కొలిక్కి రాని హీరోయిన్ల నగ్న చిత్రాల కేసు
జెన్నిఫర్ లారెన్స్ లాంటి కొందరు హాలీవుడ్ తారల నగ్న చిత్రాలను హ్యాక్ చేసి ప్రపంచానికి లీక్ చేసిన ఘటన జరిగి సోమవారానికి సరిగ్గా ఏడాది. ఈ కేసును విచారణకు చేపట్టిన ఎఫ్‌బీఐ ఎంతోమంది ఐపీ చిరునామాలు గాలించినా, ఎన్నో కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నా నేటికి దోషులను పట్టుకోలేకపోయింది. కేసు ఇప్పటికీ తెరిచే ఉందని, మూసేయలేదని ఎఫ్‌బీఐ అధికారులు సోమవారం సెలవిచ్చారు.
ఆపిల్ 'ఐక్లౌడ్' ఖాతాలను ఆగస్టు 31, 2014 నాడు హ్యాకర్లు హ్యాక్ చేసి కొంత మంది హాలీవుడ్ హీరోయిన్ల నగ్న చిత్రాలను బయటకు లాగారు. వాళ్లకు సంబంధించిన కొన్నివేల చిత్రాలను వివిధ వెబ్‌సైట్లలో పోస్ట్ చేశారు. ఇది అప్పట్లో ఎంతో సంచలనం సృష్టించింది. తమ సర్వర్లు పటిష్ఠంగానే ఉన్నాయని, తమ సర్వర్ల ద్వారా ఈ ఫొటోలు బయటకు పోలేదని, ఖాతాదారులు ఇచ్చిన బలహీనమైన పాస్‌వర్డ్స్ ద్వారానే ఈ నేరం జరిగిందని ఆపిల్ కంపెనీ తెలిపింది. ఇది సెక్స్ నేరం కిందకే వస్తుందని, దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని జెన్నిఫర్ లారెన్స్ బహిరంగంగా డిమాండ్ చేశారు.
ఆ నాటి అనుభవంతో ఆపిల్ 'ఐక్లౌడ్' రెండంచెల భద్రతా వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇతరులు కొంత కష్టపడితే కనిపెట్టే పాస్‌వర్డ్స్‌ను ఇవ్వకూడదని, సులభంగా గుర్తుంటుందని భావించి పుట్టినరోజు తోనో, పుట్టిన ప్రాంతంతో, ఈ మెయిల్ చిరునామాతో పాస్‌వర్డ్స్ ఇవ్వరాదని సూచించింది. పక్కవారు కూడా కనిపెట్టలేని విధంగా పాస్‌వర్డ్స్ ఉండాలని చెప్పింది.
ఎడల్ట్ డేటింగ్ వెబ్‌సైట్ 'ఆస్లీ మాడిసన్' మరో వెబ్‌సైట్ 'సోని పిక్చర్స్'ను ఇటీవల హ్యాకర్లు హ్యాక్ చేసిన నేపథ్యంలో సెక్యూరిటీ పాస్‌వర్డ్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని ఆపిల్ కంపెనీ హెచ్చరించింది. ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా విశ్వసించదగ్గవి మాత్రమే కొనుగోలు చేయాలని సూచించింది.