ఆ టెండర్ మాదే.. వేశారో జాగ్రత్త!
‘దేశం’లో రహదారి పనుల సెగలు
రూ.183 కోట్ల టెండర్లకు పోటీపడొద్దని హుకుం
ఎంపీ సీఎం రమేష్‌పై మండిపడుతున్న శ్రేణులు
మైదుకూరు, బద్వేల్ నాయకుల నిర సన
ముఖ్యమంత్రి ఎదుట పంచాయతీకి సన్నద్ధం
కడప: తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ ఏకపక్ష చర్యలపై తెలుగుతమ్ముళ్లు గుర్రుమంటున్నారు. తాజాగా నేషనల్ హైవే రోడ్డు పనుల టెండర్లు దుమారం రేపాయి. తనను కాదని ఎవ్వరూ టెండర్లు కోట్ చేయరాదని హుకుం జారీ చేయడమే అందుకు కారణం. అధినేత వద్దే తేల్చుకొవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకు ఓ కీలక నాయకుడు తెరవెనుక నుంచి నడిపిస్తున్నారు. నేషనల్ హైవే-67 రోడ్డు పనుల విస్తరణలో భాగంగా రూ.183 కోట్లుకు ఈ పొక్యూర్‌మెంట్ టెండర్లు ఆహ్వానించారు. మైదుకూరు, బద్వేల్ మీదుగా వెళ్తున్న ఈరహదారి పనులను ఆప్రాంతం అధికార పార్టీ నేతలు ఆశించారు.
టెండర్లు దాఖలు చేసేందుకు సన్నద్ధం కావడంతో వారిని ఎంపీ రమేష్ నియంత్రించినట్లు తెలుస్తోంది. స్వతహాగా కాంట్రాక్టర్ అయిన తనకు తన ప్రాంతంలోని రహదారి పనులు దక్కించుకునే అవకాశం కల్పించాలని ఓ నియోజకవర్గ స్థాయి నాయకుడు కోరినట్లు సమాచారం. అదేం లేదు, ఆ పనులకు నీవు టెండర్ వేయవద్దు అని ఆదేశించినట్లు తెలుస్తోంది. అలాగే 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నాం, అనుచరుల్ని కాపాడుకోవడం బహుకష్టంగా మారింది.. తమ నియోజకవర్గ పరిధిలోని రహదారి పనులుకు మేము టెండర్లు వేసుకుంటామని మాజీ ఎమ్మెల్యే ఒకరు కూడా అభ్యర్థించినట్లు తెలుస్తోంది. అందుకు ససేమిరా అంటూ తిరస్కరించినట్లు దేశం వర్గీయులు బాహాటంగా చెబుతున్నారు.
ఎవరి పనులు వారివే.... వద్దంటే ఎలా?
మైదుకూరు, బద్వేల్ నేతల్ని నియంత్రించిన ఎంపీ రమేష్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్‌హెచ్ రోడ్డు పనుల టెండర్లుకు సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే తనయుడు ఒకరు అడ్డుకట్ట వేశారు. ఆన్‌లైన్‌లో తనకు అనుకూలమైన కాంట్రాక్టు సంస్థతో టెండర్లు దాఖలు చేశారు. ముందుగా అనుకున్నట్లు కాకుండా తనకు అనుకూలమైన మూడు సంస్థలే దాఖలు కాకుండా నాలుగో సంస్థ కూడా టెండర్ దాఖలు చేసింది.
దాంతో ఒక్కమారుగా అవాక్కు అవ్వాల్సిన పరిస్థితి టీడీపీ నేతలకు ఎదురైంది. ఆ కాంట్రాక్టు సంస్థ ద్వారా ప్రస్తుతం అధికారపార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే తనయుడు వేయించారని తెలుసుకుని తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అయితే ‘తమ్ముడు తమ్ముడే..పేకాట పేకాటే’ అంటూ వీరి ఒత్తిళ్లును ఆయన తిరస్కరించడంతో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది.
తెలుగుదేశం పార్టీలో మీరు మా నాయకుడు, మేం నియోజకవర్గ నేతలం, పార్టీ పరంగా ఉన్నతి కోసం కష్టపడేందుకు మావంతు సహకారం అందిస్తాం. అయితే వ్యాపారాలు, కాంట్రాక్టులు ఎవ్వరివి, వారు చేసుకుందాం, మాకు పనులు వస్తే మేం చేసుకుంటాం, మీకు వస్తే మీరే చేయండి అంటూ వ్యాఖ్యానాలు చేసినట్లు తెలుస్తోంది. ఇంతమందిని ఒప్పించుకుంటూ వస్తే ఫైనల్‌గా చేజారిపోతుంది అనే ఆవేదన ఎంపీకి ఉన్నట్లు సమాచారం. కాగా న్యూఢిల్లీలో సోమవారం సాయంత్రం టెండర్లు ఓపెన్ చేయాల్సి ఉంది. ఆ వివరాలు రాత్రికి సైతం తెలియడం లేదు. ఆమేరకు నేషనల్ హైవే ఎస్‌ఈ ధ్రువీకరించారు.
అధినేత వద్ద పంచాయితీకి సన్నద్ధం...
తెలుగుదేశం పార్టీలో ఏకపక్ష నిర్ణయాలపై అధినేత వద్ద తేల్చుకోవాని జిల్లా నేతలు జట్టు కడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీ రమేష్‌తో విభేదిస్తున్న నాయకులంతా ఒక్కొక్కరుగా ఏకం అవుతోన్నారు. అందుకు కీలకస్థానంలో ఉన్న నాయకుడు తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా బద్వేల్, మైదుకూరు నాయకులు కూడా ఆ జట్టులోకి వెళ్లినట్లు సమాచారం. పైస్థాయిలోని నేతల మద్దతు కూడగట్టి ఎంపీ చర్యలకు చెక్‌పెట్టాలనే దిశగా పావులు కదుపుతోన్నట్లు తెలుస్తోంది.
సీనియర్ నాయకుల్ని, పార్టీనే అంటిపెట్టుకుని నెట్టుకొస్తున్న వారిని కాదని అంతా తానై ఎంపీ రమేష్ వ్యవహరిస్తున్నారని పలువురు ఆవేదన చెందుతున్నారు. ముఫ్పై ఏళ్లుగా పార్టీనే సర్వసం అనుకొని వచ్చిన తమ లాంటి నాయకులకు కూడా ఎంపీ విలువ ఇవ్వడం లేదని త్వరలో ముఖ్యమంత్రి ఎదుట అమీతుమీ తేల్చుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు ఆపార్టీ రాష్ట్ర నేత ఒకరు సాక్షితో వ్యాఖ్యానించారు. వైఎస్సార్ జిల్లాలోని తెలుగుదేశం పార్టీ తన గుత్తాదిపత్యంలా వ్యవహరిస్తున్నారని ఆ నేత తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. తాము చేసిన సేవలకు గుర్తింపు ఏమిటో తేల్చుకోవాలనే దిశగా తెలుగుతమ్ముళ్లు సన్నద్ధం అవుతోండడం విశేషం.