6.74 కిలోల నగలు స్వాధీనం
సికింద్రాబాద్: నగరంలో అక్రమంగా విక్రయించేందుకు ముంబై నుంచి తెచ్చిన రూ. 1.75 కోట్ల విలువ చేసే 6.74 కిలోల బంగారు ఆభరణాలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంబైకి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ కర్నూలు కోటిరెడ్డి, వెస్ట్‌జోన్ ఇన్‌స్పెక్టర్ వై.భాస్కర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి....
శనివారం ఉదయం వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు లాడ్జీల్లో తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో సీతారాంబాగ్‌లోని డీలక్స్ లాడ్జిలో ముంబై నుంచి నగరానికి ఈనెల 14న వచ్చి బస చేస్తున్న అరీఫ్ పఠాన్ (27), హీరాలాల్ (28) వద్ద పెద్దమొత్తంలో బంగారు ఆభరణాలు లభించాయి. టాస్క్‌ఫోర్స్ పోలీసులు విచారించగా తాము ముంబైకి చెందిన నకోడా జ్యుయలరీలో ఉద్యోగులమని చెప్పారు.
షాపు యజమాని అశ్విక్‌జైన్ తమకు పది కిలోల బంగారు ఆభరణాలను ఇచ్చి నగరంలోని దుకాణాల్లో విక్రయించమన్నారని తెలిపారు. నగరానికి చేరుకున్న రోజే 1.25 కిలోల ఆభరణాలు విక్రయించి, మిగిలింది తమవెంటే ఉంచుకున్నామని వివరించారు. రెండ్రోజుల్లో మరికొన్ని దుకాణాలకు అందించాల్సిందన్నారు. ఇదిలా ఉండగా సదరు బంగారానికి సంబందించిన ధ్రువపత్రాలు, ప్రభుత్వ సుంకం చెల్లించిన రుజువులు అడగగా వాటి వివరాలు తమకు తెలియదని పేర్కొన్నారు.
ఈ ఆభరణాలకు సంబంధించి నకోడా జ్యుయలరీ యజమాని సుమారు రూ. 55 లక్షల సుంకం చెల్లించాల్సి ఉన్నట్టు టాస్క్‌ఫోర్స్ పోలీసులు అంచనా వేస్తున్నారు. కేసును తదుపరి విచారణ నిమిత్తం ఆదాయపుపన్ను శాఖ అధికారులకు బదలాయించినట్లు అదనపు డీసీపీ కోటిరెడ్డి విలేకరులకు తెలిపారు.