The Bhagavad Gita
-
జాతీయ పవిత్ర గ్రంథంగా గీత!
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల దుమారం సద్దుమణగక ముందే మరో కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ మరో వివాదం రాజేశారు. హిందువుల పవిత్ర మతగ్రంథమైన భగవద్గీతను ప్రభుత్వం జాతీయ పవిత్ర గ్రంథంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ‘అమెరికా అధ్యక్షుడు ఒబామాకు ప్రధాని మోదీ గీతను కానుకగా ఇవ్వడంతో దానికి ఇప్పటికే జాతీయ పవిత్రగ్రంథం హోదా దక్కింది. ఇక ఆ హోదాను అధికారికంగా ప్రకటించడమే మిగిలింది’ అని అన్నారు. భగవద్గీతకు 5,151 ఏళ్లయిన సందర్భంగా ఆదివారం ఢిల్లీలోని ఎర్రకోట మైదానంలో నిర్వహించిన గీతా ప్రేరణ మహోత్సవ్‌లో సుష్మ మాట్లాడారు. దైనందిన జీవితంలో ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు గీతలో జవాబులు ఉన్నాయన్నారు. నిష్కామ కర్మను బోధించే ఆ గ్రంథం మంత్రిగా తన విధి నిర్వహణకు మార్గనిర్దేశం చేస్తోందన్నారు. అందుకే పార్లమెంటులో తాను గీతను జాతీయ పవిత్ర గ్రంథంగా ప్రకటించాలని కోరానన్నారు. అంతకుముందు విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అధ్యక్షుడు అశోక్ సింఘాల్ మాట్లాడుతూ ప్రధాని మోదీ గీతను తక్షణమే జాతీయ పవిత్ర గ్రంథంగా ప్రకటించాలన్నారు. హరియాణా సీఎం ఖట్టర్ మాట్లాడుతూ.. భగవద్గీతపై పోస్టల్ స్టాంపు తీసుకురావాలని సూచించారు. సుష్మ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ మండిపడ్డాయి. భారత్ వంటి లౌకిక దేశంలో రాజ్యాంగం ఒక్కటే పవిత్ర గ్రంథమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పారు. గీతా సారాంశాన్ని ఒంటబట్టించుకున్న వారెవరూ ఇటువంటి పసలేని ప్రకటనలు చేయరని కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ విమర్శించారు. -
ఆద్యాత్మిక ‘గీత’
హిందువుల పరమపవిత్ర గ్రంథం భగవద్గీత. యుగాల క్రితం కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించిన జ్ఞానం ఇది. పురాణాలలో ఇది పవిత్ర భూమిగానూ ధర్మక్షేత్రంగానూ పిలువబడుతూ వచ్చింది. నేటి హర్యానా రాష్ట్రంలో గల కురుక్షేత్ర ఒక జిల్లా. వేద, వేదాంత, యోగ విశేషాలున్న భగవద్గీత పుట్టిన రోజున పురస్కరించుకొని వారం రోజులు పాటు కురుక్షేత్రలో ప్రతి ఏటా ఉత్సవాలు జరుపుతుంటారు. ఆ విధంగా ఈ ఏడాది డిసెంబర్ 2 నుంచి గీతా జయంతి వేడుకలు కురుక్షేత్రలో జరగనున్నాయి. ఈ క్షేత్రంలో జరిగే భగవద్గీత ఉత్సవాలలో పాల్గొనడానికి ప్రపం చం నలుమూలల నుంచి హిందూ ధార్మిక, ఆధ్యాత్మిక వేత్తలు ఇక్కడకు చేరుకుంటారు. వీరి ప్రవచనాలు వినడానికి ఎక్కడెక్కడి వాళ్లో ఇక్కడకు వస్తారు. ఇక్కడ పవిత్ర సరస్సులుగా పేర్కొనే సన్నిహిత్ సరోవర్, బ్రహ్మసరోవర్లలో స్నానమాచరిస్తారు. వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాలతో ఇక్కడ వాతావరణమంతా ఆధ్యాత్మికతతో నిండిపోతుంది. ఈ ఉత్సవాలలో ప్రధాన ఆకర్షణగా.. శ్లోక పఠనాలు, నృత్యాలు, భగవద్గీత కథలు, భజనలు, నాటక ప్రదర్శనలు, పుస్తకశాలలు.. ఉంటాయి. ఈ కార్యక్రమాలన్నీ కురుక్షేత్ర అభివృద్ధి సంస్థ, హర్యానా రాష్ట్రప్రభుత్వం, జిల్లా అధికార విభాగం, హర్యానా ప్రజా సంబంధాల శాఖ.. నిర్వహిస్తున్నాయి. కురుక్షేత్రంలో చూడదగినవి: కృష్ణా మ్యూజియం, విష్ణు మందిరం, జలకుండం, బ్రహ్మ సరోవరం, గీతా భవన్... రవాణా: కురుక్షేత్ర 7వ నెంబర్ జాతీయరహదారితో అనుసంధానమై ఉంటుంది. దీంతో కురుక్షేత్రకు రోడ్డు, రైలు మార్గాలు బాగున్నాయి. ఢిల్లీ వెళ్లే రైళ్లన్నీ కురుక్షేత్ర మీదుగా వెళతాయి. చంఢీగడ్, ఢిల్లీలను కలుపుతూ కురుక్షే త్ర మీదుగా బస్సులు ప్రయాణిస్తుంటాయి. సమీప విమానమార్గం: చండీగఢ్ (82 కి.మీ -
భగవద్గీత అంధకారంలో వెలుగురేఖ
ఎవరైనా సరే, తాము అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరిగితే అదృష్టమనీ, అన్నింటిలోనూ అపజయాలు ఎదురవుతుంటే తలరాత బాగోలేదని అనుకుంటూ ఉంటారు. ఇది మానవ నైజం. అయితే మన తలరాత ఎక్కడో లేదు, ‘గీత’లోనే ఉంది. అదే భగవద్గీత. అది తెలుసుకుంటే ఎవరూ ఏ ఆందోళనకూ గురికావలసిన అవసరం ఉండదు. గీత అంధకారంలో ఉన్నప్పుడు ఒక వెలుగురేఖ కోసం వెతుకుతాం. దుఃఖసాగరంలో మునిగి ఉన్నప్పుడు ఒడ్డుకు చేర్చగల ఒక అమృతహస్తం కోసం ఎదురుచూస్తాం. సరిగ్గా అలాంటి సమయంలోనే భగవద్గీత అవసరం అవుతుంది. గీతలో.. నిత్యజీవితంలో మానవుడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తాయి. ఎవరైతే సంసార సాగరాన్ని దాటాలనుకుంటున్నారో, అటువంటివారు గీత అనే ఈ నావనెక్కి సుఖంగా, సులువుగా ఆవలి ఒడ్డుకు చేరుకోవచ్చు. గీతాశ్రవణ పఠనలు జరిగేచోట నేను సర్వదా వసింపగలను అని శ్రీమహావిష్ణువు అర్జునునితో చెప్తున్న దానిని బట్టి గీతను చదివేచోట, వినేచోట భగవంతుని సహాయం శీఘ్రంగా లభిస్తుంది. ఒక్కమాటలో... భగవద్గీత... మనందరికీ బతుకుబాట. ఉపనిషత్తుల సారాంశం: సకల జ్ఞానస్వరూపాలైన ఉపనిషత్తులను గోవులుగానూ, అర్జునుణ్ణి దూడగానూ చేసి శ్రీకృష్ణుడు పితికిన ఆవుపాల సారమే భగవద్గీత. ఉపనిషత్తులంటే సర్వకాల సర్వజనులకు వర్తించేవి అని అర్థం. మనిషికి కలిగే ఎటువంటి సందేహానికైనా వాటిలో సమాధానం లభిస్తుంది. శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధసమయంలో పార్థుడికి కలిగిన రకరకాల సందేహాలను తీర్చేందుకు బోధించిన గీత సాక్షాత్తూ భగవంతుని ముఖతః వెలువడింది కాబట్టి భగవద్గీత అయింది. గీతకు 18 అధ్యాయాలున్నట్లే 18 పేర్లున్నాయి. అవి 1. గీత 2. గంగ 3. గాయత్రి 4. సీత 5. సత్య 6. సరస్వతి 7. బ్రహ్మవిద్య 8. బ్రహ్మవల్లి 9. త్రిసంధ్య 10. ముక్తిగేహిని 11. అర్థమాత్ర 12. చిదానంద 13. భవఘ్ని 14. భయనాశిని 15. వేదత్రయి 16. పర 17. అనంత 18. తత్త్వార్థ జ్ఞానమంజరి. త్యాగం... తత్వజ్ఞానం: గీ అంటే త్యాగం, త అంటే తత్వజ్ఞానం. అంటే త్యాగాన్ని, తత్వజ్ఞానాన్ని బోధించేదే గీత. వ్యాసుని అనుగ్రహం వల్ల గీతాబోధను సంజయుడు ప్రత్యక్షంగా వినగలిగాడు. విన్నది విన్నట్లుగా లోకానికి అందించాడు. ఆ తర్వాతి కాలంలో తమకు నిత్యజీవితంలో ఎదురవుతున్న రకరకాల సందేహాలకు, భయాందోళనలకు గీతను మథనం చేసి, స్థిమిత పడినవారిలో గాంధీ మహాత్ముడు, నెహ్రూ, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్... ఇలా ఒకరేమిటి... కార్పొరేట్ సంస్కృతి ప్రకారం సూటూ బూటూ ధరించి వ్యక్తిత్వ వికాస పాఠాలను బోధిస్తున్న ఆధునిక శిక్షకులు కూడా ఉన్నారు. జీవన పోరాటం: ఆధునిక జీవితంలో యుద్ధాలు లేకపోవచ్చు కాని జీవనయానం కోసం వేసే ప్రతి అడుగూ ఒక యుద్ధభేరి వంటిదే. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో అర్జునుడిలా, శ్రీకృష్ణునిలా అవతారం ధరించవలసిందే. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, ఆనందం కలిగినప్పుడు పొంగిపోకుండా శాంతంగా, స్థిమితంగా ఆలోచించడం ఎలాగో వివరించిన గ్రంథం ఇదొకటే! కాబట్టి గీతను మించిన జీవన విధానం, వ్యక్తిత్వ వికాసమూ మరొకటి లేదని చెప్పాలి. మనలోని కోరికలను, బాధలను నశింప చేయడానికి, సాటి మనిషి దుఃఖాన్ని తొలగింపజేయడానికి గీతలోని ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క ఆయుధంగానూ, ఔషధ గుళికగానూ వాడుకోవచ్చు. కనుక భగవత్ప్రసాదమైన ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలంటే భగవద్గీతను పఠించాలి లేదా వినాలి. అంత తీరిక, అంత ఓపిక లేనివారు కనీసం ఘంటసాల గీతాలాపనో, గీతాయజ్ఞాన్ని అకుంఠిత దీక్షతో నిర్వహిస్తున్న గంగాధర శాస్త్రి వంటివారి ఆధునికుల ప్రబోధాన్నో చెవిన వేసుకున్నా చాలు. యోగ, భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో కూర్చిన గీతను జీవితమంతా అభ్యసించినప్పటికీ అంతం ఉండదు. చదివిన ప్రతిసారీ కొత్త అర్థాలు పుట్టుకొస్తుంటాయి. అనేకమైన లౌకిక, అలౌకిక ఆన ందాలు, ప్రయోజనాలు కలుగుతాయి. నిత్యం ఇంద్రియాల ద్వారా తెలిసీ తెలియక చేసే పాపాలన్నీ గీతాపఠనం వల్ల నశించిపోతాయని గీతా మాహాత్మ్యం తెలుపుతోంది. గీతామకరందాన్ని సేవించడమేకాదు, అందులోని మంచిని ఆచరిద్దాం. కష్టాల కడలినుంచి సుఖాల తీరానికి చేరుదాం. ఈ గీతాజయంతి నాడైనా కొన్ని శ్లోకాలు నేర్చుకుందాం... - డి.వి.ఆర్ భాస్కర్ యుద్ధం ఓ సదవకాశం! ఈతరం యువత ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకి మూల కారణం మనో దౌర్బల్యమే! దాన్ని విడిచిపెడితే విజయమే. దీనిని గుర్తు చేస్తూ... ‘క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప’... అన్నాడు భగవానుడు. అంటే ‘మనో దౌర్బల్యం నీచం. దాన్ని విడిచిపెట్టు. అప్పుడే నువ్వు శత్రువులపై విజయం సాధించగలవు’ అంటూ పార్థుడికి ప్రబోధిస్తాడు. పోరాటానికి అవసరమైన అన్ని ఆయుధాలూ ఉన్నా, కొందరు అసలు ఏమి జరుగుతుందో ఏమో అనే భయంతో కదన రంగంలోకి కాలు పెట్టడానికి కూడా సంకోచిస్తారు కొందరు. అటువంటి వారికి కర్తవ్యాన్ని ప్రబోధిస్తూ... ‘యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం’... యుద్ధం ఓ సదవకాశం అంటాడు భగవానుడు. ఎందుకంటే యుద్ధం జరిగితేనే కదా ఎవరి బలాబలాలు ఏంటో బయటపడేది! యువతకి ఇంతకంటే స్ఫూర్తి ఇంకేం కావాలి! ‘యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే’... ఫలం దక్కినా దక్కకపోయినా కర్మలను సమదృష్టితో ఆచరించాలి. దీన్నే యోగం అని పరమాత్ముడు చెబుతాడు. ప్రయత్నం ఏదైనా ఫలితం ఆశించకూడదని ప్రబోధిస్తాడు. అంటే ప్రయత్నంలో వైఫల్యం ఉండకూడదు. -
గోపాలా.. గోపాలా..?
శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. విశ్వంలో సంభవించే ప్రతి విలయానికీ, ప్రతి అద్భుతానికీ దేవుడే కారణభూతుడు. సృష్టించేది దైవమే, నశింపజేసేదీ దైవమే. భగవద్గీత, ఖురాన్, బైబిల్... ఇలా ఏ పవిత్ర గ్రంథమైనా చెప్పేది ఇదే. మరి అలాంటప్పుడు మనిషి బాధలకు బాధ్యుడు దైవం కాక ఇంకెవరు? అని ప్రశ్నిస్తాడో సామాన్యుడు. ప్రకృతి విలయాన్ని సృష్టించి తన జీవనోపాధిపై దెబ్బకొట్టిన దైవంపై కోర్టుకెక్కాడు. దైవమో, లేక ఆయన అనుచరులుగా చెప్పుకుంటున్న మతగురువులో ఎవరో ఒకరు తనకు నష్టపరిహారం చెల్లించాలని న్యాయదేవత ముందు గగ్గోలు పెడతాడు. మరి అభియోగం మోపబడ్డ దైవం ఏం చేసింది? ఆ వ్యక్తికి న్యాయస్థానంలో న్యాయం జరిగిందా? ఆసక్తికరమైన ఈ కథాంశంతో బాలీవుడ్లో తెరకెక్కిన చిత్రం ‘ఓ మైగాడ్’. దేవునిపై కోర్టుకెక్కిన సామాన్యుడి పాత్రలో పరేశ్‌రావల్ జీవిస్తే, దైవంగా అక్షయ్‌కుమార్ అదరహో అనిపించేశారు. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ తెరపై వచ్చిన అమోఘమైన ప్రయోగం ‘ఓ మైగాడ్’. ఈ కథను తెలుగీకరించాలనే ఆలోచన రావడమే పెద్ద సాహసం. ఈ విషయంలో నిర్మాతలు డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్‌ను అభినందించాల్సిందే. ఇందులో పరేశ్‌రావెల్ పాత్రను వెంకటేశ్, అక్షయ్‌కుమార్ పోషించిన శ్రీకృష్ణుడి పాత్రను పవన్‌కల్యాణ్ పోషించనున్న విషయం తెలిసిందే. సవాల్‌గా తీసుకొని వీరిద్దరూ ఈ పాత్రల్ని పోషించనున్నట్లు తెలిసింది. కొంచెం ఇష్టం-కొంచెం కష్టం, తడాఖా చిత్రాల దర్శకుడు డాలీ ఈ చిత్రానికి దర్శకుడు. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ విషయంలో ఇప్పటివరకూ పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కొందరు ‘దేవ దేవం భజే’ అంటుంటే, ఇంకొందరూ ‘గో గో గో గోవిందా’ అనే పేరును ఖరారు చేసినట్లు చెప్పుకుంటున్నారు. అయితే... ‘సాక్షి’కి తెలిసిన విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఈ చిత్రానికి ‘గోపాలా గోపాలా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారని వినికిడి. కథలోని ఆత్మ దెబ్బ తినకుండా ఇప్పటికే కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసినట్లు తెలిసింది. స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి కావస్తున్న ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన కథానాయికగా శ్రీయను తీసుకున్నారు. మాతృకలో చేసిన పాత్రనే ఇందులో మిథున్ చక్రవర్తి పోషించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌కి వెళ్లనుంది.