సీఆర్పీల వేతనాలు నిలుపుదల
హెచ్ఎంల నిర్లక్ష్యం ఫలితమే కారణం
మోర్తాడ్: సర్వశిక్ష అభియాన్ పథకంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (సీఆర్పీ)ల వేతనాలను జిల్లా అధికార యంత్రాంగం నిలిపి వేసింది. గ్రామీణ విద్యా రిజిస్టర్లను పూర్తి చేసి ఇవ్వడంలో హెచ్ఎంలు జాప్యం చేసిన కారణంగా అధికార యంత్రాం గం సీఆర్పీలపై చర్యలు తీసుకుంది. జిల్లాలో 209 మంది సీఆర్పీలు పని చేస్తున్నారు. క్లస్టర్ పరిధిలోని పాఠశాలలకు, మండల రిసోర్స్ సెంటర్కు మధ్య సీఆర్పీలు సమన్వయం చేస్తారు.
వీరికి ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ పథకం ద్వారా రూ.8,500 వేతనం చెల్లిస్తుంది. అయితే, ఏప్రిల్కు సంబంధించిన వేతనాన్ని మాత్రం సర్వశిక్ష అభియాన్ ఉన్నతాధికారులు నిలపివేశారు. గ్రామీణ విద్యా రిజిస్టర్లను పూర్తి చేసి సర్వశిక్ష అభియాన్ పథకానికి అందించాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులపై ఉంది.
కొన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ రిజిస్టర్లను అందించక పోవడంతో జిల్లాలోని అందరు సీఆర్పీల వేతనాన్ని అధికారులు నిలిపివేశారు. పాఠశాలలకు వేసవి సెలవులను ఇవ్వడంతో గ్రామీణ విద్యా రిజిస్టర్లను పూర్తి చేసివ్వడంపై హెచ్ఎంలు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రధానోపాధ్యాయులు చేసిన తప్పిదానికి తమ వేతనం నిలిపి వేయడం ఎంతవరకు సబబు అని సీఆర్పీలు వాపోతున్నారు. వీరితో ఎంఐఎస్, కంప్యూటర్ ఆపరేటర్, మెస్సెంజర్ల వేతనాలను చెల్లించడం నిలిపివేసిన అధికారులు రెండ్రోజుల కింద సీఆర్పీలను మినహాయించి ఇతర ఉద్యోగుల వేతనాలు చెల్లించారు. ప్రభుత్వం స్పందించి తమకు కూడా వేతనాలు ఇప్పించాలని సీఆర్పీలు కోరుతున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకే..
గ్రామీణ విద్యా రిజిస్టర్లను అందచేయక పోవడంతో సీఆర్పీల వేతనాలు నిలిపి వే యాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిం ది. అందుకే వేతనాలు నిలిపివేశాం. తదుపరి ఆదేశాలు వస్తే వేతనాలు చెల్లిస్తాం.
- రవికిరణ్, సర్వశిక్ష అభియాన్ ప్రతినిధి