Hithudu
-
సున్నితమైన ప్రేమకథ
జగపతిబాబు, మలయాళ నటి మీరా నందన్ జంటగా 2015లో విడుదలైన చిత్రం ‘హితుడు’. కె.విప్లవ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా నంది అవార్డు కూడా పొందింది. విప్లవ్ తాజాగా కొత్త సినిమాని తెరకెక్కించనున్నారు. కేఎస్వీ సమర్పణలో సిరంజ్ సినిమా పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది. ‘ప్రేమకు రెయిన్ చెక్’ ఫేమ్ అభిలాష్, ‘అరవింద సమేత వీర రాఘవ, మిస్టర్ మజ్ను’ చిత్రాల్లో నటించిన రాఘవ్ కథానాయకులు. విప్లవ్ మాట్లాడుతూ– ‘‘సున్నితమైన ప్రేమకథతో నిర్మించనున్న చిత్రమిది. నేటి తరం యువత జీవనశైలికి దగ్గరగా ఉంటుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు పూర్తి కావచ్చాయి’’ అన్నారు. -
ఒక్కరున్నా చాలు...
మన తోటి వారికి మంచి చేయకపోయినా పర్లేదు కానీ, చెడు చేయకుండా ఉంటే చాలనుకునే పరిస్థితి ప్రస్తుతం సమాజంలో ఉంది. సాటి మనిషి బాగు కోరుకునే మనిషి ఒక్కరున్నా చాలు అనే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘హితుడు’. సుంకర మధుమురళి సమర్పణలో కేఎస్వీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేఎస్వీ తనయుడు విప్లవ్ ఈ చిత్రానికి దర్శకుడు. జగపతిబాబు, మీరానందన్ ఇందులో హీరో హీరోయిన్లు. ఈ సినిమా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. నిర్మాత మాట్లాడుతూ -‘‘వైవిధ్యమైన కథాకథనాలకు వాణిజ్య హంగులు జోడించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు ఎన్. శివప్రసాద్, దర్శకుడు శివనాగేశ్వరరావు, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.