
కోల్‌కతా: ఆటల పోటీల్లో గెలుపోటములు సహజం. కానీ ఓడితే ఏకంగా గుండు గీయించిన ఘటన బెంగాల్ హాకీని ఉలిక్కిపడేలా చేసింది. వెంటనే... అండర్–19 ఆటగాళ్లకు కోచ్ విధించిన ‘గుండు’ శిక్షపై బెంగాల్ హాకీ సంఘం (బీహెచ్‌ఏ) విచారణకు ఆదేశించింది. నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు సోమవారం త్రిసభ్య విచారణ కమిటీని నియమించినట్లు బీహెచ్‌ఏ కార్యదర్శి స్వపన్ బెనర్జీ తెలిపారు. జూనియర్ నేషనల్ చాంపియన్‌షిప్ (బి–డివిజన్)లో భాగంగా జబల్‌పూర్‌లో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బెంగాల్ అండర్–19 జట్టు 1–5తో నామ్‌ధారి ఎలెవన్ చేతిలో ఓడింది.
దీంతో ఆగ్రహించిన కోచ్ ఆనంద్ కుమార్ వాళ్లను గుండు చేసుకోమన్నట్లు ఆరోపణలొచ్చాయి. కోచ్ ఆదేశాలతో జట్టులోని 18 మందిలో 16 మంది గుండు చేయించుకున్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన బీహెచ్‌ఏ... విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. కోచ్ ఆనంద్ మాత్రం గుండు చేయించుకోమని చెప్పలేదన్నారు. ‘మ్యాచ్ సమయంలో నేను వారిపై కేకలు వేశాను. అంతేగానీ ఓడిపోతే గుండు చేసుకోవాలని ఆదేశించలేదు. నేను ముందు ఆటగాళ్లతో మాట్లాడతా. నా భార్య ఆసుపత్రిలో ఉండటంతో అసలు ఏం జరిగిందో తెలుసుకునే అవకాశం నాకు లేకుండా పోయింది’ అని కోచ్ వివరణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment