hockey association
-
ఏపీహెచ్‌ఏకి అంతర్జాతీయ ఖ్యాతి
ఏఎన్‌యూ(గుంటూరు): ఎందరో అంతర్జాతీయ హాకీ క్రీడాకారులను అందించిన ఖ్యాతి ఆంధ్రప్రదేశ్ హాకీ అసోసియేషన్‌కు ఉందని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఏపీ హాకీ అసోసియేషన్(ఏపీహెచ్‌ఏ) ఆధ్వర్యంలో ఆదివారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఏపీ హాకీ ఐదో వార్షికోత్సవం, హాకీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున హాకీ క్రీడకు అన్ని విధాలా ప్రోత్సాహం అందించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఏపీ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు, ఐఏఎస్ ఆఫీసర్ ఎం.కె.మీనా, గుంటూరు జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ , ఏఎన్‌యూ ఇన్చార్జి వీసీ కె రామ్‌జీ, ఏపీ హాకీ అసోసియేషన్ డైరెక్టర్ నిరంజన్‌రెడ్డి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షరీన్‌బేగం ప్రసంగించారు. హాకీ రంగానికి విశేష సేవలందించిన 15 మంది ప్రముఖులకు పురస్కారాలు, ఈ ఏడాది హాకీలో ప్రతిభ కనబరిచిన 9 మంది క్రీడాకారులు, కోచ్‌లు, నిపుణులు, అసోసియేషన్ ప్రతినిధులకు అవార్డులను గవర్నర్ ప్రదానం చేశారు. -
మ్యాచ్‌లో ఓడితే గుండు గీయించాడు
కోల్‌కతా: ఆటల పోటీల్లో గెలుపోటములు సహజం. కానీ ఓడితే ఏకంగా గుండు గీయించిన ఘటన బెంగాల్ హాకీని ఉలిక్కిపడేలా చేసింది. వెంటనే... అండర్–19 ఆటగాళ్లకు కోచ్ విధించిన ‘గుండు’ శిక్షపై బెంగాల్ హాకీ సంఘం (బీహెచ్ఏ) విచారణకు ఆదేశించింది. నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు సోమవారం త్రిసభ్య విచారణ కమిటీని నియమించినట్లు బీహెచ్ఏ కార్యదర్శి స్వపన్ బెనర్జీ తెలిపారు. జూనియర్ నేషనల్ చాంపియన్‌షిప్ (బి–డివిజన్)లో భాగంగా జబల్పూర్లో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బెంగాల్ అండర్–19 జట్టు 1–5తో నామ్ధారి ఎలెవన్ చేతిలో ఓడింది. దీంతో ఆగ్రహించిన కోచ్ ఆనంద్ కుమార్ వాళ్లను గుండు చేసుకోమన్నట్లు ఆరోపణలొచ్చాయి. కోచ్ ఆదేశాలతో జట్టులోని 18 మందిలో 16 మంది గుండు చేయించుకున్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన బీహెచ్ఏ... విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. కోచ్ ఆనంద్ మాత్రం గుండు చేయించుకోమని చెప్పలేదన్నారు. ‘మ్యాచ్ సమయంలో నేను వారిపై కేకలు వేశాను. అంతేగానీ ఓడిపోతే గుండు చేసుకోవాలని ఆదేశించలేదు. నేను ముందు ఆటగాళ్లతో మాట్లాడతా. నా భార్య ఆసుపత్రిలో ఉండటంతో అసలు ఏం జరిగిందో తెలుసుకునే అవకాశం నాకు లేకుండా పోయింది’ అని కోచ్ వివరణ ఇచ్చారు. -
ఇండోర్ హాకీలో తెలంగాణ జట్టుకు రజతం
సాక్షి, హైదరాబాద్: సీనియర్ జాతీయ ఇండోర్ హాకీ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ పురుషుల జట్టు రన్నరప్‌గా నిలిచింది. మహారాష్ట్ర హాకీ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల నాసిక్‌లో ఈ పోటీలు జరిగాయి. ఇందులో తెలంగాణ ఇండోర్ హాకీ జట్టు ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. టైటిల్ పోరులో మణిపూర్ జట్టు 5-1తో తెలంగాణ జట్టుపై ఘనవిజయం సాధించింది. ఈ టోర్నీ మహిళల విభాగంలో తెలంగాణ జట్టు క్వార్టర్ ఫైనల్లో పరాజయం చవిచూసింది. రజతంతో తిరిగొచ్చిన పురుషుల జట్టును మంగళవారం తెలంగాణ ఇండోర్ హాకీ సంఘం కార్యదర్శి కళ్యాణి సింగ్, సంయుక్త కార్యదర్శి సరంజీత్ సింగ్ అభినందించారు.