Hollywood Pop Star
-
రెహమాన్‌తో పాడాలనుంది
సెలీనా గోమేజ్... హాలీవుడ్ పాప్ సింగర్. పాతికేళ్లకే పాప్ సంగీతంలో బాగా పాపులర్ అయ్యారు. అయితే ఈ భామకు ఇండియన్ మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ అట. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ సంగీతంలో ఓ పాట పాడాలనుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇండియన్ మ్యూజిక్ మీద తన ఇంట్రెస్ట్ గురించి సెలీనా మాట్లాడుతూ – ‘‘నేను ఇండియన్ మ్యూజిక్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటాను. వండర్ఫుల్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అభిమానిస్తుంటాను. ఈ రోజు ఆయన కేవలం ఇండియన్ మ్యుజిషియన్ మాత్రమే కాదు. గ్లోబల్ ఫిగర్. ఆయన కంపోజిషన్‌లో పాడాలని లేదా ఆయనతో కలసి వర్క్ చేయాలని ఉంది. ఓ బాలీవుడ్ సాంగ్ పాడితే కూడా బావుంటుందని అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు సెలీనా. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’తో ఇండియాకు ఆస్కార్ తీసుకొచ్చిన రెహమాన్ హాలీవుడ్ సింగర్స్‌తో కలసి వర్క్ చేయడం కొత్తేమీ కాదు. ఇగ్గీ అజేలా, కేటీ టన్స్టిల్ వంటి వారితో ఆల్రెడీ పని చేశారు. చూద్దాం మరి.. సెలీనా ఆకాంక్ష తీరుతుందో? లేదో. -
వాళ్లతో ఇక నో డేటింగ్
కొత్త సంవత్సరం సందర్భంగా కొంతమంది కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. హాలీవుడ్ పాప్ స్టార్ రిహన్నా కూడా ఓ నిర్ణయం తీసుకుంది. క్రిస్ బ్రౌన్, డ్రేక్ లాంటి వ్యక్తులతో డేటింగ్ చేయకూడదన్నదే ఆ నిర్ణయం. ర్యాప్ సంగీత గాయకులుగా, నటులుగా క్రిస్, డ్రేక్లకు మంచి పేరుంది. ఓ ఏడాది పాటు క్రిస్తో వ్యవహారం నడిపిన రిహన్నా ఆ తర్వాత అతడి నుంచి విడిపోయింది. అనంతరం డ్రేక్‌తో ప్రేమలో పడిందామె. కొన్నాళ్లు బాగానే ఉన్నా క్రిస్ లాగానే డ్రేక్ కూడా తమ ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లడానికి ఇష్టపడకపోవడంతో అతడి నుంచి కూడా రిహన్నా విడిపోయింది. అయితే, విడిపోయే ముందు బోల్డన్ని గొడవలు జరిగాయట. క్రిస్ అయితే రిహన్నా మీద చెయ్యి చేసుకున్నాడనే విషయం హాలీవుడ్లో మార్మోగిపోయింది. డ్రేక్ కూడా తక్కువేం తినలేదు. ఇతగాడు కూడా రిహన్నాను హింసించాడట. ఈ చేదు అనుభవాలతో ఇక పాప్ స్టార్స్‌తో డేటింగ్ చేయకూడదని రిహన్నా ఫిక్సయ్యింది.