Holy Scripture
-
‘పవిత్ర గ్రంథాలను ఇలా వాడతారా?
పంజాబ్, ఫిరోజ్‌పూర్ : పవిత్ర గ్రంథాన్ని అనుచిత పనుల కోసం వాడి.. దాన్ని అపవిత్రం చేశారనే నేపంతో గురుద్వారా పూజారిని, అతని భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. వివారాల ప్రకారం.. ఫిరోజ్‌పూర్ గురుద్వారాలో పూజారిగా పని చేస్తోన్న ఓ వ్యక్తి భార్య పవిత్ర గ్రంథంలోని పేజీలను చింపి.. వాటిలో చపాతీలను చుట్టి పిల్లలకు ఇచ్చి పాఠశాలకు పంపింది. ఇది గమనించిన మిగతా విద్యార్ధులు ఈ విషయాన్ని తొలుత సిక్కు స్టూడెంట్స్ ఫెడరేషన్‌కి తెలియజేశారు. దాంతో వారు సదరు పూజారి ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా వారి వంట గదిలో మరికొన్ని పదార్ధాలను కూడా పవిత్ర గ్రంథంలోని పేపర్లలో చుట్టి పెట్టారు. ఈ విషయం గురించి యూనియన్ అధ్యక్షుడు ‘మేము పవిత్ర గ్రంథాన్నే మా దైవంగా పూజిస్తాం. అలాంటిది ఆ గ్రంథాన్ని చింపడమే కాక ఆ పేజీలను ఇలాంటి పనుల కోసం వినియోగించడం దారుణ. నిజంగా ఇది చాలా అపవిత్రమైన పని. భవిష్యత్తులో మరోకరు ఇలాంటి పనికి పాల్పడకూడదనే ఉద్దేశంతో సదరు పూజారి, అతని భార్య మీద పోలీసులకు ఫిర్యాదు చేశామ’ని తెలిపాడు. ప్రస్తుతం పోలీసులు సదరు పూజారిని, అతని భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ఆందోళన అక్కర్లేదు
మైనారిటీల హక్కులపై టైమ్ మేగజీన్‌తో మోదీ ఉద్ఘాటన బీజేపీకి, ప్రభుత్వానికి పవిత్ర గ్రంథం రాజ్యాంగమేనని వ్యాఖ్య న్యూఢిల్లీ: కులం, మతం, జాతి ప్రాతిపదికగా ఎటువంటి వివక్షనూ తన ప్రభుత్వం అంగీకరించబోదని.. మైనారిటీల హక్కుల విషయంలో ఊహాజనిత ఆందోళనలకు స్థానం లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. పలువురు బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పైనా మోదీ తీవ్రంగా స్పందించారు. ఏదైనా మైనారిటీ మతానికి సంబంధించి వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తంచేసిన వెంటనే తాము ఖండించామని పేర్కొన్నారు. ఆయన గురువారం టైమ్ మేగజీన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా.. ముస్లిం, క్రైస్తవ, ఇతర మైనారిటీలలో ఆందోళనలు రేకెత్తించిన పలువురు బీజేపీ నేతల వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా.. మోదీ పై విధంగా స్పందించారు. ‘‘బీజేపీకి, నా ప్రభుత్వానికి సంబంధించినంతవరకూ.. మేము అనుసరించే పవిత్ర గ్రంథం ఒక్కటే.. అది భారత రాజ్యాంగం’’ అని అన్నారు. మా రక్తంలో ఉంది.. భారత్ విజయవంతం కావాలంటే.. ఆ దేశం మత ప్రాతిపదిక మీద చీలిపోకూడదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యల గురించి అడగగా మోదీ స్పందిస్తూ.. ‘‘భారతదేశ చరిత్రను విశ్లేషించినట్లయితే ఈ దేశం మరొక దేశంపై దాడి చేసిన ఒక్క ఘటన కూడా కనిపించదు. అలాగే.. ఈ దేశం జాతీయత లేదా మతం ప్రాతిపదికగా యుద్ధం చేసిందనే సూచనలు కూడా మా చరిత్రలో కనిపించవు. కాబట్టి.. మాకు.. అన్ని మతాలనూ అంగీకరించటం మా రక్తంలోనే ఉంది. మా నాగరికతలో ఉంది.’’ అని చెప్పారు. హిందుత్వం విస్తార వైవిధ్యమున్న మతం హిందుత్వంపై మీ విశ్వాసం ఏమిటి అన్న ప్రశ్నకు.. సుప్రీంకోర్టు ఒక చక్కని నిర్వచనం ఇచ్చిందంటూ మోదీ ఉదహరించారు. ‘‘హిందుత్వం ఒక మతం కాదని.. అది వాస్తవానికి ఒక జీవన విధానమని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. హిందుత్వం ఎంతో లోతైన, విస్తారమైన వైవిధ్యమున్న మతం.’’ అని పేర్కొన్నారు. భారత్‌పై ప్రపంచం ఉత్సాహంగా ఉంది భారత్‌లో సంస్కరణల వేగంపై విదేశీ పెట్టుబడిదారులు లేవనెత్తుతున్న ప్రశ్నల గురించి అడగగా.. ‘‘నేను గత ఏడాది మే నెలలో అధికారంలోకి వచ్చినప్పుడు పూర్తిగా పాలనా పక్షవాతం ఉన్నట్లు కనిపించింది. వ్యవస్థ అంతటా అవినీతి వ్యాపించింది. నాయకత్వం లేదు. కేంద్రంలో అప్పటి వరకూ ఉన్నది బలహీన ప్రభుత్వం. కాబట్టి.. గత ప్రభుత్వ పదేళ్ల కాలాన్ని, నా ప్రభుత్వ పది నెలల కాలాన్ని చూడాల్సి ఉంటుంది. అంతర్జాతీయ సమాజం భారత్ విషయంలో చాలా ఉత్సాహంగా ఉంది. మీరు దానిని వాస్తవంగా చూస్తారు.’’ అని మోదీ వివరించారు. -
జాతీయ పవిత్ర గ్రంథంగా గీత!
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల దుమారం సద్దుమణగక ముందే మరో కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ మరో వివాదం రాజేశారు. హిందువుల పవిత్ర మతగ్రంథమైన భగవద్గీతను ప్రభుత్వం జాతీయ పవిత్ర గ్రంథంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ‘అమెరికా అధ్యక్షుడు ఒబామాకు ప్రధాని మోదీ గీతను కానుకగా ఇవ్వడంతో దానికి ఇప్పటికే జాతీయ పవిత్రగ్రంథం హోదా దక్కింది. ఇక ఆ హోదాను అధికారికంగా ప్రకటించడమే మిగిలింది’ అని అన్నారు. భగవద్గీతకు 5,151 ఏళ్లయిన సందర్భంగా ఆదివారం ఢిల్లీలోని ఎర్రకోట మైదానంలో నిర్వహించిన గీతా ప్రేరణ మహోత్సవ్‌లో సుష్మ మాట్లాడారు. దైనందిన జీవితంలో ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు గీతలో జవాబులు ఉన్నాయన్నారు. నిష్కామ కర్మను బోధించే ఆ గ్రంథం మంత్రిగా తన విధి నిర్వహణకు మార్గనిర్దేశం చేస్తోందన్నారు. అందుకే పార్లమెంటులో తాను గీతను జాతీయ పవిత్ర గ్రంథంగా ప్రకటించాలని కోరానన్నారు. అంతకుముందు విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అధ్యక్షుడు అశోక్ సింఘాల్ మాట్లాడుతూ ప్రధాని మోదీ గీతను తక్షణమే జాతీయ పవిత్ర గ్రంథంగా ప్రకటించాలన్నారు. హరియాణా సీఎం ఖట్టర్ మాట్లాడుతూ.. భగవద్గీతపై పోస్టల్ స్టాంపు తీసుకురావాలని సూచించారు. సుష్మ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ మండిపడ్డాయి. భారత్ వంటి లౌకిక దేశంలో రాజ్యాంగం ఒక్కటే పవిత్ర గ్రంథమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పారు. గీతా సారాంశాన్ని ఒంటబట్టించుకున్న వారెవరూ ఇటువంటి పసలేని ప్రకటనలు చేయరని కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ విమర్శించారు.