హాలీవుడ్ స్థాయిలో కాష్మోరా
హాలీవుడ్ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో కాష్మోరా చిత్ర విజువల్స్ భ్రమింపజేస్తాయని ఆ చిత్ర కథానాయకుడు కార్తీ పేర్కొన్నారు. ఈయన ద్విపాత్రాభినయం చేసి, మూడు విభిన్న గెటప్‌లలో కనిపించనున్న చారిత్రక, సాంఘిక సన్నివేశాలతో కూడిన బ్రహ్మాండ చిత్రం కాష్మోరా. ఇంతకుముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ అధినేతలు ఎస్ఆర్.ప్రభు, ఎస్ఆర్.ప్రకాశ్ 60 కోట్ల భారీ బడ్జెట్లో నిర్మిస్తున్న చిత్రం ఇది. నయనతార, శ్రీదివ్య నాయికలుగా నటించిన ఈ చిత్రానికి ఇంతకు ముందు రౌద్రం, ఇదర్కుదానే ఆశైపడ్డాయ్ బాలకుమారా చిత్రాలను తెరకెక్కించిన గోకుల్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం కాష్మోరా.
కార్తీకి తండ్రిగా ప్రముఖ హాస్యనటుడు వివేక్ నటించిన ఈ చిత్రం దీపావళి పండగ సందర్భంగా 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 1000కి పైగా థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్ర తమిళనాడు విడుదల హక్కుల్ని శ్రీతేనాండాళ్ ఫిలింస్ పొందడం విశేషం. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రం నగరంలోని ఓ నక్షత్ర హోటల్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు కార్తీ మాట్లాడుతూ ఇందులో తాను పోషించిన కాష్మోరా, రాజ్‌నాయక్ పాత్రల గెటప్‌లు అదుర్స్ అనిపిస్తాయన్నారు. ఈ గెటప్‌ల కోసం రోజూ ఐదు గంటల సమయం పట్టేదన్నారు.
జియోటెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో హాలీవుడ్ చిత్రాల స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తెరకెక్కించిన చిత్రం కాష్మోరా అన్నారు. చిత్రంలో చారిత్రక సన్నివేశాలు అరగంట పాలే చోటు చేసుకున్నా బాహుబలి చిత్రం స్థాయిలో శ్రమించి ఆ సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిపారు. అదే విధంగా చిత్రంలో గంటన్నర పాటు గ్రాఫిక్స్ సన్నివేశాలు చోటు చేసుకుంటాయని చెప్పారు. రెండేళ్ల పాటు చిత్ర యూనిట్ రాత్రింబవళ్లు శ్రమించి రూపొందించిన చిత్రం కాష్మోరా అని కార్తీ తెలిపారు.