ప్రవాసుల వల్లే హోమ్ హెల్త్ కేర్ వృద్ధి!
2 బిలియన్ డాలర్లకు చేరిన
హోమ్ హెల్త్ కేర్ మార్కెట్
► హైదరాబాద్‌లో ఐహెచ్‌హెచ్‌సీ సేవలు ప్రారంభం
► ఈ ఏడాది ముగింపు నాటికి మరో 3 నగరాల్లో కూడా
► ఐహెచ్‌హెచ్‌సీ కో-ఫౌండర్, ఎండీ వీ త్యాగరాజన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో హోమ్ హెల్త్ కేర్ మార్కెట్ రోజురోజుకూ శరవేగంగా విస్తరిస్తోంది. ఇందుకు కారణం ప్రవాస భారతీయులేనని ఇండియన్ హోమ్ హెల్త్ కేర్ (ఐహెచ్‌హెచ్‌సీ) కో-ఫౌండర్, ఎండీ వీ త్యాగరాజన్ చెప్పారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సుమారు 8 మిలియన్ల మంది ఎన్నారైలు ప్రపంచంలోని వేర్వేరు దేశాల్లో స్థిరపడిపోయారు. వారి తల్లిదండ్రులు, సన్నిహితులు ఇక్కడే ఉన్నారు. వారి బాగోగుల కోసం ఎన్నారైలు హోమ్ హెల్త్ కేర్లను ఆశ్రయిస్తున్నారని ఆయన చెప్పారు. ఐహెచ్‌హెచ్‌సీ సేవలు మంగళవారమిక్కడ ప్రారంభమాయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
♦ ప్రస్తుతం దేశంలో హోమ్ హెల్త్ కేర్ మార్కెట్ 2 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏటా 20 శాతం వృద్ధి రేటును కనబరుస్తోంది. 2009లో చెన్నైలో ప్రారంభమైన ఐహెచ్‌హెచ్‌సీ సేవలు ఆ తర్వాత బెంగళూరు, పుణే, అహ్మదాబాద్, గుజరాత్‌లోని మూడు నగరాలతో పాటు ఇప్పుడు హైదరాబాద్‌కు విస్తరించింది. ఈ ఏడాది ముగింపు నాటికి కోయంబత్తూర్, విశాఖపట్నం, మైసూరు నగరాలకూ విస్తరిస్తాం.
♦ రోజుకు 250 మంది రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. ఏటా 10 వేల మందికి సేవలందిస్తున్నాం. ఆసుపత్రిలో చికిత్సతో పోల్చుకుంటే 20-30 శాతం త్వరగా కోలుకుంటారు. ఖర్చూ 40 శాతం తక్కువగా ఉంటుంది.
♦ ప్రధానంగా నర్సింగ్ కేర్ సేవలపై దృష్టిసారించాం. ఇందుకు గాను 12 గంటలకు రూ.650 చార్జీ వసూలు చేస్తున్నాం. ఊపిరితిత్తులు, అర్థోపెడిక్స్, కార్డియోలజీ, న్యూరాలజికల్ సంబంధిత వ్యాధులకు వైద్యులు, నర్సులను పెట్టి చికిత్స చేయిస్తాం. జార్ఖండ్‌లోని రెండు ఎన్జీవోల సహాయంతో నర్సులకు శిక్షణ ఇచ్చి సంస్థలో నియమించుకుంటున్నాం. ప్రస్తుతం కంపెనీలో 500 మంది ఉద్యోగులున్నారు.