ఆందోళన అక్కర్లేదు
మైనారిటీల హక్కులపై టైమ్ మేగజీన్‌తో మోదీ ఉద్ఘాటన
బీజేపీకి, ప్రభుత్వానికి పవిత్ర గ్రంథం రాజ్యాంగమేనని వ్యాఖ్య
న్యూఢిల్లీ: కులం, మతం, జాతి ప్రాతిపదికగా ఎటువంటి వివక్షనూ తన ప్రభుత్వం అంగీకరించబోదని.. మైనారిటీల హక్కుల విషయంలో ఊహాజనిత ఆందోళనలకు స్థానం లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. పలువురు బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పైనా మోదీ తీవ్రంగా స్పందించారు. ఏదైనా మైనారిటీ మతానికి సంబంధించి వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తంచేసిన వెంటనే తాము ఖండించామని పేర్కొన్నారు. ఆయన గురువారం టైమ్ మేగజీన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా.. ముస్లిం, క్రైస్తవ, ఇతర మైనారిటీలలో ఆందోళనలు రేకెత్తించిన పలువురు బీజేపీ నేతల వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా.. మోదీ పై విధంగా స్పందించారు. ‘‘బీజేపీకి, నా ప్రభుత్వానికి సంబంధించినంతవరకూ.. మేము అనుసరించే పవిత్ర గ్రంథం ఒక్కటే.. అది భారత రాజ్యాంగం’’ అని అన్నారు.
మా రక్తంలో ఉంది..
భారత్ విజయవంతం కావాలంటే.. ఆ దేశం మత ప్రాతిపదిక మీద చీలిపోకూడదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యల గురించి అడగగా మోదీ స్పందిస్తూ.. ‘‘భారతదేశ చరిత్రను విశ్లేషించినట్లయితే ఈ దేశం మరొక దేశంపై దాడి చేసిన ఒక్క ఘటన కూడా కనిపించదు. అలాగే.. ఈ దేశం జాతీయత లేదా మతం ప్రాతిపదికగా యుద్ధం చేసిందనే సూచనలు కూడా మా చరిత్రలో కనిపించవు. కాబట్టి.. మాకు.. అన్ని మతాలనూ అంగీకరించటం మా రక్తంలోనే ఉంది. మా నాగరికతలో ఉంది.’’ అని చెప్పారు.
హిందుత్వం విస్తార వైవిధ్యమున్న మతం
హిందుత్వంపై మీ విశ్వాసం ఏమిటి అన్న ప్రశ్నకు.. సుప్రీంకోర్టు ఒక చక్కని నిర్వచనం ఇచ్చిందంటూ మోదీ ఉదహరించారు. ‘‘హిందుత్వం ఒక మతం కాదని.. అది వాస్తవానికి ఒక జీవన విధానమని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. హిందుత్వం ఎంతో లోతైన, విస్తారమైన వైవిధ్యమున్న మతం.’’ అని పేర్కొన్నారు.
భారత్‌పై ప్రపంచం ఉత్సాహంగా ఉంది
భారత్‌లో సంస్కరణల వేగంపై విదేశీ పెట్టుబడిదారులు లేవనెత్తుతున్న ప్రశ్నల గురించి అడగగా.. ‘‘నేను గత ఏడాది మే నెలలో అధికారంలోకి వచ్చినప్పుడు పూర్తిగా పాలనా పక్షవాతం ఉన్నట్లు కనిపించింది. వ్యవస్థ అంతటా అవినీతి వ్యాపించింది. నాయకత్వం లేదు. కేంద్రంలో అప్పటి వరకూ ఉన్నది బలహీన ప్రభుత్వం. కాబట్టి.. గత ప్రభుత్వ పదేళ్ల కాలాన్ని, నా ప్రభుత్వ పది నెలల కాలాన్ని చూడాల్సి ఉంటుంది. అంతర్జాతీయ సమాజం భారత్ విషయంలో చాలా ఉత్సాహంగా ఉంది. మీరు దానిని వాస్తవంగా చూస్తారు.’’ అని మోదీ వివరించారు.