నటీమనీ
స్టార్స్‌ని సినిమాలోకి తీసుకుంటే, ప్రేక్షకుల్ని వాళ్లు థియేటర్‌కి రప్పించగలుగుతారు అంటారు. సార్ట్స్ చిన్నితెరపై దర్శనమిచ్చినా ప్రేక్షకులకు పండగే. స్టార్స్ క్రేజ్ అలాంటిది. ఆ క్రేజ్, వాళ్ల సంపాదన ఎప్పుడూ ఆశ్చర్యపరిచే టాపిక్కే. ప్రతి ఏడాది ఎవరెంత సంపాదిస్తున్నారు అని ఓ జాబితాను విడుదల చేస్తుంది ఫోర్బ్స్ మ్యాగజీన్. ఈ ఏడాది హాలీవుడ్ హీరోయిన్లు సంపాదన గురించి ఈ పత్రిక ఒక జాబితా విడుదల చేసింది.
మరి.. ఏయే నటీమణి ఎంత ‘మనీ’ సంపాదిస్తున్నారో చూద్దాం.
‘మోడ్రన్ ఫ్యామిలీ’ టీవీ సిరీస్ స్టార్ సోఫియా వెర్గారా అత్యధికంగా సంపాదిస్తున్న నటీమణుల్లో మొదటి వరుసలో ఉన్నారు. 43 మిలియన్ డాలర్స్ ఆర్జిస్తూ ఆమె మొదటి వరుసలో ఉన్నారు. 43 మిలియన్లు అంటే మన కరెన్సీలో సుమారు 315 కోట్లు. ఆమె తర్వాతి స్థానంలో ఏంజెలినా జోలీ ఉన్నారు. సుమారు 35.5 మిలియన్లు (దాదాపు 256 కోట్లు) సంపాదిస్తున్నారు జోలీ. మూడో స్థానాన్ని గాల్ గాడోట్ సంపాదించారు. ఆమె సంపాదన 31 మిలియన్లు. ఆ తర్వాత మెలిసా మెకార్తీ (25 మిలియన్ డాలర్లు), మెరిల్ స్ట్రీప్స్ ( 24 మిలియన్ డాలర్లు), ఎమీలా బ్లంట్ (22.5 మిలియన్ డాలర్లు), నికోల్ కిడ్మన్ (22 మిలియన్ డాలర్లు), ఎలెన్ పోంపీ (19 మిలియన్ డాలర్లు), ఎలిజిబెత్ మోస్ (16 మిలియన్ డాలర్లు), వోయిలా డేవిస్ (15.5 మిలియన్ డాలర్లు)తో టాప్ టెన్‌లో ఉన్నారు.
సాధారణంగా సినిమాల ద్వారా ఎక్కువ ఆర్జించడం చూస్తుంటాం. కానీ ఈ ఏడాది టాప్‌లో ఉన్న సోఫియా వెర్గారా సంపాదన భారీగా ఉండటానికి కారణం ప్రధానంగా రెండు పాపులర్ టీవీ షోలు కావడం విశేషం. మార్వెల్ నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తున్న ‘ది ఎటర్నల్స్’ కోసం భారీ పారితోషికం అందుకున్నారు ఏంజెలినా జోలీ. ఆమె ఆదాయంలో ఎక్కువ శాతం ఈ సినిమా నుంచే వచ్చిందని టాక్. సాధారణంగా ప్రతీ ఏడాది సినిమాలు ఎక్కువ చేసే స్టార్స్ అత్యధికంగా సంపాదిస్తున్నవారి జాబితాలో కనిపిస్తారు. కానీ ఈ ఏడాది టీవీ స్టార్స్ కూడా ఈ జాబితాలో కనిపించడం విశేషం. ఎలెన్ పోంపీ, ఎలిజిబెత్ మోస్, వోయిలా డేవిస్ టీవీ స్టార్సే. సినిమా విడుదలలు ఏమీ లేకపోవడం, కొత్త సినిమా ప్రాజెక్ట్స్ ప్రకటించకపోవడం వల్ల చిన్నితెర స్టార్స్ సంపాదన పెరిగిందని హాలీవుడ్ మీడియా పేర్కొంది.