గోపాలా.. గోపాలా..?
శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. విశ్వంలో సంభవించే ప్రతి విలయానికీ, ప్రతి అద్భుతానికీ దేవుడే కారణభూతుడు. సృష్టించేది దైవమే, నశింపజేసేదీ దైవమే. భగవద్గీత, ఖురాన్, బైబిల్... ఇలా ఏ పవిత్ర గ్రంథమైనా చెప్పేది ఇదే. మరి అలాంటప్పుడు మనిషి బాధలకు బాధ్యుడు దైవం కాక ఇంకెవరు? అని ప్రశ్నిస్తాడో సామాన్యుడు. ప్రకృతి విలయాన్ని సృష్టించి తన జీవనోపాధిపై దెబ్బకొట్టిన దైవంపై కోర్టుకెక్కాడు. దైవమో, లేక ఆయన అనుచరులుగా చెప్పుకుంటున్న మతగురువులో ఎవరో ఒకరు తనకు నష్టపరిహారం చెల్లించాలని న్యాయదేవత ముందు గగ్గోలు పెడతాడు.
మరి అభియోగం మోపబడ్డ దైవం ఏం చేసింది? ఆ వ్యక్తికి న్యాయస్థానంలో న్యాయం జరిగిందా? ఆసక్తికరమైన ఈ కథాంశంతో బాలీవుడ్‌లో తెరకెక్కిన చిత్రం ‘ఓ మైగాడ్’. దేవునిపై కోర్టుకెక్కిన సామాన్యుడి పాత్రలో పరేశ్‌రావల్ జీవిస్తే, దైవంగా అక్షయ్‌కుమార్ అదరహో అనిపించేశారు. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ తెరపై వచ్చిన అమోఘమైన ప్రయోగం ‘ఓ మైగాడ్’. ఈ కథను తెలుగీకరించాలనే ఆలోచన రావడమే పెద్ద సాహసం. ఈ విషయంలో నిర్మాతలు డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్‌ను అభినందించాల్సిందే. ఇందులో పరేశ్‌రావెల్ పాత్రను వెంకటేశ్, అక్షయ్‌కుమార్ పోషించిన శ్రీకృష్ణుడి పాత్రను పవన్‌కల్యాణ్ పోషించనున్న విషయం తెలిసిందే.
సవాల్‌గా తీసుకొని వీరిద్దరూ ఈ పాత్రల్ని పోషించనున్నట్లు తెలిసింది. కొంచెం ఇష్టం-కొంచెం కష్టం, తడాఖా చిత్రాల దర్శకుడు డాలీ ఈ చిత్రానికి దర్శకుడు. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ విషయంలో ఇప్పటివరకూ పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కొందరు ‘దేవ దేవం భజే’ అంటుంటే, ఇంకొందరూ ‘గో గో గో గోవిందా’ అనే పేరును ఖరారు చేసినట్లు చెప్పుకుంటున్నారు. అయితే... ‘సాక్షి’కి తెలిసిన విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఈ చిత్రానికి ‘గోపాలా గోపాలా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారని వినికిడి.
కథలోని ఆత్మ దెబ్బ తినకుండా ఇప్పటికే కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసినట్లు తెలిసింది. స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి కావస్తున్న ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన కథానాయికగా శ్రీయను తీసుకున్నారు. మాతృకలో చేసిన పాత్రనే ఇందులో మిథున్ చక్రవర్తి పోషించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌కి వెళ్లనుంది.