బాలయ్య పీఏ చిందులు
రిజిస్ట్రార్ కార్యాలయంలో
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి శేఖర్ అధికారులపై బెదిరింపులకు దిగారు. తానే ఎమ్మెల్యే అయినట్లు వ్యవహరిస్తూ నోరు పారేసుకున్నారు. పోలీసు ప్రజాబాట పేరుతో జిల్లా ఎస్పీ హిందూపురంలో ఉండగానే చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి సబ్ రిజిస్ట్రార్ గోపాల్ కృష్ణ, ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ చంద్రప్పను బెదిరించారు. వివరాల్లోకి వెళితే.. గురువారం సబ్ రిజిస్ట్రార్ సెలవులో ఉండగా ఇన్చార్జ్ సీనియర్ క్లర్క్ చంద్రప్పకు బాధ్యతలు అప్పగించారు. ఆ రోజు సుమారు 400 ఎకరాల అసైన్డ్ భూమిని రిజిస్టర్ చేశారని మండల వ్యాప్తంగా వదంతులు వచ్చాయి. శుక్రవారం హిందూపురం చేరుకున్న బాలకృష్ణ పీఏ శేఖర్‌కు ఈ విషయాన్ని అక్కడి నాయకులు తెలిపారు. దీంతో ఆయన మందీ మార్బలంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి అధికారి చంద్రప్పపై ధ్వజమెత్తారు. ఎక్కువ మాట్లాడితే సస్పెండ్ చేయిస్తానన్నారు. అసైన్డ్ ల్యాండ్‌ను ఎలా రిజిస్ట్రర్ చేశారని మందలించారు. అయితే హైకోర్టు ఉత్తర్వుల మేరకు 42 ఎకరాలు మాత్రమే రిజిస్టర్ చేసినట్లు ఆయన చెప్పారు.
ఈ సమాధానంతో సంతృప్తి చెందని శేఖర్.. నా అనుమతి లేనిదే ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగరాదని హుకుం జారీ చేశారు. కాగా, హైకోర్టు ఉత్తర్వులు పాటించి రిజిస్టర్ చేయకపోతే కంటెంట్ ఆఫ్ కోర్టు కేసులు వేస్తామని ఒక పక్క వ్యాపారుల బెదిరింపులు, రిజిస్ట్రేషన్లు ఆపాలంటూ పీఏ బెదిరింపుల నేపథ్యంలో అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ విషయంపై సబ్ రిజిస్ట్రార్ గోపాలక్రిష్ణను సాక్షి ఫోన్లో సంప్రదించగా..‘ఎంఎల్ఎ పీఎ కార్యాలయానికి వచ్చి ఆరా తీసిన మాట వాస్తవమే. ఈ ప్రాంతంలో పరిశ్రమలు వస్తుండడంతో ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయకూదు. మీడియాలో వచ్చిన కథనాలపై విచారణ జరపాలి’ అని చెప్పారన్నారు. రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన వ్యవహారం చూసిన వారు ‘ఎమ్మెల్యే బాలకృష్ణ బిజీ కాబోలు.. అందుకే ఆయన పీఏకు అధికారం అప్పగించారని’ వ్యాఖ్యానించారు.