సహజవాయువు ధర 8 శాతం పెంపు!
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజ వాయువు ధర 8 శాతం మేర పెంచే అవకాశాలున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రావచ్చని పరిశ్రమ వర్గాల సమాచారం. ఇక్కడి గ్యాస్ ధరకు ప్రామాణిక మార్కెట్లయిన యూఎస్ హెన్రీ హబ్ వంటి చోట్ల రేట్లు పెరగడమే దీనికి కారణమని వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఒక్కో యూనిట్(ఎంఎంబీటీయూ) సహజ వాయువు ధర 2.5 డాలర్లగా ఉంది.
ఇది 2.7 డాలర్లకు పెరగనుంది. ఇదే జరిగితే గడిచిన రెండేళ్లలో దేశీ గ్యాస్ రేట్లు పెరగడం ఇదే తొలిసారి అవుతుంది. మోదీ సర్కారు కొలువైన తర్వాత అమల్లోకి వచ్చిన కొత్త ధరల విధానం ప్రకారం ప్రతి ఆర్నెల్లకు దేశీ సహజ వాయువు రేట్లను సవరించాల్సి ఉంటుంది. కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధం(2017–18, అక్టోబర్–మార్చి)లో కూడా రేట్లు పెరగవచ్చని.. యూనిట్‌కు 3.1 డాలర్లకు చేరొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.