జాతీయ పవిత్ర గ్రంథంగా గీత! | Declare Bhagwad gita as national holy book: Sushma swaraj | Sakshi
Sakshi News home page

జాతీయ పవిత్ర గ్రంథంగా గీత!

Published Mon, Dec 8 2014 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 5:47 PM

జాతీయ పవిత్ర గ్రంథంగా గీత!

జాతీయ పవిత్ర గ్రంథంగా గీత!

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల దుమారం సద్దుమణగక ముందే మరో కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ మరో వివాదం రాజేశారు. హిందువుల పవిత్ర మతగ్రంథమైన భగవద్గీతను ప్రభుత్వం జాతీయ పవిత్ర గ్రంథంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

‘అమెరికా అధ్యక్షుడు ఒబామాకు ప్రధాని మోదీ గీతను కానుకగా ఇవ్వడంతో దానికి ఇప్పటికే జాతీయ పవిత్రగ్రంథం హోదా దక్కింది. ఇక ఆ హోదాను అధికారికంగా ప్రకటించడమే మిగిలింది’ అని అన్నారు. భగవద్గీతకు 5,151 ఏళ్లయిన సందర్భంగా ఆదివారం ఢిల్లీలోని ఎర్రకోట మైదానంలో నిర్వహించిన గీతా ప్రేరణ మహోత్సవ్‌లో సుష్మ మాట్లాడారు. దైనందిన జీవితంలో ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు గీతలో జవాబులు ఉన్నాయన్నారు.

నిష్కామ కర్మను బోధించే ఆ గ్రంథం మంత్రిగా తన విధి నిర్వహణకు మార్గనిర్దేశం చేస్తోందన్నారు. అందుకే పార్లమెంటులో తాను గీతను జాతీయ పవిత్ర గ్రంథంగా ప్రకటించాలని కోరానన్నారు. అంతకుముందు విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అధ్యక్షుడు అశోక్ సింఘాల్ మాట్లాడుతూ ప్రధాని మోదీ గీతను తక్షణమే జాతీయ పవిత్ర గ్రంథంగా ప్రకటించాలన్నారు.

హరియాణా సీఎం ఖట్టర్ మాట్లాడుతూ.. భగవద్గీతపై పోస్టల్ స్టాంపు తీసుకురావాలని సూచించారు. సుష్మ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ మండిపడ్డాయి. భారత్ వంటి లౌకిక దేశంలో రాజ్యాంగం ఒక్కటే పవిత్ర గ్రంథమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పారు. గీతా సారాంశాన్ని ఒంటబట్టించుకున్న వారెవరూ ఇటువంటి పసలేని ప్రకటనలు చేయరని కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement