Homi Bhabha
-
క్యాన్సర్ చికిత్సపై సీఎం జగన్ ఆ విధంగా ఆలోచన చేస్తున్నారు: కృష్ణబాబు
సాక్షి, అమరావతి: హోమీబాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రి, తిరుపతి స్విమ్స్, విజయవాడ చినకాకాని ఆసుపత్రిలో క్యాన్సర్ ట్రీట్మెంట్పై ఒప్పందం జరిగినట్లు వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు. ఈ మేరకు కృష్ణబాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఏపీలో క్యాన్సర్ చికిత్సకు నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తోంది. గత ఏడాది లక్షా 30 వేల మందికి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రతి 50 కిలోమీటర్లకు క్యాన్సర్ వైద్యం అందే స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలిదశలోనే క్యాన్సర్‌ను గుర్తించి వైద్యం అందించాలనే ఆలోచన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. గ్రామ సచివాలయాలు క్యాన్సర్‌కి సంబంధించి టెలి కన్సల్టెన్సీ సర్వీస్ ఏర్పాటు చేశామని వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు. ఇదిలా ఉంటే, రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాలో సుమారు 120 మంది క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు ఓ అంచనా. ఈ సంఖ్య భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధునాతన వైద్య విధానాలతో రాష్ట్రంలో క్యాన్సర్ చికిత్స వనరులను సమకూర్చేందుకు ప్రణాళికలు రచించారు. ఈ క్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ విశాఖపట్నం హోమీ బాబా ఆస్పత్రి నుంచి సాంకేతిక సహకారం పొందనుంది. వ్యాధి గుర్తింపునకు స్క్రీనింగ్, పలు రకాల క్యాన్సర్ ప్రమాదాల గుర్తింపు, జిల్లాల్లో ప్రివెంటివ్ అంకాలజీ, క్యాన్సర్ డే కేర్ సేవలు అందుబాటులోకి తేవడం, రిజిస్ట్రీ, ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బందికి నైపుణ్యాల పెంపునకు శిక్షణ అందించడం వంటివి హోమీ బాబా ఆస్పత్రి అందించనుంది. ప్రభుత్వాస్ప త్రుల్లో పొగాకు విరమణ కేంద్రాల ఏర్పాటు, స్క్రీనింగ్‌లో నిర్ధారించిన క్యాన్సర్ రోగులు, హైరిస్క్ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు రెఫరల్ విధానం రూపకల్పనకు సంబంధించి హోమీ బాబా ఆస్పత్రి సహకారం అందించనుంది. విభజన అనంతరం క్యాన్సర్ చికిత్స వనరులను ఏపీ కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో క్యాన్సర్ వ్యాధి కట్టడి, ప్రభుత్వ రంగంలో చికిత్స వనరులను మెరుగుపరచడంపై సీఎం వైఎస్ జగన్ సర్కార్ దృష్టి సారించింది. భవిష్యత్‌లో క్యాన్సర్ చికిత్స కోసం ఇతర రాష్ట్రాలకు ప్రజలు వెళ్లకుండా రాష్ట్రంలోనే చికిత్స వనరులను మెరుగుపరచనున్నారు. చదవండి: (టీడీపీ ఆరిపోయే దీపం: మంత్రి జోగి రమేష్) -
అందరిలా ఎందుకు?
పిల్లల్తో రోజూ కాసేపు కలసి కూర్చుంటే, కలసి మాట్లాడితే.. వాళ్లెంత భిన్నమైనవారో అర్థమౌతుంది. హోమీ జహంగీర్ బాబా ప్రసిద్ధ అణు భౌతిక శాస్త్రవేత్త. చిన్నప్పుడు సరిగ్గా నిద్ర పోయేవాడు కాదు. చదువులో పడి నిద్రపోకపోవడం కాదు... ఆలోచనల్లో పడి నిద్ర పోకపోయేవాడు! ‘ఇక పడుకోరా..’ అంటే నిద్ర రావడం లేదనేవాడు! డాక్టర్లు సమస్యేం లేదనేవాళ్లు. చివరికి స్పెషలిస్టు ఒకాయన కనిపెట్టి చెప్పాడు.. ‘‘మీవాడి బ్రెయిన్ సూపర్ యాక్టివ్’గా పనిచేస్తోంది అని! అందుకే అదెప్పుడూ మేల్కొనే ఉంటోందనీ! హోమీకి సైన్స్ అంటే ఇష్టం. అతడివన్నీ సైన్స్ చుట్టూ తిరిగే ఆలోచనలే. పిల్లవాడి ఇష్టాన్ని గ్రహించి, ఏకంగా ఇంట్లోనే ఒక గ్రంథాలయం ఏర్పాటు చేశారు పేరెంట్స్! పిల్లల్ని మనం ఎప్పుడూ మిగతా పిల్లల్తో పోల్చుకుంటూ ఉంటాం. అందరు పిల్లలూ ఉన్నట్లు వీడెందుకు ఉండడు? అని మథన పడుతుంటాం. అందరు పిల్లలూ ఎలా ఉంటారు? ఎలాగైనా ఉంటారు. ఒకేలా మాత్రం ఉండరు. అయితే.. మనం ఒకేలా ఉండే పిల్లల్ని మాత్రమే చూస్తాం. చక్కగా చదువుకునే పిల్లలు; వేళకు చదువుకుని వేళకు నిద్రపోయే పిల్లలు, పెట్టింది వద్దన కుండా, వదిలిపెట్టకుండా తినే పిల్లలు.. వీళ్లతో మనవాళ్లను పోల్చి చూసుకుంటాం. అప్పుడు మన పిల్లవాడేదో వెనకబడిపోతున్నాడనీ, ఆరోగ్యంగా లేడనీ, వీడి భవిష్యత్తు ఏమిటోనని కలత చెందుతాం. అంతే తప్ప తక్కిన పిల్లలకీ, మన వాడికీ మధ్య ఉన్న తేడాలను మాత్రం గమనించం. తేడాలను గమనించకుండా, పోలికలను మాత్రమే చూసుకుంటే కలిగే ఇబ్బందే ఇది. హోమీ బాబా తల్లిదండ్రులు కూడా మొదట హోమీని ఇలాగే పోల్చి చూసుకున్నారు. డాక్టర్ చెప్పాక తేడాను గమనించి, పిల్లవాడిలోని ఆసక్తిని గమనించి అతడిని కావలసిన సదుపాయాలను అందించారు. హోమీ గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగాడు. పిల్లలు ఎదక్కుండా పోరు. మన ఇష్టాలకు తగ్గట్లు వాళ్లను ఎదిగేలా చేయాలన్న తపనే మన బాధకు, పిల్లవాడి కష్టానికి కారణం అవుతుంటుంది. పిల్లల్తో రోజూ కాసేపు కలసి కూర్చుంటే, కలసి మాట్లాడితే.. వాళ్లెంత భిన్నమైనవారో అర్థమౌతుంది. ఆ భిన్నత్వానికి భిన్నంగా మనమెలా ఆలోచించి వాళ్లపై ఒత్తిడి తెస్తున్నామో తెలుస్తుంది. (‘భారత అణు కార్యక్రమ పితామహుడు’ హోమీ బాబా వర్ధంతి నేడు) -
అణుశక్తిమాన్!
సంక్షిప్తంగా... హోమీ భాభా ముంబైలోని రెండు గంభీరమైన సంస్థలు... టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్, భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్ లతో ముడివడివున్న సాధుశీల అణుభౌతిక నామం... హోమీ జహంగీర్ భాభా. ఈ పేరులోని ‘హోమీ’కి పార్శీ భావం ‘కాంకరర్ ఆఫ్ ది వరల్డ్’. జగద్విజేత! అయితే ఆయనెప్పుడూ తన దేశాన్నే ముందు వరుసలో ఉంచాలనుకున్నారు తప్ప అణు పితామహుడిగా ఎదగాలన్న ధ్యాసతో లేరు. పితామహుడన్నది ఈ దేశం గౌరవసూచకంగా ఆయనకు పెట్టుకున్న పేరు. 1966 జనవరి 24న హోమీ భాభా ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం 101 ఫ్రాన్స్‌లోని మాంట్ బ్లాంక్‌లో కుప్పకూలిపోకుండా ఉన్నట్లయితే, కొద్ది గంటల తర్వాత భారతీయ అణు కార్యక్రమంపై వియన్నా సమావేశంలో అతడు సమర్పించబోతున్న కీలకమైన పత్రాలను ఆయన తీసుకు వెళ్లగలిగి ఉంటే... ఏమో, అంతర్జాతీయ అణుశక్తి రంగంలో భారత్ జగద్విజేతగా నిలిచి ఉండేదేమో! దురదృష్టం. ఆ ప్రమాదంలో హోమీ భాభా మరణించారు. భాభా స్థాపించి, డెరైక్టర్‌గా ఉన్న పై రెండు సంస్థలు ప్రస్తుతం భారతీయ అణుసామర్థ్య అభివృద్ధిలో ఆయన ఆశయాలకు అనుగుణంగా నిబద్ధతతో పనిచేస్తున్నాయి. భాభా ఆశయం అణుశక్తి మాత్రమే కాదు. అణుశాంతి కూడా! నేర్చుకోవడం, దేశానికి సేవ చేయడం అన్నవి పారంపర్య సంప్రదాయంగా ఉన్న సంపన్న కుటుంబంలో 1909 అక్టోబర్ 30న జన్మించారు హోమీ జహంగీర్ భాభా. తండ్రి జహంగీర్ హార్ముస్జీ భాభా. ప్రసిద్ధ న్యాయవాది. తల్లి మెహరిన్. ప్రాథమిక, ప్రాథమికోన్నత, కళాశాల విద్యాభ్యాసాలు ముంబైలో పూర్తయ్యాక, మెకానికల్ ఇంజినీరింగ్‌లో అధ్యయనానికి కేంబ్రిడ్జి వెళ్లారు హోమీ. సెలవులకు ఆయన ఇండియా వచ్చేనాటికి రెండో ప్రపంచ యుద్ధ మేఘాలు దట్టంగా అలుముకుని ఉన్నాయి. ఇక ఇక్కడే ఉండిపోయి. బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ సైన్స్‌లో ఫిజిక్స్ రీడర్‌గా చేరారు. అప్పుడా సంస్థకు నేతృత్వం వహిస్తున్నది నోబెల్ గ్రహీత సీవీ రామన్. ఆయన ఆధ్వర్యంలో హోమీ అణుశాస్త్రానికి సంబంధించి కాస్మిక్ కిరణాలపై కీలకమైన పరిశోధనలు, ప్రయోగాలు చేశారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో ఉన్న సాన్నిహిత్యం వల్ల భారత అణు, అంతరిక్ష కార్యక్రమాలను రూపొందించడానికి అవసరమైన ప్రభుత్వ సహకారాన్ని తీసుకోగలిగారు. భాభా బ్రహ్మచారి. పెళ్లెందుకు చేసుకోలేదని చనువున్న వారెవరైనా అడిగితే ఆయన చిరునవ్వు నవ్వేవారు. ‘‘భౌతికశాస్త్రంలోని సృజనాత్మకతతో నా వివాహం బాల్యంలోనే జరిగిపోయింది’’ అనేవారు. అణుశక్తి రంగంలో అపారమైన, అమూల్యమైన సేవలను అందించారు హోమీ భాభా. ముంబైలోని మలబార్ హిల్స్‌లో ఉన్న ఆయన స్వగృహం మెహరంగిర్ను ఇటీవలి వేలంలో ఎన్.సి.పి.ఎ. (నేషనల్ సెంటర్ ఫర్ ద పెర్ఫార్మింగ్ ఆర్ట్స్) సంస్థ రూ. 372 కోట్లకు దక్కించుకుంది. - భావిక