Hindu - Muslim unity
-
హిందూ, ముస్లింల మధ్య పంచాయితీకి కుట్ర
సిరిసిల్ల: హిందూ, ముస్లింల మధ్య పంచాయితీ పెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని, ఆ ట్రాప్‌లో ఎవరూ పడొద్దని, రానున్న ఆరు నుంచి తొమ్మిది నెలలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి సోమవారం పర్యటించారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో పల్లె దవాఖానా, స్కూల్లో సైన్స్‌ల్యాబ్, డిజిటల్ తరగతిని మంత్రి ప్రారంభించారు. సిరిసిల్ల రగుడు జంక్షన్లో రూ.7.70 కోట్లతో సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రూ.1.10 కోట్లతో నిర్మించిన షాదీఖానాను ప్రారంభించిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఎనిమిదిన్నర ఏళ్లుగా రాష్ట్రంలో కుల, మతభేదాలులేని పాలనను అందిస్తున్నారని, పేదరికాన్ని తొలగించే నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని వివరించారు. గతంలో ముస్లిం ఆడపిల్లలు చదువుకు దూరంగా ఉన్నారని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని అన్నారు. రాష్ట్రంలో ఏటా రూ.6 వేల కోట్లు వెచ్చిస్తూ గురుకులాల్లో విద్యనందిస్తున్నామని తెలిపారు. విద్యతోనే పేదరికం పోతుందని, విదేశీ చదువులకు 7 వేల మందికి రూ.20 లక్షల చొప్పున అందించామని వివరించారు. సర్కారు వైద్యంపై పెరిగిన నమ్మకం ఒకప్పుడు ‘నేను రాను తల్లో..’సర్కారు దవాఖానాకు అని పాటలు పాడుకునేవారని, ఇప్పుడు సర్కారు వైద్యంపై నమ్మకం పెరిగిందని కేటీఆర్ అన్నారు. సర్కారు ఆస్పత్రిలో 30 శాతం ఉన్న ప్రసూతి సేవలు ఇప్పుడు 62 శాతానికి పెరిగాయన్నారు. మెడికల్ కాలేజీ, పల్లె, బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తూ సర్కారు వైద్యంపై నమ్మకాన్ని పెంచామన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ కంటే ఆశ వర్కర్లకు ఎక్కువ జీతాలు ఇస్తున్నామని చెప్పారు. పొద్దస్తమానం కొందరు సీఎం కేసీఆర్ తిడుతున్నారని, అలా తిడితే ఓట్లు రావని అన్నారు. ఎంపీగా బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లెల్లలో రైతుల నిరసన మంత్రి కేటీఆర్ పర్యటనలో జిల్లెల్ల వద్ద రైతులు నిరసన తెలిపారు. నీరు రాక పొలాలు ఎండిపోతున్నాయని పర్శరాములు అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పొలాల వద్ద కల్లాలు నిర్మించుకుంటే బిల్లుల రావడం లేదని లింగారెడ్డి అనే రైతు తెలిపారు. ఈ అంశంపై రైతులు కేకలు వేయడంతో మంత్రి కేటీఆర్ వారితో మాట్లాడారు. పొలాలు చూసి మాట్లాడాలని రైతులు కేకలు వేయడంతో పోలీసులు వారిని పక్కకు తీసుకెళ్లారు. మంత్రి కేటీఆర్ పర్యటనలో రైతులు నిరసన వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. -
తీర్పు ఎలా ఉన్నా సంబరాలొద్దు
న్యూఢిల్లీ: అయోధ్యలోని రామజన్మభూమి–బాబ్రీమసీదు కేసులో తీర్పు ఎవరి వైపు వచ్చినా, భారీ ఉత్సవాలకు దూరంగా ఉండాలని హిందూ–ముస్లిం ప్రతినిధులు నిర్ణయించారు. మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తర్ అబ్బాస్ నఖ్వి నివాసం వద్ద మంగళవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో హిందువుల తరఫున ఆరెస్సెస్, బీజేపీ ప్రతినిధులు కృష్ణ గోపాల్, రామ్‌లాల్‌లు హాజరయ్యారు. ముస్లింల తరఫున కేంద్రం మంత్రి అబ్బాస్ నఖ్వి, మాజీ కేంద్ర మంత్రి షానవాజ్ హుస్సేన్, జమాయత్ ఉలేమా ఏ హిందూ ప్రధాన కార్యదర్శి మహ్మూద్ మదాని, షియా బోధకుడు కాల్బే జవాద్‌లు హాజరయ్యారు. ఇందులో పలువురు వక్తలు మాట్లాడుతూ... తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా, ఉత్సవాలు జరపకూడదని పిలుపునిచ్చారు. గెలిచినట్లుగానీ, ఓడినట్లుగానీ భావించ కూడదని తెలిపారు. భారత్‌లో భిన్నత్వంలో ఏకత్వం కొనసాగుతోందని, అదే అందరినీ కలిపి ఉంచుతోందని అభిప్రాయపడ్డారు. 17న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, త్వరలో తీర్పు వెలువరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. సోషల్ మీడియాపై పోలీసుల కన్ను అయోధ్య కేసులో తీర్పు వెలువడనుందన్న ఊహాగానాల నేపథ్యంలో యూపీ ప్రభుత్వం సోషల్ మీడియాపై కన్నేసింది. ఫైజాబాద్ జిల్లాలో 16 వేల మంది వాలంటీర్లను పోలీసులు నియమించారు. దాదాపు అదే సంఖ్యలో మరో వాలంటీర్ల బృందాన్ని జిల్లాలోని 1,600 ప్రాంతాల్లో నియమించారు. వీరంతా తీర్పు తర్వాత సోషల్‌మీడియాపై నిఘా వేయనున్నారు. -
శివుడి గుడిలో నిఖా
లక్నో: కొన్నాళ్లుగా మతహింసకు సాక్షిగా నిలుస్తున్న ఉత్తరప్రదేశ్‌లో మతసామరస్యం వెల్లివిరిసింది. శివుడి సన్నిధిలో జరిగిన నిఖా.. హిందూ-ముస్లింల ఐక్యతకు చిహ్నంగా నిలిచింది... బులంద్‌షహర్ జిల్లా రాంనగర్ గ్రామానికి చెందిన ఇక్బాల్‌ఖాన్‌కు ఇద్దరు కూతుళ్లు నజ్మా, ముజ్మా...వారికి అదే జిల్లాకు చెందిన ఇద్దరు యువకులతో పెళ్లి నిశ్చయమైంది. మొదటగా తన ఇంట్లోనే కూతుళ్ల నిఖా చేయాలనుకున్నా ఇక్బాల్ తర్వాత తన కూతుళ్ల పెళ్లి మతసామరస్యానికి చిహ్నంగా ఉండాలని భావించాడు. వెంటనే ఊళ్లోని శివాలయంలో నిఖా నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అనుగుణంగా ఊళ్లోని రెండు మతాలకు చెందిన పెద్దలతో మాట్లాడి వారి ఆమోదాన్ని కూడా పొందాడు. పెళ్లి కొడుకులు కూడా శివాలయంలో నిఖా చేసుకోడానికి సంతోషంగా అంగీకరించారు. ఇక గుడిలోని పూజారులయితే సాదరంగా ఆహ్వానించారు. ఇంకేముంది.. కాసేపు మతాన్ని పక్కన పెట్టి ఊళ్లోని జనమంతా శివుడిగుడిలో జరిగే నిఖాకు పెద్దయెత్తున తరలివచ్చారు. రెండు మతాలకు చెందిన వందల మంది సాక్షిగా...శివుడి సన్నిధిలో... ఇస్లాం సంప్రదాయాలకు అనుగుణంగా... ఖాజీల మంత్రోచ్చారణల మధ్య... సోమవారం ఇక్బాల్ ఇద్దరు కూతుళ్ల నిఖా ఘనంగా జరిగింది. చివరగా, ఊళ్లో జనమంతా వధూవరులకు కన్నీటి వీడ్కోలు పలికి తమ మతసామరస్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు.