ఔరా.. హీరా!
ఆయనో 35 ఏళ్ల యువకుడు. దీనికితోడు ప్రతిష్టాత్మక ఎయిమ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం. ఆకర్శణీయమైన జీతం, ప్రశాంతమైన జీవితం. కానీ ఏదో వెలితి. తన వర్గానికి ఏమీ చేయలేకపోతున్నాననే ఆవేదన. వెరసి ఆరేళ్ల ప్రయత్నం తర్వాత రాజకీయ పార్టీ పుట్టింది. ఆదివాసీల్లో పట్టు సంపాదించి.. ఇప్పుడు ఏకంగా గిరిజనుడు ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో ఆ యువకుడు దూసుకెళ్తున్నాడు.
ఇది ఏయిమ్స్ రుమటాలజీ మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హీరాలాల్ అలావా గురించిన ఇంట్రడక్షన్. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా ఓ మారుమూల గ్రామానికి చెందిన హీరాలాల్.. స్థానికంగా ఉండే ’భిల్’ అనే ఓ గిరిజన తెగకు చెందిన యువకుడు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతస్థాయికి ఎదిగినా.. తన ఊరికి, గిరిజనులకు సరైన న్యాయం జరగడం లేదనే కారణంతో కార్యాచరణ ప్రారంభించాడు.
మొదటగా ఫేస్బుక్ పేజీని ప్రారంభించిన హీరాలాల్.. ఇప్పుడు జై ఆదివాసీ యువ శక్తి (జేస్)అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేసేందుకు రిజిస్ట్రేషన్ సంబంధింత సాంకేతిక అడ్డంకులు ఎదురవడంతో.. ప్రస్తుతానికి కాంగ్రెస్ సహకారంతో ఆయన ఒక్కరే పోటీ చేస్తున్నారు. అయితే.. చట్టసభల్లో గిరిజన ప్రతినిధుల సంఖ్య పెరగటం, గిరిజనుడిని మధ్యప్రదేశ్‌కు సీంను చేయడమే జేస్ లక్ష్యమని పేర్కొన్నారు.
ఆరేళ్ల ‘ఫేస్బుక్’ పోరాటం
కొడితే గట్టి దెబ్బే కొట్టాలనే సూత్రాన్ని డాక్టర్ హీరాలాల్ బాగా అర్థం చేసుకున్నారు. అందుకే తన సత్తా చాటేందుకు ఆరేళ్లుగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ‘యువ శక్తి’పేరుతో ఫేస్బుక్ పేజీ రూపొందించి.. గిరిజనుల చైతన్య పరిచే కార్యక్రమాలు చేపట్టారు. గ్రామాల్లో విద్యుత్ లేకపోవడం, నిర్వాసితులవుతున్న గిరిజనులు, ఆదీవాసీల కోసం స్కూళ్లు లేకపోవడం, పౌష్టికాహారలోపం తదితర అంశాలను ఆ ఎఫ్బీ పేజీలో ప్రస్తావించేవారు.
‘ఈ పేజీకి ఆదీవాసీ యువతలో మంచి గుర్తింపు వచ్చింది. 2013, మే 16న బద్వానీ గ్రామంలో ఏర్పాటుచేసిన ఫేస్బుక్ పంచాయతీలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమానికి మా పేజీని ఫాలో అయ్యేవారు చాలా మంది హాజరయ్యారు. చాలా అంశాలపై ఆరోజు ఆసక్తికర చర్చ జరిగింది. అదే ఏడాది ఇండోర్‌లో అంతర్జాతీయ ఫేస్బుక్ పంచాయతీని నిర్వహించాం’ అని హీరాలాల్ పేర్కొన్నారు.