భగవద్గీత అంధకారంలో వెలుగురేఖ | In the darkness, the light curve of the Bhagavad Gita | Sakshi
Sakshi News home page

భగవద్గీత అంధకారంలో వెలుగురేఖ

Published Thu, Nov 27 2014 11:16 PM | Last Updated on Sat, Sep 2 2017 5:14 PM

భగవద్గీత  అంధకారంలో వెలుగురేఖ

భగవద్గీత అంధకారంలో వెలుగురేఖ

ఎవరైనా సరే, తాము అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరిగితే అదృష్టమనీ, అన్నింటిలోనూ అపజయాలు ఎదురవుతుంటే తలరాత బాగోలేదని అనుకుంటూ ఉంటారు. ఇది మానవ నైజం. అయితే మన తలరాత ఎక్కడో లేదు, ‘గీత’లోనే ఉంది. అదే భగవద్గీత. అది తెలుసుకుంటే ఎవరూ ఏ ఆందోళనకూ గురికావలసిన అవసరం ఉండదు.

గీత అంధకారంలో ఉన్నప్పుడు ఒక వెలుగురేఖ కోసం వెతుకుతాం. దుఃఖసాగరంలో మునిగి ఉన్నప్పుడు ఒడ్డుకు చేర్చగల ఒక అమృతహస్తం కోసం ఎదురుచూస్తాం. సరిగ్గా అలాంటి సమయంలోనే భగవద్గీత అవసరం అవుతుంది. గీతలో.. నిత్యజీవితంలో మానవుడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తాయి. ఎవరైతే సంసార సాగరాన్ని దాటాలనుకుంటున్నారో, అటువంటివారు గీత అనే ఈ నావనెక్కి సుఖంగా, సులువుగా ఆవలి ఒడ్డుకు చేరుకోవచ్చు. గీతాశ్రవణ పఠనలు జరిగేచోట నేను సర్వదా వసింపగలను అని శ్రీమహావిష్ణువు అర్జునునితో చెప్తున్న దానిని బట్టి గీతను చదివేచోట, వినేచోట భగవంతుని సహాయం శీఘ్రంగా లభిస్తుంది. ఒక్కమాటలో... భగవద్గీత... మనందరికీ బతుకుబాట.

ఉపనిషత్తుల సారాంశం: సకల జ్ఞానస్వరూపాలైన ఉపనిషత్తులను గోవులుగానూ, అర్జునుణ్ణి దూడగానూ చేసి శ్రీకృష్ణుడు పితికిన ఆవుపాల సారమే భగవద్గీత. ఉపనిషత్తులంటే సర్వకాల సర్వజనులకు వర్తించేవి అని అర్థం. మనిషికి కలిగే ఎటువంటి సందేహానికైనా వాటిలో సమాధానం లభిస్తుంది. శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధసమయంలో పార్థుడికి కలిగిన రకరకాల సందేహాలను తీర్చేందుకు బోధించిన గీత సాక్షాత్తూ భగవంతుని ముఖతః వెలువడింది కాబట్టి భగవద్గీత అయింది. గీతకు 18 అధ్యాయాలున్నట్లే 18 పేర్లున్నాయి. అవి 1. గీత 2. గంగ  3. గాయత్రి 4. సీత 5. సత్య 6. సరస్వతి 7. బ్రహ్మవిద్య 8. బ్రహ్మవల్లి 9. త్రిసంధ్య  10. ముక్తిగేహిని 11. అర్థమాత్ర 12. చిదానంద 13. భవఘ్ని  14. భయనాశిని 15. వేదత్రయి 16. పర 17. అనంత 18. తత్త్వార్థ జ్ఞానమంజరి.

 త్యాగం... తత్వజ్ఞానం: గీ అంటే త్యాగం, త అంటే తత్వజ్ఞానం. అంటే త్యాగాన్ని, తత్వజ్ఞానాన్ని బోధించేదే గీత. వ్యాసుని అనుగ్రహం వల్ల గీతాబోధను సంజయుడు ప్రత్యక్షంగా వినగలిగాడు. విన్నది విన్నట్లుగా లోకానికి అందించాడు. ఆ తర్వాతి కాలంలో తమకు నిత్యజీవితంలో ఎదురవుతున్న రకరకాల సందేహాలకు, భయాందోళనలకు గీతను మథనం చేసి, స్థిమిత పడినవారిలో గాంధీ మహాత్ముడు, నెహ్రూ, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్... ఇలా ఒకరేమిటి... కార్పొరేట్ సంస్కృతి ప్రకారం సూటూ బూటూ ధరించి వ్యక్తిత్వ వికాస పాఠాలను బోధిస్తున్న ఆధునిక శిక్షకులు కూడా ఉన్నారు.

 జీవన పోరాటం: ఆధునిక జీవితంలో యుద్ధాలు లేకపోవచ్చు కాని జీవనయానం కోసం వేసే ప్రతి అడుగూ ఒక యుద్ధభేరి వంటిదే. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో అర్జునుడిలా, శ్రీకృష్ణునిలా అవతారం ధరించవలసిందే. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, ఆనందం కలిగినప్పుడు పొంగిపోకుండా శాంతంగా, స్థిమితంగా ఆలోచించడం ఎలాగో వివరించిన గ్రంథం ఇదొకటే! కాబట్టి గీతను మించిన జీవన విధానం, వ్యక్తిత్వ వికాసమూ మరొకటి లేదని చెప్పాలి.

మనలోని కోరికలను, బాధలను నశింప చేయడానికి, సాటి మనిషి దుఃఖాన్ని తొలగింపజేయడానికి గీతలోని ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క ఆయుధంగానూ, ఔషధ గుళికగానూ వాడుకోవచ్చు. కనుక భగవత్ప్రసాదమైన ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలంటే భగవద్గీతను పఠించాలి లేదా వినాలి. అంత తీరిక, అంత ఓపిక లేనివారు కనీసం ఘంటసాల గీతాలాపనో, గీతాయజ్ఞాన్ని అకుంఠిత దీక్షతో నిర్వహిస్తున్న గంగాధర శాస్త్రి వంటివారి ఆధునికుల ప్రబోధాన్నో చెవిన వేసుకున్నా చాలు.

యోగ, భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో కూర్చిన గీతను జీవితమంతా అభ్యసించినప్పటికీ అంతం ఉండదు. చదివిన ప్రతిసారీ కొత్త అర్థాలు పుట్టుకొస్తుంటాయి. అనేకమైన లౌకిక, అలౌకిక ఆన ందాలు, ప్రయోజనాలు కలుగుతాయి. నిత్యం ఇంద్రియాల ద్వారా తెలిసీ తెలియక చేసే పాపాలన్నీ గీతాపఠనం వల్ల  నశించిపోతాయని గీతా మాహాత్మ్యం తెలుపుతోంది. గీతామకరందాన్ని సేవించడమేకాదు, అందులోని మంచిని ఆచరిద్దాం. కష్టాల కడలినుంచి సుఖాల తీరానికి చేరుదాం. ఈ గీతాజయంతి నాడైనా కొన్ని శ్లోకాలు నేర్చుకుందాం...
 - డి.వి.ఆర్ భాస్కర్
 
యుద్ధం ఓ సదవకాశం!

 
ఈతరం యువత ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకి మూల కారణం మనో దౌర్బల్యమే! దాన్ని విడిచిపెడితే విజయమే. దీనిని గుర్తు చేస్తూ... ‘క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప’... అన్నాడు భగవానుడు. అంటే ‘మనో దౌర్బల్యం నీచం. దాన్ని విడిచిపెట్టు. అప్పుడే నువ్వు శత్రువులపై విజయం సాధించగలవు’ అంటూ పార్థుడికి ప్రబోధిస్తాడు. పోరాటానికి అవసరమైన అన్ని ఆయుధాలూ ఉన్నా, కొందరు అసలు ఏమి జరుగుతుందో ఏమో అనే భయంతో కదన రంగంలోకి కాలు పెట్టడానికి కూడా సంకోచిస్తారు కొందరు. అటువంటి వారికి కర్తవ్యాన్ని ప్రబోధిస్తూ... ‘యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం’... యుద్ధం ఓ సదవకాశం అంటాడు భగవానుడు. ఎందుకంటే యుద్ధం జరిగితేనే కదా ఎవరి బలాబలాలు ఏంటో బయటపడేది! యువతకి ఇంతకంటే స్ఫూర్తి ఇంకేం కావాలి!

 ‘యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే’... ఫలం దక్కినా దక్కకపోయినా కర్మలను సమదృష్టితో ఆచరించాలి. దీన్నే యోగం అని పరమాత్ముడు చెబుతాడు. ప్రయత్నం ఏదైనా ఫలితం ఆశించకూడదని ప్రబోధిస్తాడు. అంటే ప్రయత్నంలో వైఫల్యం ఉండకూడదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement