్లి, తొర్తి, తిమ్మాపూర్, ఏర్గట్ల గ్రామాలకు చెందిన రైతులు విలువైన పంట భూములు కోల్పోనున్నారు. త్వరలోనే నోటిఫికేషన్..! గ్రీన్ హైవే నిర్మాణంలో భాగంగా రోడ్డు నిర్మాణంలో భాగంగా నష్టపోయే చెట్ల స్థానంలో అధిక సంఖ్యలో మొక్కలను నాటడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు, హైవే నిర్మాణానికి సంబంధించిన సర్వే కూడా పూర్తికావడంతో త్వరలోనే భూ సేకరణకు నోటిఫికేషన్ను జారీ అయ్యే అవకాశం ఉంది. గ్రీన్ హైవే నిర్మాణానికి సేకరించే భూమికి నష్ట పరిహారం అందించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పరిశీలించనుంది. ఆందోళనలో రైతులు.. అయితే, రహదారి నిర్మాణం కోసం విలువైన భూములు కోల్పోతున్న రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏళ్ల తరబడి ఆ భూములను నమ్ముకుని బతుకుతున్నామని, జీవనాధారమైన భూములు కోల్పోతే ఏం చేసుకుని బతకాలని వాపోతున్నా రు. నష్ట పరిహారం తమకు ముఖ్యం కాదని, కో ల్పోతున్న భూములకు బదులు భూములు ఇవ్వా లని రైతులు చెబుతున్నారు. తరతరాల నుంచి చేస్తున్న వ్యవసాయ భూములను కోల్పోవడం వ ల్ల భారీ మొత్తంలో నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ప్రత్యామ్నాయ మార్గం చూడాలని రైతులు కోరుతున్నారు. అయి తే, రహదారి నిర్మాణాలకు సహకరించాలని నేషన ల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు పేర్కొంటున్నారు. ప్రమాదాల నివారణ, రవాణా సదుపాయం కోసం జాతీయ రహదారుల నిర్మా ణం, విస్తరణ కీలకమైదని వారు చెబుతున్నారు. -
ఆ టెండర్ మాదే.. వేశారో జాగ్రత్త!
‘దేశం’లో రహదారి పనుల సెగలు రూ.183 కోట్ల టెండర్లకు పోటీపడొద్దని హుకుం ఎంపీ సీఎం రమేష్పై మండిపడుతున్న శ్రేణులు మైదుకూరు, బద్వేల్ నాయకుల నిర సన ముఖ్యమంత్రి ఎదుట పంచాయతీకి సన్నద్ధం కడప: తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ ఏకపక్ష చర్యలపై తెలుగుతమ్ముళ్లు గుర్రుమంటున్నారు. తాజాగా నేషనల్ హైవే రోడ్డు పనుల టెండర్లు దుమారం రేపాయి. తనను కాదని ఎవ్వరూ టెండర్లు కోట్ చేయరాదని హుకుం జారీ చేయడమే అందుకు కారణం. అధినేత వద్దే తేల్చుకొవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకు ఓ కీలక నాయకుడు తెరవెనుక నుంచి నడిపిస్తున్నారు. నేషనల్ హైవే-67 రోడ్డు పనుల విస్తరణలో భాగంగా రూ.183 కోట్లుకు ఈ పొక్యూర్మెంట్ టెండర్లు ఆహ్వానించారు. మైదుకూరు, బద్వేల్ మీదుగా వెళ్తున్న ఈరహదారి పనులను ఆప్రాంతం అధికార పార్టీ నేతలు ఆశించారు. టెండర్లు దాఖలు చేసేందుకు సన్నద్ధం కావడంతో వారిని ఎంపీ రమేష్ నియంత్రించినట్లు తెలుస్తోంది. స్వతహాగా కాంట్రాక్టర్ అయిన తనకు తన ప్రాంతంలోని రహదారి పనులు దక్కించుకునే అవకాశం కల్పించాలని ఓ నియోజకవర్గ స్థాయి నాయకుడు కోరినట్లు సమాచారం. అదేం లేదు, ఆ పనులకు నీవు టెండర్ వేయవద్దు అని ఆదేశించినట్లు తెలుస్తోంది. అలాగే 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నాం, అనుచరుల్ని కాపాడుకోవడం బహుకష్టంగా మారింది.. తమ నియోజకవర్గ పరిధిలోని రహదారి పనులుకు మేము టెండర్లు వేసుకుంటామని మాజీ ఎమ్మెల్యే ఒకరు కూడా అభ్యర్థించినట్లు తెలుస్తోంది. అందుకు ససేమిరా అంటూ తిరస్కరించినట్లు దేశం వర్గీయులు బాహాటంగా చెబుతున్నారు. ఎవరి పనులు వారివే.... వద్దంటే ఎలా? మైదుకూరు, బద్వేల్ నేతల్ని నియంత్రించిన ఎంపీ రమేష్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్హెచ్ రోడ్డు పనుల టెండర్లుకు సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే తనయుడు ఒకరు అడ్డుకట్ట వేశారు. ఆన్లైన్లో తనకు అనుకూలమైన కాంట్రాక్టు సంస్థతో టెండర్లు దాఖలు చేశారు. ముందుగా అనుకున్నట్లు కాకుండా తనకు అనుకూలమైన మూడు సంస్థలే దాఖలు కాకుండా నాలుగో సంస్థ కూడా టెండర్ దాఖలు చేసింది. దాంతో ఒక్కమారుగా అవాక్కు అవ్వాల్సిన పరిస్థితి టీడీపీ నేతలకు ఎదురైంది. ఆ కాంట్రాక్టు సంస్థ ద్వారా ప్రస్తుతం అధికారపార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే తనయుడు వేయించారని తెలుసుకుని తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అయితే ‘తమ్ముడు తమ్ముడే..పేకాట పేకాటే’ అంటూ వీరి ఒత్తిళ్లును ఆయన తిరస్కరించడంతో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. తెలుగుదేశం పార్టీలో మీరు మా నాయకుడు, మేం నియోజకవర్గ నేతలం, పార్టీ పరంగా ఉన్నతి కోసం కష్టపడేందుకు మావంతు సహకారం అందిస్తాం. అయితే వ్యాపారాలు, కాంట్రాక్టులు ఎవ్వరివి, వారు చేసుకుందాం, మాకు పనులు వస్తే మేం చేసుకుంటాం, మీకు వస్తే మీరే చేయండి అంటూ వ్యాఖ్యానాలు చేసినట్లు తెలుస్తోంది. ఇంతమందిని ఒప్పించుకుంటూ వస్తే ఫైనల్గా చేజారిపోతుంది అనే ఆవేదన ఎంపీకి ఉన్నట్లు సమాచారం. కాగా న్యూఢిల్లీలో సోమవారం సాయంత్రం టెండర్లు ఓపెన్ చేయాల్సి ఉంది. ఆ వివరాలు రాత్రికి సైతం తెలియడం లేదు. ఆమేరకు నేషనల్ హైవే ఎస్ఈ ధ్రువీకరించారు. అధినేత వద్ద పంచాయితీకి సన్నద్ధం... తెలుగుదేశం పార్టీలో ఏకపక్ష నిర్ణయాలపై అధినేత వద్ద తేల్చుకోవాని జిల్లా నేతలు జట్టు కడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీ రమేష్తో విభేదిస్తున్న నాయకులంతా ఒక్కొక్కరుగా ఏకం అవుతోన్నారు. అందుకు కీలకస్థానంలో ఉన్న నాయకుడు తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా బద్వేల్, మైదుకూరు నాయకులు కూడా ఆ జట్టులోకి వెళ్లినట్లు సమాచారం. పైస్థాయిలోని నేతల మద్దతు కూడగట్టి ఎంపీ చర్యలకు చెక్పెట్టాలనే దిశగా పావులు కదుపుతోన్నట్లు తెలుస్తోంది. సీనియర్ నాయకుల్ని, పార్టీనే అంటిపెట్టుకుని నెట్టుకొస్తున్న వారిని కాదని అంతా తానై ఎంపీ రమేష్ వ్యవహరిస్తున్నారని పలువురు ఆవేదన చెందుతున్నారు. ముఫ్పై ఏళ్లుగా పార్టీనే సర్వసం అనుకొని వచ్చిన తమ లాంటి నాయకులకు కూడా ఎంపీ విలువ ఇవ్వడం లేదని త్వరలో ముఖ్యమంత్రి ఎదుట అమీతుమీ తేల్చుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు ఆపార్టీ రాష్ట్ర నేత ఒకరు సాక్షితో వ్యాఖ్యానించారు. వైఎస్సార్ జిల్లాలోని తెలుగుదేశం పార్టీ తన గుత్తాదిపత్యంలా వ్యవహరిస్తున్నారని ఆ నేత తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. తాము చేసిన సేవలకు గుర్తింపు ఏమిటో తేల్చుకోవాలనే దిశగా తెలుగుతమ్ముళ్లు సన్నద్ధం అవుతోండడం విశేషం.