హైదరాబాద్ 237 ఆలౌట్
ధర్మశాల: హిమాచల్ ప్రదేశ్ బౌలర్లు తొలిరోజే హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ ఆట కట్టించారు. దీంతో మొదటి రోజు ఆటలోనే హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఓపెనర్ తిరుమలశెట్టి సుమన్ (92 బంతుల్లో 65, 12 ఫోర్లు) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేదు.
ఆతిథ్య బౌలర్లలో రిషి ధావన్ (5/75) బెంబేలెత్తించాడు. రంజీ ట్రోఫీ గ్రూప్-సిలో భాగంగా ఇక్కడి హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియంలో గురువారం ఆరంభమైన మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 82.3 ఓవర్లలో 237 పరుగుల వద్ద ఆలౌటైంది. ఒక దశలో 183 పరుగుల స్కోరు వరకు మూడే వికెట్లు కోల్పోయిన హైదరాబాద్... ధావన్ సూపర్ స్పెల్‌కు 54 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లను చేజార్చుకుంది.
టాస్ గెలిచిన హిమాచల్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను కెప్టెన్ అక్షత్ రెడ్డితో కలిసి సుమన్ ఆరంభించాడు. జట్టు స్కోరు 21 పరుగుల వద్దే ధావన్ తొలిదెబ్బ తీశాడు. అక్షత్ (5)ను పెవిలియన్ పంపాడు. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రవితేజ, ఓపెనర్ సుమన్ జట్టు ఇన్నింగ్స్‌ను గాడినపెట్టారు.
చక్కని షాట్లతో ఆకట్టుకున్న సుమన్ ఈ క్రమంలో అర్ధసెంచరీని పూర్తిచేసుకున్నాడు. ఇద్దరు రెండో వికెట్‌కు 79 పరుగులు జోడించారు. సరిగ్గా జట్టు స్కోరు 100 పరుగుల వద్ద సుమన్... అక్షయ్ చౌహాన్ బౌలింగ్‌లో సంగ్రామ్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి నిష్ర్కమించాడు.
క్రీజులోకి విహారి రాగా... కాసేపటికే రవితేజ (74 బంతుల్లో 39, 6 ఫోర్లు)ను విక్రమ్‌జిత్ మాలిక్ బోల్తాకొట్టించాడు. జట్టు స్కోరు 184 పరుగుల వద్ద విహారి (74 బంతుల్లో 31, 5 ఫోర్లు)ని ఔట్ చేసిన రిషి ధావన్ క్రమం తప్పకుండా కీలక వికెట్లు పడగొట్టడంతో హైదరాబాద్ కోలుకోలేకపోయింది.
ఆ తర్వాత సందీప్ (82 బంతుల్లో 34, 4 ఫోర్లు, 1 సిక్స్)ను పెవిలియన్ చేర్చిన ధావన్ కాసేపటికే హబీబ్ అహ్మద్ (0), పగడాల నాయుడు (0)లను డకౌట్‌గా పెవిలియన్ పంపడంతో హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సేపుపట్టలేదు. చివర్లో అబ్సొలెం (22), ప్రజ్ఞాన్ ఓజా (19) కాసేపు ప్రతిఘటించడంతో జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. ప్రత్యర్థి బౌలర్లలో విక్రమ్‌జీత్ మాలిక్ 2 వికెట్లు తీయగా, వకార్ అహ్మద్, అక్షయ్ చౌహాన్, బిపుల్ శర్మ తలా ఓ వికెట్ పడగొట్టారు.
సంక్షిప్త స్కోర్లు: హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 237 (సుమన్ 65, రవితేజ 39, సందీప్ 34; ధావన్ 5/75, విక్రమ్‌జీత్ 2/59)