Home Guard Commits Suicide
-
సస్పెండ్ చేశారని.. హోంగార్డు హల్చల్
పంజగుట్ట: అకారణంగా తనను విధుల్లోనుంచి సస్పెండ్ చేశారని, వెంటనే విధుల్లోకి తీసుకోవాలని లేని పక్షంలో పోలీస్‌స్టేషన్ ఎదుటే ఆత్మహత్యకు పాల్పడతానని ఓ హోంగార్డ్ హల్చల్ చేసిన సంఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎదుట చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..నార్సింగ్‌కు చెందిన యాదీలాల్ పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. ఇతను మద్యం మత్తులో విధులకు హాజరవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గత నెల 7న ఫిర్యాదు దారులతో సరిగ్గా ప్రవర్తించనందున అతడిని హోంగార్డ్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. గురువారం అతడిని పిలిచిన హెడ్ క్వార్టర్స్ అధికారులు నిన్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు అందినందున, డ్యూటీకి రావాల్సిన అవసరం లేదని పేర్కొంటూ ఉత్తర్వులను అందించారు. దీంతో నేరుగా పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన యాదీలాల్ ఆత్మహత్య చేసుకుంటానని హల్ చేశాడు. హంగామాచేశాడు. ఈ సందర్భంగా యాదీలాల్ మాట్లాడుతూ అకారణంగా తనను సస్పెండ్ చేశారని, తాను సరిగా విధులు నిర్వహించడం లేదని, ఫిర్యాదు దారులతో అసభ్యంగా మాట్లాడినట్లు ఆరోపిస్తున్న అధికారులు అందుకు ఆధారాలు చూపాలని కోరాడు. మే 5న పోలీస్‌స్టేషన్ బ్యారెక్‌లో కొందరు హోంగార్డులు గొడవపడ్డారని, అందుకు తనను బాధ్యుడిని చేస్తూ చర్య తీసుకోవడం దారుణమని ఆరోపించాడు. తనను విధుల్లోంచి తొలగిస్తే తన కుటుంబం రోడ్డున పడుతుందని ఆవేదనవ్యక్తం చేశాడు. తనకు న్యాయం జరిగేవరకు అక్కడి నుంచి కదిలేదని భీష్మించుకున్నాడు. ఆరోపణలు అవాస్తవం.. హోంగార్డు యాదీలాల్ ఆరోపణలు అవాస్తవమని పంజగుట్ట ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ తెలిపారు. అతడి ప్రవర్తన సరిగా లేనందున పలుమార్లు హెచ్చరించామని, అయినా వైఖరిలో మార్పు రాకపోవడంతో మే 7న హోంగార్డ్ హెడ్‌క్వార్టర్స్‌కు అతడిని అటాచ్ చేసినట్లు తెలిపాడు. యాదీలాల్సస్పెన్షన్ విషయం తనకు తెలియదని పేర్కొన్నారు. ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ -
హోంగార్డు ఆత్మహత్య
శృంగవరపుకోట : స్థానిక అగ్నిమాపక శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శృంగవరపుకోటలోని మునసబు వీధిలో నివాసముంటున్న వసంత ఎరుకునాయుడు(28) అగ్నిమాపక శాఖ కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఆయన మంగళవారం మధ్యాహ్నం 3.15 గంటలకు ఫైర్ ఆఫీసర్ రామచంద్రకు ఫోన్‌చేసి ‘సార్ నేను చనిపోతున్నా. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నా..’ అని చెప్పాడు. ఎక్కడున్నావని రామచంద్ర ప్రశ్నించడంతో పుణ్యగిరి కొండపై ఆశ్రమం వద్ద ఉన్నానని తెలిపాడు. వెంటనే ఇద్దరు ఫైర్మెన్లను పుణ్యగిరికి పంపగా, వారు ఎరుకునాయుడిని గుర్తించి సాయంత్రం ఐదు గంటల సమయంలో ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు పంపారు. ఫైర్ సిబ్బంది సమాచారం మేరకు ఎస్ఐ రవికుమార్ వచ్చి ఎరుకునాయుడు వద్ద ఉన్న సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఎరుకునాయుడు మరణించాడు. సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. ఎరుకునాయుడుకు భార్య మణి, కుమార్తె సౌజన్య ఉన్నారు. మనశ్శాంతి లేక చనిపోతున్నా.. తల్లి కాంత తనను తప్పుడుమార్గంలో పెంచిందని, తాగుడు నేర్పించిందని, తండ్రిని కొట్టించిందని మనశ్శాంతి లేక మరణిస్తున్నానని ఎరుకునాయుడు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. తల్లి కాంత, మరో ముగ్గురు తనపై తప్పుడు కేసులు బనాయించి, గౌరవంగా బతకనీయకుండా చేస్తున్నారని, స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని, వారి వేధింపుల వల్లే చనిపోతున్నానని రాశాడు. తన కూతురిని చిన్నమామకు అప్పగించాలని, భార్యకు మరో పెళ్లి చేయాలని కోరాడు. ఆస్తిని తన తల్లి, భార్య, కుమార్తెకు సమానంగా పంచాలని పేర్కొన్నాడు. తన తండ్రి దహన సంస్కారాలకు ఎవరూ రాకపోవడం బాధించిందని రాశాడు. తన దహన సంస్కారాలకు బంధువులు, కుటుంబ సభ్యుల మొత్తం హాజరుకావాలని ఆ లేఖలో విన్నవించాడు.