పక్షం రోజుల్లో నా మార్కు అభివృద్ధి
తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడి
హైదరాబాద్: నగరంలో పేదలు నివసిస్తున్న బస్తీల్లోనే వారికి ఇళ్ల నిర్మాణం చేయించి ఇస్తామనీ, తద్వారా దేశంలోనే తెలంగాణను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. పక్షం రోజుల్లో తన మార్కు అభివృద్ధిని చేసేందుకు శ్రీకారం చుడతానన్నా రు. శుక్రవారం సనత్‌నగర్ నియోజకవర్గంలోని ఐడీహెచ్‌కాలనీలోని పురాతన క్వార్టర్ల స్థానంలో రూ.36.54 కోట్లతో చేపట్టనున్న 396 గృహని ర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ బస్తీ ల్లో ఎక్కడి వారికి అక్కడే గృహాలు నిర్మించి ఇస్తామన్నారు. దేశంలో పేదలకు నిర్మించిన ఇళ్ల విస్తీ ర్ణం 368 చదరపు అడుగులకు మించలేదని కానీ తొలిసారి బోయిగూడ ఐడీహెచ్‌కాలనీలో 580 చదరపు అడుగుల్లో నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. లబ్దిదారుడి వాటా లేకుండా ఒక్కో ఇంటికి రూ.7.9లక్షలు వెచ్చించి నిర్మించి ఇస్తామన్నారు. అయిదు లేదా ఆరు నెలల్లో నిర్మాణాలు పూర్తవుతాయన్నారు. కాలనీలో ఒక వ్యాపార సముదాయం, గుడి నిర్మాణం చేపట్టాలని యోచిస్తున్నామని దీనికి అందరూ సహకరించాలన్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా బుల్డోజర్లతో ఏ బస్తీ వాసుల గుడిసెలను కూలగొట్టబోమన్నారు.
దళిత, గిరిజన మైనార్టీ వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే తమ లక్ష్మ్యమన్నారు. హైదరాబాద్ నలుమూలల కొందరు కబ్జాలు చేశారనీ వాటి నుంచి నాలుగు తుకడాలను స్వాధీనం చేసి అమ్మేస్తే రూ.20వేల కోట్లు వస్తాయని వాటితో పేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. తన తరహా పాలన ఇంకా ప్రారంభం కాలేదని ఇన్ని రోజులూ గత ప్రభుత్వాలు చేసిన నిర్వాకాలను తెలుసుకునేందుకే సమయం పట్టిందన్నారు. నగరంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలను కలుపుకుని తన మార్కు అభివృద్ధి పనులకు త్వరలో శ్రీకారం చుడతానన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పద్మారావు, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీ బండారు దత్తాత్రేయ, వినోద్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు వి. హన్మంతరావు,తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్‌నగర్‌లో పర్యటన
సనత్‌నగర్ నియోజకవర్గంలోని నెక్లెస్‌రోడ్‌ను ఆనుకుని ఉన్న అంబేద్కర్‌నగర్‌లో కూడా సీఎం కేసీఆర్ పర్యటించారు. ఐడీహెచ్‌కాలనీలో గృహ నిర్మాణ పనులు ప్రారంభించిన అనంతరం ఆయన బస్తీలో పర్యటించి బస్తీ వాసులతో మాట్లాడారు.అంతా కలసి మాట్లాడుకుని ఒకే మాటమీదకు వచ్చి సహకరిస్తే15 రోజుల్లో పునాదిరాయి వేస్తానని హామీ ఇచ్చారు.
బేగంపేట్ ఫతేనగర్ లింక్‌రోడ్ ప్రారంభం
బేగంపేట్ నుంచి ఫతేనగర్ వెళ్లేందుకు ఫతేనగర్ లింకు రోడ్డును కేసీఆర్ శుక్రవారం ప్రారంభించారు. రూ.45 కోట్లతో ఈ పనులను పూర్తి చేశారు. సనత్‌నగర్, బల్కంపేట్ నుంచి నేరుగా ఈ మార్గం గుండా బేగంపేటకు చేరుకోవచ్చు. ఈ పనులను దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 2007లో ప్రారంభించారు.