హింద్ జింక్ లాభం 6.2 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: వేదాంత గ్రూప్ కంపెనీ హిందుస్థాన్ జింక్... మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి(2014-15, క్యూ4) రూ.1,997 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.1,881 కోట్లతో పోలిస్తే లాభం 6.5 శాతం పెరిగింది. ఇక మొత్తం ఆదాయం 13.5 శాతం వృద్ధితో రూ.3,588 కోట్ల నుంచి రూ.4,073 కోట్లకు ఎగబాకింది. కంపెనీ స్వర్ణోత్సవ(గోల్డెన్ జూబ్లీ) ఏడాదిలో ఇదివరకెన్నడూలేనంత అత్యత్తమ పనితీరును సాధించడం ఆనందంగా ఉందని ఫలితాలపై హింద్ జింక్ చైర్మన్ అగ్నివేశ్ అగర్వాల్ వ్యాఖ్యానించారు.
2014-15 పూర్తి ఆర్థి సంవత్సరానికి కంపెనీ నికర లాభం 17.8 శాతం ఎగసి రూ.8,178 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది లాభం రూ.6,904 కోట్లు. మొత్తం ఆదాయం కూడా 8.4 శాతం వృద్ధి చెంది రూ.14,588 కోట్లకు ఎగసింది. సోమవారం బీఎస్ఈలో హింద్ జింక్ షేరు 0.99 శాతం నష్టంతో రూ.170 వద్ద స్థిరపడింది.