Hindu State Sena
-
హిందూ రాష్ట్ర సేనను నిషేధించే యోచనలో సర్కార్: పాటిల్
ముంబై: నిషేధిత సంస్థల జాబితాలో హిందూ రాష్ట్ర సేనను కూడా చేర్చాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్ శనివారం అసెంబ్లీలో ప్రకటించారు. సావధాన తీర్మానం సందర్భంగా ఎమ్మెల్సీ కపిల్ పాటిల్ మాట్లాడుతూ... ‘ఛత్రపతి శివాజీ, బాల్ఠాక్రేలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేశాడన్న అనుమానంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను పుణేలో కొట్టి చంపిన ఘటన వెనుక ఏవైనా సంఘవిద్రోహ శక్తులు దాగున్నాయా? పుణే పోలీసులు మాత్రం హిందూ రాష్ట్ర సేన, ఆ సంస్థ అధ్యక్షుడు ధనంజయ్ దేశాయ్ మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏంటి?’ అని అడిగిన ప్రశ్నకు ఆర్ఆర్ పాటిల్ సమాధానమిస్తూ... హిందూ రాష్ట్ర సేనను నిషేధించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పారు. -
ఒకరోజు పోలీస్ కస్టడీకి ధనంజయ్ దేశాయ్
పుణే: హిందూ రాష్ట్ర సేన అధ్యక్షుడు ధనంజయ్ దేశాయ్‌ని న్యాయస్థానం ఒకరోజు పోలీస్ కస్టడీకి పంపింది. పుణేలోని హడప్సర్ ప్రాంతంలో ఈ నెల 2న జరిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్య కేసులో దేశ్య్ కూడా నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఛత్రపతి శివాజీ, శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రేపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ఫేస్బుక్లో పోస్ట్ చేశాడనే అనుమానంతో మొహసిన్ షేక్‌ను హిందూ రాష్ట్ర సేనకు చెందిన వ్యక్తులుగా భావిస్తున్న కొందరు కొట్టి చంపిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటిదాకా 19 మందిని అరెస్టు చేశారు. ఇందులో ధనంజయ్‌కు కోర్టు మంగళవారం 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయనను ప్రశ్నించేందుకు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోరడంతో బుధవారం అందుకు అనుమతిస్తూ ఒకరోజు పోలీస్ కస్టడీకి పంపింది.