విరిగిపడిన కొండచరియలు
శ్రీశైలం నుంచి సాక్షి బృందం: పాతాళగంగాలోని భ్రమరాంబ స్నానపు ఘాట్ సమీపంలో శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగి పడ్డాయి. దాదాపు ఐదారు బండరాళ్లు పై నుంచి కింద పడినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో భక్తులు, అధికారులు, సిబ్బంది కాని ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. మరోవైపు పడిన రాళ్లను ఉదయమే అధికారులు తొలగించినట్లు తెలుస్తోంది. కొండచరియలు విరిగి పడిన ప్రాంతంలో అసంపూర్తిగా ఉన్న స్లోపింగ్ పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్ గోపాల్‌రావును ఆదేశించారు. దీంతో ఆయన భ్రమరాంబ ఘాట్‌ను రెండు గంటల సేపు మూసి వేయించి స్లోపింగ్ పనులను చేపట్టారు. దీంతో వచ్చిన భక్తులందరూ మల్లికార్జున ఘాట్‌కు చేరుకోవడంతో రద్దీ పెరిగింది. మరోవైపు రోప్‌వేను కూడా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల సమయంలో కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, ఎస్పీ ఆర్కే రవికృష్ణ సందర్శించి భక్తుల ఇబ్బందులను గుర్తించి వెంటనే రోప్ వే, భ్రమరాంబ ఘాట్లను పునరుద్ధరించాలి ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు పాతాళగంగాలోని మల్లికార్జున ఘాట్ నుంచి రెండుకు ఇరువైపు అధికారులు ఆకస్మికంగా బండపరుపు పనులను చేపట్టారు.