ఇండోర్ హాకీలో తెలంగాణ జట్టుకు రజతం
సాక్షి, హైదరాబాద్: సీనియర్ జాతీయ ఇండోర్ హాకీ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ పురుషుల జట్టు రన్నరప్‌గా నిలిచింది. మహారాష్ట్ర హాకీ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల నాసిక్‌లో ఈ పోటీలు జరిగాయి. ఇందులో తెలంగాణ ఇండోర్ హాకీ జట్టు ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకుంది.
టైటిల్ పోరులో మణిపూర్ జట్టు 5-1తో తెలంగాణ జట్టుపై ఘనవిజయం సాధించింది. ఈ టోర్నీ మహిళల విభాగంలో తెలంగాణ జట్టు క్వార్టర్ ఫైనల్లో పరాజయం చవిచూసింది. రజతంతో తిరిగొచ్చిన పురుషుల జట్టును మంగళవారం తెలంగాణ ఇండోర్ హాకీ సంఘం కార్యదర్శి కళ్యాణి సింగ్, సంయుక్త కార్యదర్శి సరంజీత్ సింగ్ అభినందించారు.