సిరిసిల్ల: హిందూ, ముస్లింల మధ్య పంచాయితీ పెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని, ఆ ట్రాప్‌లో ఎవరూ పడొద్దని, రానున్న ఆరు నుంచి తొమ్మిది నెలలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి సోమవారం పర్యటించారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో పల్లె దవాఖానా, స్కూల్‌లో సైన్స్‌ల్యాబ్, డిజిటల్ తరగతిని మంత్రి ప్రారంభించారు.
సిరిసిల్ల రగుడు జంక్షన్‌లో రూ.7.70 కోట్లతో సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రూ.1.10 కోట్లతో నిర్మించిన షాదీఖానాను ప్రారంభించిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఎనిమిదిన్నర ఏళ్లుగా రాష్ట్రంలో కుల, మతభేదాలులేని పాలనను అందిస్తున్నారని, పేదరికాన్ని తొలగించే నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు.
ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని వివరించారు. గతంలో ముస్లిం ఆడపిల్లలు చదువుకు దూరంగా ఉన్నారని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని అన్నారు. రాష్ట్రంలో ఏటా రూ.6 వేల కోట్లు వెచ్చిస్తూ గురుకులాల్లో విద్యనందిస్తున్నామని తెలిపారు. విద్యతోనే పేదరికం పోతుందని, విదేశీ చదువులకు 7 వేల మందికి రూ.20 లక్షల చొప్పున అందించామని వివరించారు.
సర్కారు వైద్యంపై పెరిగిన నమ్మకం
ఒకప్పుడు ‘నేను రాను తల్లో..’సర్కారు దవాఖానాకు అని పాటలు పాడుకునేవారని, ఇప్పుడు సర్కారు వైద్యంపై నమ్మకం పెరిగిందని కేటీఆర్ అన్నారు. సర్కారు ఆస్పత్రిలో 30 శాతం ఉన్న ప్రసూతి సేవలు ఇప్పుడు 62 శాతానికి పెరిగాయన్నారు. మెడికల్ కాలేజీ, పల్లె, బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తూ సర్కారు వైద్యంపై నమ్మకాన్ని పెంచామన్నారు.
ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ కంటే ఆశ వర్కర్లకు ఎక్కువ జీతాలు ఇస్తున్నామని చెప్పారు. పొద్దస్తమానం కొందరు సీఎం కేసీఆర్ తిడుతున్నారని, అలా తిడితే ఓట్లు రావని అన్నారు. ఎంపీగా బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లెల్లలో రైతుల నిరసన
మంత్రి కేటీఆర్ పర్యటనలో జిల్లెల్ల వద్ద రైతులు నిరసన తెలిపారు. నీరు రాక పొలాలు ఎండిపోతున్నాయని పర్శరాములు అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పొలాల వద్ద కల్లాలు నిర్మించుకుంటే బిల్లుల రావడం లేదని లింగారెడ్డి అనే రైతు తెలిపారు.
ఈ అంశంపై రైతులు కేకలు వేయడంతో మంత్రి కేటీఆర్ వారితో మాట్లాడారు. పొలాలు చూసి మాట్లాడాలని రైతులు కేకలు వేయడంతో పోలీసులు వారిని పక్కకు తీసుకెళ్లారు. మంత్రి కేటీఆర్ పర్యటనలో రైతులు నిరసన వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది.
హిందూ, ముస్లింల మధ్య పంచాయితీకి కుట్ర
Published Tue, Mar 7 2023 1:32 AM | Last Updated on Tue, Mar 7 2023 1:32 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment