Home cooking
-
మోదీకి యాదమ్మ మెనూ
‘ఇంటి వంట’ స్త్రీలకు అప్పజెప్పి ‘ఉత్సవ వంట’ మగాడు హస్తగతం చేసుకున్నాడు. నలభీములే భారీ వంటలు చేస్తారట. పెద్ద పెద్ద హోటళ్లలో చెఫ్స్ మగాళ్లే ఉండాలట. ఈ మూస అభిప్రాయాన్ని మన తెలంగాణ మహా వంటగత్తె బద్దలు కొట్టింది. ‘వింటే భారతం వినాలి తింటే గూళ్ల యాదమ్మ వంట తినాలి’ అని పేరు సంపాదించింది. అందుకే హైదరాబాద్‌కు మోదీ వస్తుంటే కాల్ యాదమ్మకు వెళ్లింది. ‘యాదమ్మగారూ ఏం వొండుతున్నారు ప్రధానికి?’ అని అడిగితే నోరూరించేలా ఆమె చెప్పిన మాటలు ఏమిటో తెలుసా? ప్రధాని మోదీ ఇష్టపడే వంటకం ఏమిటో తెలుసా? కిచిడి. ఆయన గుజరాతీ కాబట్టి ‘ఢోక్లా’ అంటే కూడా చాలా ఇష్టం. శనగపిండి, మజ్జిగ కలిపి చేసే ‘ఖాండ్వీ’ ఉంటే మరో ముద్ద ఎక్కువ తింటారు. ఈ మూడూ మామిడి పచ్చడి, శ్రీఖండ్ ఉంటే సరేసరి. అయితే ఈసారి ఆయనను సంతోషపెట్టే వంటకాలు వేరే ఉన్నాయి. అవి అచ్చు తెలంగాణ వంటకాలు. తెలుగు వంటకాలు. హైదరాబాద్ పర్యటనకు హాజరవుతున్న మోదీ ‘స్థానిక వంటకాలు తింటాను’ అని చెప్పినందున సిద్ధమవుతున్నాయి. అయితే వీటిని వండుతున్నది ఫైవ్‌స్టార్ హోటళ్ల చెఫ్‌లు కాదు. కరీంనగర్ పల్లె నుంచి ఇంతింతై ఎదిగిన గొప్ప వంటకత్తె గూళ్ల యాదమ్మ. ఆమెతో ‘సాక్షి’ మాట్లాడింది. గంగవాయిలి కూర... ఆలుగడ్డ వేపుడు ‘మోదీ గారికి ఏం వండాలో చివరి నిమిషంలో చెప్తామన్నారు. కాని తెలంగాణ రుచి తెలియాలంటే ఏం వండాలో మనసులో అనుకున్నా. ముద్దపప్పు, గంగవాయిలి కూర, పప్పు చారు, పుంటికూర, ఆలుగడ్డ వేపుడు, పచ్చి పులుసు చేద్దామనుకుంటున్నా’ అంది గూళ్ల యాదమ్మ. వీటితో పాటు సకినాలు, సర్వపిండి, అరిసెలు, భక్ష్యాలు, పాయసం, పప్పుగారెలు యాదమ్మ లిస్ట్‌లో ఉన్నాయి. ‘ఇంతకాలం 20 వేలు, 50 వేల మందికి వంట చేశాను.135 కోట్ల మందికి ప్రధాని అయిన మోదీకి చేస్తానని ఏనాడూ అనుకోలేదు. ఒక రకంగా దేశ ప్రజలందరికీ వంట చేసినట్లుగానే భావిస్తున్నా’ అంది యాదమ్మ. జీవితం చెదిరినా రుచి కుదిరింది ‘మా స్వగ్రామం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి. అత్తవారు పక్కనే కొండాపూర్. పదిహేనేళ్లకు పెళ్లయితే కొడుకు పుట్టిన మూడు నెలలకు నా భర్త చంద్రయ్య పనిలో మట్టిపెళ్లెలు కూలి మరణించాడు. బతుకు చెదిరిపోయింది. అత్తగారి ఇంట నరకం మొదలయ్యింది. నేనూ నా కొడుకు బతకాలంటే నా కాళ్ల మీద నిలబడాలనుకున్నాను. 1993లో కొండాపూర్‌లో తెల్లవారుజామున 4 గంటలకు భుజాన మూడు నెలల పసిగుడ్డును వేసుకుని బస్టాప్‌కు వచ్చి కరీంనగర్ బస్సెక్కా. కొన్నాళ్లు స్కూల్ ఆయాగా పని చేశా. ఆ తర్వాత నా గురువు వెంకన్న వద్ద పనికి కుదరడం నా జీవితాన్ని మార్చివేసింది. ఆయన రోజుకు 15 రూపాయలు కూలీ ఇచ్చేవాడు. ఆ దశ నుంచి లక్షల రూపాయల కాంట్రాక్టుతో వేల మందికి భోజనం పెట్టే స్థాయికి ఎదిగాను’ అంది యాదమ్మ. నిజానికి భారీ వంటలంటే మగవారే సమర్థంగా చేయగలరు అనే స్థిర అభిప్రాయం ఉంది. కాని యాదమ్మ వేల మందికి అలవోకగా వండుతూ పెద్ద పెద్ద వంట మాస్టర్లను చకితులను చేస్తోంది. ఇది సామాన్యమైన విజయం కాదు. నాటుకోడి... నల్ల మాంసం ‘నేను తెలంగాణ నాన్‌వెజ్ కూడా బాగా చేస్తాను. అవే నాకు పేరు తెచ్చాయి. మటన్, చికెన్, నాటుకోడి, బిర్యానీ, నల్ల మాంసం, బోటీ, చేపల పులుసు, చైనీస్, ఇండియన్ అన్ని వెరైటీలు చేస్తాను.అయితే పని వస్తేనే సరిపోదు.క్రమశిక్షణ ఉండాలి. 25 ఏళ్ల కింద కరీంనగర్ పట్టణంలో స్కూటీ నడిపే ఐదారుగురు మహిళల్లో నేను ఒకదాన్ని. టైంకు ఫంక్షన్లకు వెళ్లాలని పట్టుబట్టి మరీ స్కూటీ నేర్చుకున్నా. మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్‌లు బాగా ప్రోత్సహిస్తారు. వారి ఇంట్లో, రాజకీయ పార్టీలకు నాదే వంట. కాలేజీ ఫంక్షన్ల నుంచి రాజకీయ సభల దాకా 20 వేల మందికి ఇట్టే వండిపెడతా.ఈ రోజు నా వద్ద 30 మంది స్త్రీలకు ఉపాధి కల్పిస్తున్నా, నా దగ్గర పని నేర్చుకున్న స్త్రీలు ఎందరో వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడ్డారు క్యాటరింగ్ చేసుకుంటూ’ అందామె. వేములవాడ నుంచి పుష్కరాల దాకా ‘కష్టపడుతూ నిజాయతీగా ఉంటే దేవుడు అవకాశాలు తానే ఇస్తాడు. అలాగే నాకూ ఇస్తున్నాడు. ఏటా శివరాత్రి ఉత్సవాలకు దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో భక్తులకు వండి పెట్టే భాగ్యం దక్కింది. అలాగే కొండగట్టు హనుమాన్ జయంతి వేడుకలకు కూడా పిలుస్తారు. గోదావరి పుష్కరాలకు కూడా వండాను. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్తవారింట్లోనే 25 ఏళ్లుగా వంటలు చేస్తున్నాను. సీఎం గారిని చాలాసార్లు చూశాను. ఆయన నా వంటలు రుచి చూశారు. కానీ ఏనాడూ మాట్లాడే అవకాశం దక్కలేదు. ఆయన కుమారుడు కేటీఆర్ మూడు సభలకు వండిపెట్టాను. అందులో అసెంబ్లీ ఎన్నికలకి ముందు తరవాత 50 వేల మందికి వండాను. ఇటీవల తీగల బ్రిడ్జి శంకుస్థాపన సమయంలోనూ 20 వేల మందికి వంట చేశాను. నా వంటలు బాగున్నాయని కేటీఆర్ కితాబిచ్చారు’ అందామె. ఇంటికి పెద్దకొడుకయ్యా ‘నాకు ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు. మా నాన్న అనారోగ్యంతో చనిపోతూ చిన్న చెల్లె, తమ్ముడు బాధ్యతలను నాకు అప్పగించారు. తమ్ముడిని నా దగ్గరే ఉంచి చదివించి వాడి పెళ్లి చేశాను. చెల్లి పెళ్లిలోనూ నాకు చేతనైనంత సాయపడ్డా. మొన్న ఊళ్లో అమ్మవారి గుడిలో విగ్రహం పెట్టించి, వెండి కిరీటం చేయించా. ఊరంతా కదలివచ్చి అభినందించింది. అంతేకాదు, నాకు ఊరి నుంచి రావాల్సిన మూడున్నర ఎకరాల భూమిని నా కొడుకు వెంకటేశ్ పేరిట ఊరంతా ఒక్కటై చేయించింది’ అందామె. ఒంటరి మహిళలకు భయం వద్దు ‘ఏ కారణం చేతనైనా సమాజంలో మహిళలు ఒంటరిగా బతకాల్సి వస్తే అస్సలు భయపడవద్దు. కష్టపడి చేసే ఏ పనైనా బెరుకు, భయం వద్దు. నిజాయతీగా చేస్తే తప్పకుండా ఎదుగుదల ఉంటుంది. ఆ నిజాయతీ మీకు, మీ పనికి తప్పకుండా గుర్తింపు తీసుకువస్తాయి. ఏనాడూ ఆడిన మాట తప్పకూడదు. అలా చేస్తే మార్కెట్లో, సమాజంలో పలుచనైపోతాం. నేను లక్ష రూపాయల వంటకు ఆర్డర్ తీసుకున్నాక అదేరోజు పని చేయాలంటూ కోటి రూపాయల ఆర్డర్ వచ్చినా తీసుకోను. మాటంటే మాటే.ఆ నిజాయితీ ఉంటే తప్పకుండా పైకి రావచ్చు’ అందామె. యాదమ్మను మెచ్చుకోకుండా ఎలా ఉండగలం? – భాషబోయిన అనిల్‌కుమార్, సాక్షి ప్రతినిధి, కరీంనగర్ ఫొటోలు: ఏలేటి శైలేందర్‌రెడ్డి -
దాల్చిని @ యాప్
మహిళలు ఆఫీసులలో పనులను సమర్థవంతంగా పూర్తి చేయవచ్చు. గొప్ప గొప్ప ప్రాజెక్టులను అవలీలగా క్లియర్ చేయవచ్చు. కానీ, వారు ఇంటికి తిరిగి రాగానే కుటుంబసభ్యుల నుంచి ‘తినడానికి ఏముంది?’ అనే సాధారణ ప్రశ్నను చాలా మంది ఎదుర్కొంటుంటారు. ఉదయం పనికి వెళ్ళే ముందు కూడా ఆ రోజుకు కావాల్సినవన్నీ అమర్చిపెట్టి వెళుతుంటారు. వంట అనేది మహిళలకు ఓ పెద్ద సమస్య. దీనినే తన వ్యాపారానికి అవకాశంగా మలుచుకుంది ప్రేరణ. దాల్చిని పేరుతో మొబైల్ యాప్, ఐఓటి వెండింగ్ మెషిన్ల ద్వారా ఇంటి వంటను అందిస్తోంది. 2009లో ఐఎమ్‌టిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులో రజత పతకం సాధించిన ప్రేరణకు ఎనిమిదేళ్ల కార్పొరేట్ అనుభవం ఉంది. ఒత్తిడి నుంచి ఉపశమనం మహిళలకు రోజువారీ వంట ఒత్తిడి నుండి ఉపశమనం ఇవ్వడమే కాకుండా ఇంట్లో వండిన ఆరోగ్యకరమైన భోజనాన్ని దాల్చిని ద్వారా అందిస్తోంది ప్రేరణ. భార త సంప్రదాయ ఇళ్లలో వండిన ఆహారం కోసం ఏర్పాటు చేసిన భౌతిక మార్కెట్ ఇది. ఐఓటి ఆధారిత వెండింగ్ మెషిన్ల ద్వారా టిఫిన్ సేవల నెట్‌వర్క్‌నూ అందిస్తోంది. 36 ఏళ్ల ప్రేరణ మాట్లాడుతూ– ‘ఇంట్లో వండిన భారతీయ వంటకాలు, రొట్టెలు, స్నాక్స్ వంటివి ఎక్కడైనా, ఎప్పుడైనా అందుబాటులో ఉంచే లక్ష్యంతో దాల్చిని ప్రారంభమైంది’ అని వివరించింది. వైవిధ్యమైన పాత్రలు వ్యాపారిగా, వృత్తి నిపుణురాలిగా, ఆరేళ్ల అమ్మాయికి తల్లిగా ప్రేరణ తన పని గంటల ప్రకారం సమయానుసారంగా కుటుంబసభ్యులకు ఆహారాన్ని పంపిణీ చేయడంలో ఇబ్బందిని గుర్తించింది. దీనినే అవకాశంగా మలుచుకున్న ప్రేరణ... చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. ‘పట్టణ వయోజన శ్రామిక జనాభాలో 69 శాతానికి పైగా పని కోసం బయల్దేరినవారికి ఇంట్లో వండిన ఆహారం లభించదు. హోమ్ టిఫిన్ సేవల్లో ప్రజలు మరింత రుచి, నాణ్యత, నమ్మకం కోసం ఎదురు చూస్తున్నారు. వారి కోసమే దాల్చిని ఏర్పాటయ్యింది’ అని వివరిస్తుంది ప్రేరణ. మహిళలే కీలకం ఐఓటీ వెండింగ్ మెషన్ దాల్చిని మెనూలో సోయా మసాలా క్రాకర్స్, మహారాష్ట్ర చివ్డా, మామ్ స్టైల్ అజ్వైని పరాఠా, హెల్తీ దాల్ పరాఠా, పార్సీ కేక్ రస్క్, గ్రీన్ బఠానీ మినీ సమోసా, గోబీ మంచూరియా, వెజిటబుల్ బిర్యానీ, మల్టీగ్రెయిన్ కుకీలు, సాస్‌తో వడాపావ్‌లు ఉన్నాయి. ఎంపిక చేసుకున్న తర్వాత, ఆర్డర్ ద్వారా చెల్లింపులు ఉంటాయి. యాప్ ద్వారా ‘ఆర్డర్లలో ముప్పై శాతం రాత్రి 10 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు స్వీకరిస్తాం. వ చ్చిన ఆర్డర్ల ప్రకారం ఆ ప్రాంతంలోని ఇంటి మహిళలకు సమాచారం చేరుతుంది. వారి ద్వారా సమయానుకూలంగా ఆర్డర్ చేసినవారికి వంటను అందిస్తాం. కుటుంబానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంలో మహిళదే కీలకమైన బాధ్యత. పనిచేసే మహిళా నిపుణులకు ఇది సవాల్ లాంటిది. ఇతర వృత్తులలోని మహిళలకు వంట చేసే బాధ్యతను పంచుకునేందుకు తమ ఇంటి నుండి టిఫిన్ సేవలను నడుపుతున్నవారికి దాల్చిని అవకాశం కల్పిస్తుంది. ఇళ్లలోని మహిళా చెఫ్‌లకు అవకాశాలు కల్పించే మంచి యాప్ ఇది. తద్వారా వారు గుర్తింపును పొందుతున్నారు’ అని వివరిస్తుంది ప్రేరణ. -
వంటింటి కథ
హ్యూమర్ ఫ్లస్ సుందరి, సుబ్బారావులు భార్యాభర్తలు. అయినా ఒకే మాటపై ఉంటారు. సినిమాల్లోలా ఒకే పాట పాడుతారు. ఇద్దరికీ వంటలంటే ఇష్టం. స్టార్ వరల్డ్‌లో వచ్చే మాస్టర్ చెఫ్‌తో మొదలుపెట్టి లోకల్ ఛానల్స్‌లో వచ్చే మీ ఇంటి వంట వరకూ అన్నీ చూస్తారు. పేపర్లలోని రెసిపీలను కట్‌చేసి దాచుకుంటారు. ఉల్లిపాయల్ని ఎన్ని రకాలుగా కోస్తారో, క్యాలిఫ్లవర్ని ఏ రకంగా కడుగుతారో నిద్రలో లేపి అడిగినా చెప్పేస్తారు. ఇంటికి గెస్ట్ వస్తే ఇద్దరూ పోటీపడి మాట్లాడుతారు. ‘‘దేవుడొక్కడే అయినా రూపాలు అనేకం అయినట్టు, కోడి ఒక్కటే కానీ, కూరలు కోకొల్లలు. చికెన్ ఉంటేనే కిచెన్‌కి అందం. కోడి లేకుండా పకోడి ఉండచ్చు. చికెన్ లేకుండా చికెన్ 65 ఉండదు. తందూరి ఎలా వండుతారంటే...’’ అని సుబ్బారావు స్టార్ట్ చేస్తే సుందరి దూరి, ‘‘చిల్లీ చికెన్‌లో మిర్చీ కనపడనట్టు, బటర్ చికెన్‌లో పెరుగు అంతర్లీనంగా ఉన్నట్టు దేన్నీ మనం నేరుగా చూపకూడదు, చెప్పకూడదు. వంట కూడా ఒక మార్మిక కళ. 64 కళల్లో పాకశాస్త్రం ముఖ్యమైంది. వంటవాళ్లలో నలభీములు ముఖ్యులు...’’ఈ ప్రవాహం ఇలా సాగుతూ ఉండగా ఒక నిమ్మకాయతో సుబ్బారావు వస్తాడు. ‘‘చికెన్ కబాబైనా, రుబాబైనా, పత్తర్‌కి ఘోష్, కలాపత్తర్కి ఫిష్ అయినా నిమ్మ పిండితే ఆ టేస్టే వేరు. నిమ్మని రెండు రకాలుగా పిండొచ్చు. చేత్తో పిండితే గింజలు చెయ్యిజారిపోతాయి. అదే జ్యూసర్లో వేస్తే తొక్క తుక్కయిపోతుంది. నిమ్మ చెక్కయినా, తొక్కయినా...’’ సుందరి అడ్డుపడి, ‘‘నిమ్మకి పెద్దన్న దానిమ్మ. పెరుగన్నంలోకి దానిమ్మ వేస్తే...’’ ‘‘నువ్వు కాస్తాగు. బాబాయిగారికి టమోటా టాంటాం గురించి చెబుతా. టమోటాని దీర్ఘ చతురస్రాకారంగా కోసి ఉప్పు చల్లి, ఉడికించి, మిరియాలు వేసి, ఆవాలు తిరగమోత పెట్టి...’’ అంటాడు సుబ్బారావు. ‘‘అసలు పాలకూర జావ తాగితే ఉంటుంది రుచి... పాలకూరని పద్దెనిమిదిసార్లు కడిగి, ఇరవై సార్లు జాడించి, పొయ్యి వెలిగించకముందే బాణలి పెట్టి...’’ సుందరి దెబ్బకి అతిథి పారిపోతాడు. ఆ తరువాత వీళ్లిద్దరూ కూచుని గోరంత పసుపు పొడితో కొండంత జబ్బులు ఎలా మాయమవుతాయో చర్చిస్తారు. ఒకసారి ఏదో పేపర్లో వంకాయలు కోసే విధానం గురించి తప్పుగా రాశారని, ఆ ఎడిటర్‌కి చేత్తో ఉత్తరం రాయడంతో పాటు, ఈమెయిల్ పంపి, ఫేస్బుక్లో డిబేట్ పెట్టారు. తమ వాదనని సమర్థించుకోవడానికి హోరాహోరీగా పోరాడారు. ధమ్ బిరియాని గురించి సుబ్బారావు ఒక వ్యాసం రాస్తే, ధమ్మర్ధమ్ బిరియాని గురించి సుందరి ఇంకో వ్యాసం రాసింది. రెంటికి తేడా ఏంటో అర్థంకాక, పాఠకులు జుత్తు పీక్కుంటే ములక్కాయల రోస్ట్ తింటే జుత్తు ఏపుగా పెరుగుతుందని చిట్కా కూడా రాశారు. వంటల గురించి ఏళ్ల తరబడి యుద్ధం చేసిన ఈ దంపతులు వండగా చూసినవాళ్లు లేరు, తిన్నవాళ్లూ లేరు. వీళ్లను చూసి నవ్వినవాళ్లూ లేరు. జీవితమంతా ఆదర్శాలు, ఆశయాల గురించి కలవరిస్తూ, ఒక్కక్షణం కూడా ఆచరించకుండా జీవించేవాళ్లు కోట్లాది మంది ఉండగా, వీళ్లను చూసి నవ్వడమెందుకు? ఈ దంపతులు నిజంగా అమాయకులు. - జి.ఆర్.మహర్షి