కళాకారుల ఖాతాల్లోకే పారితోషికం
– జానపద కళాకారుల సంఘం నాయకులతో టీటీడీ ఈవో
తిరుపతి అర్బన్: టీటీడీ పరిధిలోని హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నమోదు చేసుకున్న(రిజిస్టర్డ్) గ్రామీణ భజన మండళ్ల కళాకారులకు ఇకపై వారివారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకే గౌరవ పారితోషికం జమ చేస్తామని ఈవో డాక్టర్ సాంబశివరావు వెల్లడించారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం జానపద వృత్తి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో మూడు రోజులుగా చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు శుక్రవారం ముగిశాయి.
అంతకుముందు ఈవో డాక్టర్ సాంబశివరావు భజన మండళ్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈవో దృష్టికి 7 ప్రధాన డిమాండ్లను కళాకారుల సంఘం అధ్యక్షుడు పులిమామిడి యాదగిరి తీసుకెళ్లారు. స్పందించిన ఈవో మాట్లాడుతూ ప్రతి భజన బృందానికి ఏడాదికి ఒకసారి తిరుమలలో ప్రదర్శనకు అవకాశం కల్పించేలా ఆన్లైన్ ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు. వివిధ ప్రాంతాల్లో భజన మండళ్లు ప్రదర్శన కోసం వెళ్లినప్పుడు రాను–పోను సెమీ లగ్జరీలో పూర్తి ప్రయాణ ఛార్జీలు చెల్లిస్తామన్నారు. వాయిద్య పరికరాలను ఆయా ఊర్లలోని ఆలయాలకు ఇవ్వడం ద్వారా ఏ భజన మండలి అయినా వినియోగించుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ఏడాది పొడవునా అన్ని భజన మండళ్లకు అన్ని కార్యక్రమాల్లో సమాన అవకాశాలు కల్పించేలా రోస్టర్ చార్ట్ రూపొందించుకోవాలని ధర్మ ప్రచార పరిషత్ అధికారులను ఆదేశించారు.
అందుకోసం ప్రతి సంవత్సరం ఉగాది నుంచి ఉగాదికి వార్షిక ప్రణాళిక రూపొందించాలన్న భజన మండళ్ల డిమాండ్లకు ఈవో అంగీకరించారు. అంతేగాక ప్రతి ప్రదర్శన సమాచారాన్ని భజన మండళ్ల సభ్యులకు మొబైల్ మెసేజ్ల ద్వారా తెలియజేస్తామని హామీ ఇచ్చారు. టీటీడీకి చెందిన ఎస్వీబీసీలోనూ కళారూపాల ప్రదర్శనకు కొంత సమయం కేటాయించే అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తిరుపతి జేఈవో పోల భాస్కర్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి ముక్తేశ్వరరావు, ఎఫ్ఏ అండ్ సీఏవో బాలాజీ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి తదితరులు పాల్గొన్నారు.