ఈనెల 7వ తేదిన కడపలో నిర్వహించే టీడీపీ ప్రజాగర్జనను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తెలిపారు.
కడప రూరల్, న్యూస్‌లైన్: ఈనెల 7వ తేదిన కడపలో నిర్వహించే టీడీపీ ప్రజాగర్జనను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తెలిపారు. శుక్రవారం స్థానిక ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రజాగర్జనకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరవుతారన్నారు. ఈ సందర్భంగా విలేకరులు పలు ప్రశ్నలు వేశారు. కాంగ్రెస్ వారంతా టీడీపీలో చేరుతున్నారు? టిక్కెట్లు, పదవులు తదితర సమస్యలు ఏమి ఉండవా? అని ఓ విలేకరి ప్రశ్నించగా, కాంగ్రెస్ పార్టీ క్లోజ్ అయిందని, వారంతా టీడీపీలోకి వస్తున్నారని, సమస్యలేమీ లేవన్నారు. ఈ సంద ర్భంగా ‘సాక్షి’పై అక్కసును ప్రదర్శించారు.
అక్రమాలు గురించి మాట్లాడుతుండగా.. ఓ విలేకరి ‘ఎర్రచందనం స్మగ్లర్ రెడ్డినారాయణను మీ పార్టీలో ఎలా చేర్చుకున్నారని’ ప్రశ్నించగా, అతను పార్టీకి సానుభూతి పరుడు మాత్రమేనంటూ దాట వేశారు. మరో ప్రశ్నకు సమాధానంగా కొన్ని కారణాల వల్ల బీజేపీతో టీడీపీ పొత్తు కుదుర్చుకుందన్నారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు టీడీపీకి అంతిమ పోరాటమన్నారు.
పార్టీ ఈదఫా అధికారంలోకి రాలేక పోతే దేవుడు కూడా రక్షించలేడన్నారు. మాజీమంత్రి ఖలీల్‌బాష, పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అమీర్‌బాబు, రాష్ట్ర నాయకులు గోవర్దన్‌రెడ్డి, సుబాన్‌బాష తదితరులు పాల్గొన్నారు.