సాక్షి, కడప : టీడీపీని వీడి బీజేపీలో చేరాలనుకున్న మాజీమంత్రి ఆదినారాయణరెడ్డికి భంగపాటు ఎదురవుతోంది. ఆయన చేరికయత్నాలను రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వ్యతిరేకిస్తున్నారు. టీడీపీకి గుడ్‌బై చెప్పి భారతీయ జనతా పార్టీలో చేరిన సీఎం రమేష్ మాజీ మంత్రి రాకుండా అడ్డుపడుతున్నట్లు తెలిసింది. రమేష్ ధోరణి వల్లే బీజేపీలో ఆది చేరిక వాయిదా పడుతున్నట్లు సమాచారం. పార్టీలో చేరక ముందే మొదలైన ఈ రచ్చ జిల్లా బీజేపీ నేతలకు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. సీఎం రమేష్‌ను కాదని ఆదిని పార్టీలో చేర్చుకున్నా ఇరువురి ఆధిపత్య పోరు కమలం పార్టీకి ఇబ్బందులు తేవడం ఖాయమని ఆ పార్టీనేతలు భావిస్తున్నారు. ఇదే జరిగితే టీడీపీ తరహాలో బీజేపీ జనంలో పలచన అవుతుందని ఆందోళన చెందుతున్నారు.
తొలినాళ్లనుంచే ప్రత్యర్థులే..
టీడీపీలో ఉంటున్నప్పుడు సీఎం రమేష్‌కు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డితో సత్సంబంధాలు లేవు. జిల్లాలో ఆదిపత్యం కోసం ఇరువురు సై అంటే సై అనేవరకూ వచ్చింది. దీంతో టీడీపీ పరువు బజారుకెక్కింది. సీఎం రమేష్‌ను టీడీపీలో అడ్డుకునేందుకు ఆది శతవిధాల ప్రయత్నించారు. కొత్తగా చేరిన ఆది పెత్తనాన్ని వ్యతిరేకించిన రమేష్ అడుగడుగునా అడ్డుపడ్డారు. కాంట్రాక్ట్ పనులు ..ఉపాధి నిధుల పంపిణి, నీరు చెట్టు పనుల కేటాయింపుతో మొదలు గత ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల కేటాయింపు వరకూ ఇరువురి మద్య పోరు నడిచింది. చంద్రబాబు స్థాయిలో చక్రం తిప్పిన సీఎం రమేష్ ఆదికి దాదాపు అడ్డకట్ట వేశారని టీడీపీ శ్రేణులు చెబుతాయి. గత ఎన్నికల్లో జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ తనకే కావాలంటూ ఆది పట్టుబట్టగా సీఎం రమేష్ అడ్డుపడ్డారు. రామసుబ్బారెడ్డి పేరును ఖరారు చేసేందుకు పావులు కదిపారు. తరువాత ఆదిని పార్లమెంట్ నుండి పోటీచేయించేందుకు సిద్దపడేలా చేశారు. తాను కడప పార్లమెంట్‌కు పోటీ చేయాలంటే అసెంబ్లీ స్థానాలు తాను చెప్పిన అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని ఆది పట్టుబట్టారు.
ప్రధానంగా ప్రొద్దుటూరు,కమలాపురం,మైదుకూరు,కడప తదితర స్థానాలు తాను సూచించినవారికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీకోసం పనిచేసిన వారికే టికెట్ ఇవ్వాలని రమేష్ ఆది ప్రతిపాదనకు అడ్డుపడ్డారు. గతంలో ఇరువురి మధ్య వివాదాలు పతాక స్థాయికి చేరాయి గత ఎన్నికల్లో టీడీపీఘోర పరాభవం పొందిన నేపథ్యంలో అధికారం లేకుండా మనుగడ సాగించలేమని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ భావించారు. టీడీపీకి గుడ్‌బై చెప్పి ఇటీవలే బీజేపీలో చేరారు. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిదీ ఇదే పరిస్థితి. వైఎస్సార్‌సీపీ లో చేర్చుకునే పరిస్థితి లేకపోవడంతో బీజేపీ మినహా మరోమార్గం లేదని ఆయన భావించారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆశీస్సులతో బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారు. పలుమార్లు బీజేపీ నేతలను కలిశారు. తాజాగా గురువారం ఢిల్లీకి వెళ్లి పార్టీ ముఖ్యనేత సమక్షంలో ఆది పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది.
కానీ అనూహ్య పరిణామాల మధ్య ఆది బీజేపీలో చేరలేపోయారని చర్చ నడుస్తోంది. ఆయన్ను బీజేపీ లోకి రాకుండా సీఎం రమేష్ అడ్డు పడుతున్నారని ప్రచారం గుప్పుమంది. ఆది వస్తే మళ్లీ ఆదిపత్య పోరాటం తప్పదని.. ముందే. అడ్డుకోవడం మేలని భావించిన సీఎం రమేష్ అందుకు అనుగుణంగా పావులు కదిపినట్లు భోగట్టా. ఆది కడపలో శనివారం బీజేపీలో చేరేఅ వకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆది చేరికపై సీఎం రమేష్ అభ్యంతరం చెబుతున్న నేపథ్యంలో బీజేపీకి తలనొప్పులు ఖాయమని ఆ పార్టీ నాయకులు కలవరపడుతున్నట్లు తెలిసింది. ఇలాంటి నేతలను పార్టీలోకి తెచ్చుకొని పార్టీని బలోపేతం చేసుకోవడం అటుంచితే ముక్కలు చేసుకున్నట్లు అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment