hollywood heroine
-
‘ఆస్కార్ నటితో మీకు పోలికా.. ప్లీజ్ బ్రేక్ తీసుకొండి’
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. దేశంలో జరుగుతున్న పరిణామాలపై కంగనా తనదైన రీతిలో స్పందిస్తారు. నచ్చనివారిని డైరెక్ట్‌గానే విమర్శిస్తారు. ట్రోల్స్‌ని అస్సలే పట్టించుకోరు. తాజాగా కంగనా తనని తాను హాలీవుడ్ స్టార్ నటి మెర్లీ స్ట్రీప్, ప్రముఖ ఇజ్రాయిల్ నటి గాల్ గాడోట్‌లతో పోల్చుకుంటూ.. వారి కంటే తానే ఎంతో మంచి నటని.. కావాలంటే తన కంటే గొప్ప నటిని భూమ్మీద మరొకరిని చూపించగలరా అంటూ ట్విట్టర్ వేదికగా సవాలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నెటిజనులు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. రకరకాల మీమ్స్ తయారు చేసి ఆమెను ట్రోల్ చేశారు. ‘‘అసలు మెరిల్ స్ట్రీప్‌తో నీకు పోలికేంటి.. ఆమె 3 సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు.. 21 సార్లు ఆస్కార్ బరిలో నిలిచారు... మరి మీరు ఎన్ని ఆస్కార్లు సాధించారంటూ’’ ట్రోల్ చేశారు నెటిజనులు. ఈ విమర్శలపై కంగనా విరుచుకుపడ్డారు. ‘‘ఆస్కార్ అనేది కేవలం అమెరికన్ సినిమాలకు మాత్రమే ఇచ్చే అవార్డు. ఆ లెక్కన చూసుకుంటే.. మెరిల్ స్ట్రీప్ ఎన్ని జాతీయ అవార్డులు, పద్మ పురస్కారాలు సాధించారు. ఇప్పటికైనా మారండి.. బానిస మనస్తత్వం నుంచి బయటపడి.. ఆత్మ గౌరవంతో మెలగండి’’ అని సూచిస్తూ ట్వీట్ చేశారు. అయితే కంగనా వాదన నెటజనులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. ‘‘అసలు సెన్స్ ఉందా మీకు.. మీరు సోషల్ మీడియాలో హైపర్ యాక్టీవ్‌గా మారారు. మీ బుర్ర పనిచేయడం లేదనుకుంటాను. ప్లీజ్ మేడం.. కొద్ది రోజుల పాటు బ్రేక్ తీసుకుని సోషల్ మీడియాకు దూరంగా ఉండండి’’ అంటూ సూచిస్తున్నారు నెటిజనులు. చదవండి: ఆమె డీఎన్ఏలోనే విషం ఉండొచ్చు: తాప్సీ కంగనా ఇరవై అయిదు కోట్ల ఫైట్! -
ఆ ఫోటో ఆత్మశక్తితో నింపుతుంది..
ఇంగ్లిష్ సినిమాలు చూసే ఆసక్తి లేని వారు కూడా, ఎక్కడైనా ఫొటో కనిపిస్తే ఆసక్తిగా ఆగి చూసే హాలీవుడ్ కథానాయిక సల్మా హైక్. 54 ఏళ్లు అని గూగుల్ తనకేదో తెలుసున్నట్టు సల్మా గురించి చెప్పొచ్చినా ఆ యాభై నాలుగు అనేది ఆమెకు బాగా వదులైన గౌను లానే కనిపిస్తుంది. ఈ మెక్సికన్ బ్యూటీకి వయసన్నది ఎప్పటికీ చిన్న పిల్లలు తొడుక్కుని నడిచే పెద్దవాళ్ల చెప్పుల జతే! అలసిపోవడానికి సిద్ధపడితేనే సల్మా అందాన్ని వర్ణించడానికి ఎవరైనా మాటలు వెతుక్కునే ప్రయత్నం చేయాలి. అంతగా కష్టపడలేని బద్ధకస్తులు ‘అమృతం కానీ తాగిందా!’ అనే ఒక పొంతన లేని ఆశ్చర్యంతో మూడంటే మూడే మాటల ఏక వచన కవిత్వాన్ని ఆమె కోసం ధారపోయొచ్చు. అమృతం తాగితే అలా ఎన్నేళ్లయినా పడి ఉంటారని చెప్పిన వాళ్లు అమృతం దీర్ఘాయుష్షుతో పాటు పనిలో పనిగా అందాన్ని కూడా ప్రసాదిస్తుందని ఎక్కడా చెప్పినట్లయితే లేదు. అందం, అమృతం రెండూ వేర్వేరు గ్రూపుల సబ్జెక్టులు. ఆర్ట్స్, సైన్సు లా. సరే, మన సబ్జెక్టులోకి వచ్చేద్దాం. సల్మా హైక్! రోజూ అద్దంలో చూసుకున్నట్లే ఒక్కోసారి తనకు తన అంతః సౌందర్యాన్ని చూసుకోవాలని అనిపిస్తుందట సల్మాకి! ‘అప్పుడు నేను వెళ్లి, ధ్యానంలో కూర్చుంటాను. నాలోకి నేను ప్రయాణిస్తాను. నన్ను నేను సాక్షాత్కరింపజేసుకుంటాను. ఆ దివ్యలోకంలో నేను ఎలా ఉంటానో తెలుసా! పద్మపీఠంపై పద్మాసనం వేసుకుని కూర్చొని ఉంటాను. పట్టుచీర, పట్టు జాకెట్ ధరించి ఉంటాను. తలపై ధగధగా మెరిసే కిరీటం ఉంటుంది. ఒంటి నిండా ఆభరణాలు ఉంటాయి. నాలుగు చేతులు ఉంటాయి. రెండు చేతుల్లో కలువపూలు ఉంటాయి. ఒక అరచేతి నుంచి బంగారు నాణేలు జలజలా కురుస్తుంటాయి. ఇంకొకటి అభయహస్తం. ముఖం ప్రసన్నంగా ఉంటుంది. అదే నా ఆత్మ సౌదర్యం. సంపద, అదృష్టం, కరుణ, సంతోషం కలగలిసిన స్వరూపం’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఆత్మ సౌందర్యం ఫొటోను పోస్ట్ చేశారు సల్మా హైక్! మన శ్రీమహాలక్ష్మి..లక్ష్మీదేవి పటమే ఆ ఫొటో. ‘గాడెస్ లక్ష్మి ఫొటో నన్ను ఆత్మశక్తితో, అపురూప అంతస్సౌందర్యంతో నింపుతుంది’ అని పోస్ట్ పెట్టారు సల్మా హైక్! -
కొత్త ఏడాది కొత్త వరుడు కావాలి: హీరోయిన్
కొత్త సంవత్సరంలో తాను కొత్త వరుడి కోసం చూస్తున్నట్లు హాలీవుడ్ హీరోయిన్ వివికా ఎ ఫాక్స్ చెప్పింది. అయితే, అతడు బాగా సరదా మనిషి అయి ఉండాలని, 40 ఏళ్ల పైబడి ఉండాలని షరతులు పెట్టింది. కిల్ బిల్ సినిమాలో నటించిన ఫాక్స్ (52).. 2016 సంవత్సరం మొత్తం తాను చాలా బిజీగా ఉన్నానని, తన మీద తాను దృష్టి సారించడానికే సమయం సరిపోయిందని చెప్పింది. ఈ సంవత్సరం మాత్రం ఎలాగైనా సోల్‌మేట్‌ను వెతుక్కుంటానని స్పష్టం చేసింది. ఇప్పటికే చాలామంది యువకులను తాను చూశానని, అందువల్ల ఈసారి తనను తాను బాగా చూసుకోవడంతో పాటు భార్య బాగోగులు కూడా చూసే పెద్దమనిషి అయితే బాగుంటుందని అనుకుంటున్నానని చెప్పింది. ఒక మంచి భాగస్వామి కావాలన్నదే తన ఉద్దేశమని, సరదాగా ఉంటూ.. బయటకు తీసుకెళ్తూ, మంచి సెన్సాఫ్ హ్యూమర్ కలిగి ఉండి, ప్రయాణాలు అంటే ఇష్టం ఉండేవాళ్లు కావాలని తెలిపింది. -
రొమాన్స్ అంటే కష్టమంటున్న హీరోయిన్
సినిమా షూటింగులో హీరోలతో కలిసి రొమాన్స్ చేయమంటే అది తనకు చాలా కష్టంగా ఉంటుందని హాలీవుడ్ హీరోయిన్ ఒలివా మన్ అంటోంది. ఇటీవల విడుదలైన ఎక్స్‌మెన్: అపోకలిప్స్ సినిమాలో నటించిన ఈ హీరోయిన్.. ఆన్‌స్క్రీన్ రొమాన్స్ విషయంలో తనకు ఉన్న కష్టాల గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడింది. ''ఎప్పుడైనా సినిమాలలో రొమాంటిక్ సన్నివేశాలు వచ్చినప్పుడు.. ముద్దు కాకుండా మరికొంత ముందుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు అది నాకు చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా ఏదో జరుగుతోందని ప్రేక్షకులకు చూపించాల్సి వచ్చినప్పుడు అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది'' అని ఆమె తెలిపింది. మహిళల విషయంలో ఇలాంటి సీన్లు రాసేటప్పుడు చాలా సాధారణంగా రాసేస్తారని.. కానీ నటించేటప్పుడు మాత్రం అది తనలాంటి వాళ్లకు కష్టం అవుతుందని చెప్పింది. తాను ఇప్పుడు నటిస్తున్న 'ఆఫీస్ క్రిస్టమస్ పార్టీ' సినిమా విషయం మాత్రం వేరేలా ఉంటుందని.. ఇందులో నిజజీవితంలో ఉండేలాంటి ఘటనలే కనిపిస్తాయని వివరించింది. మహిళలను తెరమీద చిత్రీకరిస్తున్న తీరు దారుణంగా ఉంటోందని.. ఈ విషయంలో సమాజం తీరు కూడా మారాలని ఒలివా మన్ చెప్పింది.