ఆ ఫోటో ఆత్మశక్తితో నింపుతుంది.. | Article On Hollywood Heroine Salma Hayek | Sakshi
Sakshi News home page

లక్ష్మీ కళ.. 

Published Thu, Oct 15 2020 4:09 AM | Last Updated on Thu, Oct 15 2020 4:09 AM

Article On Hollywood Heroine Salma Hayek - Sakshi

ఇంగ్లిష్‌ సినిమాలు చూసే ఆసక్తి లేని వారు కూడా, ఎక్కడైనా ఫొటో కనిపిస్తే ఆసక్తిగా ఆగి చూసే హాలీవుడ్‌ కథానాయిక సల్మా హైక్‌. 54 ఏళ్లు అని గూగుల్‌ తనకేదో తెలుసున్నట్టు సల్మా గురించి చెప్పొచ్చినా ఆ యాభై నాలుగు అనేది ఆమెకు బాగా వదులైన గౌను లానే కనిపిస్తుంది. ఈ మెక్సికన్‌ బ్యూటీకి వయసన్నది ఎప్పటికీ చిన్న పిల్లలు తొడుక్కుని నడిచే పెద్దవాళ్ల చెప్పుల జతే! అలసిపోవడానికి సిద్ధపడితేనే సల్మా అందాన్ని వర్ణించడానికి ఎవరైనా మాటలు వెతుక్కునే ప్రయత్నం చేయాలి. అంతగా కష్టపడలేని బద్ధకస్తులు ‘అమృతం కానీ తాగిందా!’ అనే ఒక పొంతన లేని ఆశ్చర్యంతో మూడంటే మూడే మాటల ఏక వచన కవిత్వాన్ని ఆమె కోసం ధారపోయొచ్చు. అమృతం తాగితే అలా ఎన్నేళ్లయినా పడి ఉంటారని చెప్పిన వాళ్లు అమృతం దీర్ఘాయుష్షుతో పాటు పనిలో పనిగా అందాన్ని కూడా ప్రసాదిస్తుందని ఎక్కడా చెప్పినట్లయితే లేదు. అందం, అమృతం రెండూ వేర్వేరు గ్రూపుల సబ్జెక్టులు. ఆర్ట్స్, సైన్సు లా. సరే, మన సబ్జెక్టులోకి వచ్చేద్దాం.

సల్మా హైక్‌! రోజూ అద్దంలో చూసుకున్నట్లే ఒక్కోసారి తనకు తన అంతః సౌందర్యాన్ని చూసుకోవాలని అనిపిస్తుందట సల్మాకి! ‘అప్పుడు నేను వెళ్లి, ధ్యానంలో కూర్చుంటాను. నాలోకి నేను ప్రయాణిస్తాను. నన్ను నేను సాక్షాత్కరింపజేసుకుంటాను. ఆ దివ్యలోకంలో నేను ఎలా ఉంటానో తెలుసా! పద్మపీఠంపై పద్మాసనం వేసుకుని కూర్చొని ఉంటాను. పట్టుచీర, పట్టు జాకెట్‌ ధరించి ఉంటాను. తలపై ధగధగా మెరిసే కిరీటం ఉంటుంది. ఒంటి నిండా ఆభరణాలు ఉంటాయి.  నాలుగు చేతులు ఉంటాయి. రెండు చేతుల్లో కలువపూలు ఉంటాయి. ఒక అరచేతి నుంచి బంగారు నాణేలు జలజలా కురుస్తుంటాయి. ఇంకొకటి అభయహస్తం. ముఖం ప్రసన్నంగా ఉంటుంది. అదే నా ఆత్మ సౌదర్యం. సంపద, అదృష్టం, కరుణ, సంతోషం కలగలిసిన స్వరూపం’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఆత్మ సౌందర్యం ఫొటోను పోస్ట్‌ చేశారు సల్మా హైక్‌! మన శ్రీమహాలక్ష్మి..లక్ష్మీదేవి పటమే ఆ ఫొటో. ‘గాడెస్‌ లక్ష్మి ఫొటో నన్ను ఆత్మశక్తితో, అపురూప అంతస్సౌందర్యంతో నింపుతుంది’ అని పోస్ట్‌ పెట్టారు సల్మా హైక్‌! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement