ప్రపంచంలో అతి పెద్ద హంతకుడు ఎవరు?
ప్రపంచంలో అతి పెద్ద హంతకుడు ఎవరు? అతడు ఎన్ని హత్యలు చేశాడు? మానవాళికి శాంతి, సహనాన్ని బోధించడంలో ఎవరు ముందున్నారు? తమ పరిశోధనలతో జీవన గమనాన్ని మార్చేసిన శాస్త్రవేత్తల్లో మిమ్మల్ని ప్రభావితం చేసినవారెవరు?.. ఇలా తమదైన ప్రత్యేక ముద్రతో అటు హీరోలుగా, ఇటు విలన్లుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తుల గురించి ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో ఆశ్చర్యకరమైన సమాధానాలు వెలుగుచూశాయి.
పాకిస్థాన్, అర్జెంటీనా, దక్షిణ కొరియా, ఇటలీ, అమెరికా దేశాలకు చెందిన వివిధ యూనివర్సిటీల్లో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఆయా వర్సిటీలకు చెందిన దాదాపు 7వేల మంది విద్యార్థినీ విద్యార్థులు తాము ఆరాధించేవారితోపాటు అసహ్యించుకునే చరిత్రాత్మక వ్యక్తులెవరో కుండబద్దలు కొట్టారు. దాని ప్రకారం ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్.. హిస్టరీ హీరోల్లో ప్రధమ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో జీసస్ క్రైస్ట్, మదర్ థెరిసా, మహాత్మాగాంధీల కన్నా ఐన్్స్టీనే విద్యార్థుల ఆదరణ చూరగొన్నారు.
ఇక ప్రపంచ విలన్ల విషయంలో మరిన్ని ఆశ్చర్యకరమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అఫ్ఘానిస్థాన్, ఇరాక్ తో యుద్ధంచేసి లక్షల మంది అమాయకుల్ని హత్యచేశారని ఆరోపిస్తూ అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ను విలన్ల జాబితాలో చేర్చారు అధ్యయనంలో పాల్గొన్న విద్యార్థులు. సామ్యవాద స్థాపనలో తమకు అడ్డొచ్చినవాళ్లందరినీ హతమార్చిన కారణంగా రష్యా మాజీ పాలకులు స్టాలిన్, లెనిన్లు కూడా విలన్ల జాబితాలోనే చేరిపోయారు. ఇక జర్మనీ మాజీ నియంత అడాల్ఫ హిట్లర్ ప్రపంచ విలన్లలో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అధ్యయనం వెల్లడించిన జాబితా ఇదే..
ప్రపంచ హీరోల జాబితా: 1 ఆల్బర్ట్ ఐన్స్టీన్, 2 మదర్ థెరిసా, 3 మహాత్మా గాంధీ, 4 మార్టిన్ లూథర్ కింగ్, 5 ఐజక్ న్యూటన్, 6 జీసస్ క్రైస్ట్, 7 నెల్సన్ మండేలా, 8 థామస్ ఎడిసన్, 9 అబ్రహాం లింకన్, 10 గౌతమ బుద్ధుడు
ప్రపంచ విలన్ల జాబితా: 1 అడాల్ఫ్ హిట్లర్, 2 ఒసామా బిన్ లాడెన్, 3 సద్దాం హుస్సేన్, 4 జార్జి బుష్, 5 స్టాలిన్, 6 మావో, 7 లెనిన్, 8 ఛెంఘీజ్ ఖాన్, 9 సలాద్దీన్ (ఈజిప్ట్ తొలి సుల్తాన్), 10 కిన్ షి హువాంగ్ (ఉమ్మడి చైనా పాలకుడు)